Jun 19 2021 @ 17:15PM

శేఖర్‌ కమ్ములతో చిత్రం.. ధనుష్‌ స్పందన ఇదే

నేను ఎంతో ఇష్ట‌ప‌డే ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన‌ శేఖ‌ర్ క‌మ్ములగారితో క‌లిసి వ‌ర్క్ చేసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నానని తెలిపారు కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ధ‌నుష్‌. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్స్ సూప‌ర్‌స్టార్ ధ‌నుష్‌, సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేషన్‌లో తమిళ, తెలుగు మరియు హిందీ భాషలలో ఏకకాలంలో ఒక  చిత్రం రూపొంద‌నుందని శుక్రవారం అధికారికంగా నిర్మాతలు నారాయణ్ దాస్ కె నారంగ్ - పుస్కూర్ రామ్ మోహన్ రావు తెలిపిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్‌లో త్రిభాషా చిత్రంగా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాతలు నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావులతో కలిసి పనిచేసినందుకు ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్న‌ట్లుగా ధ‌నుష్ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.


''నేను ఎంతో ఇష్ట‌ప‌డే ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన శేఖ‌ర్ క‌మ్ములగారితో కలిసి పని చేయ‌బోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ త్రిభాషా చిత్రం కోసం ఎస్‌విసి ఎల్ఎల్‌పి బ్యానర్‌లో నారాయణ దాస్ నారంగ్ సర్ మరియు పుస్కూరు రామ్‌మోహన్ రావు సర్ తో క‌లిసి ప‌ని చేయ‌డం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను" అని ధ‌నుష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.