Abn logo
Aug 8 2020 @ 21:18PM

కోజికోడ్ ఎయిర్ పోర్టుకు ఏడాది క్రితమే షోకాజ్ నోటీసులిచ్చిన డీజీసీఏ

న్యూఢిల్లీ: కోజికోడ్ ఎయిర్‌పోర్టులో ‘‘పలు క్లిష్టమైన భద్రతా లోపాలపై’’ ఏడాది క్రితమే విమానాశ్రయ డైరెక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు భారత వైమానిక రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ వెల్లడించింది. రన్‌వే, ఏప్రాన్ సహా పలు ప్రాంతాల్లో భద్రతా లోపాలపై 2019 జూలై 11న నోటీసులు ఇచ్చినట్టు ఓ సీనియర్ అధికారి శనివారం వెల్లడించారు. రన్‌వేపై పగుళ్లు, వర్షపు నీరు స్తంభించడం, మోతాదుకు మించి రబ్బర్ ముక్కలు పడివుండడం వంటి పలు విషయాలను షోకాజ్ నోటీసులో ప్రస్తావించినట్టు తెలిపారు. ఇది జరిగిన సరిగ్గా ఏడాదికి ఈ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం దుబాయ్ నుంచి 190 మందితో వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం కోజికోడ్ విమానాశ్రయం రన్‌వే దిగుతూనే ప్రమాదానికి గురైంది. 18 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో బాధితులు మృత్యువుతో పోరాడుతున్నారు.


‘‘గతేడాది జూలై 2 ఘటన తర్వాత అదే నెల 4 నుంచి 5 వరకు డీజీసీఏ బృందం కోజికోడ్ ఎయిర్‌పోర్టును తనిఖీ చేసి పలు భద్రతా లోపాలు ఉన్నట్టు గుర్తించింది..’’ అని ఓ సీనియర్ డీజీసీఏ అధికారి పేర్కొన్నారు. జూలై 11న కోజికోడ్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కె శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసులు వెళ్లాయని మరో అధికారి  వెల్లడించారు. డైరెక్టర్‌పై ఏమైనా చర్యలు తీసుకున్నారా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘మేము పలు లోపాలను ఎత్తిచూపించి వెంటనే సరిదిద్దాలని సూచించాం. ఇదే విషయమై ఆయనను గట్టిగా మందలించడం జరిగింది..’’ అని పేర్కొన్నారు. కాగా నిన్న జరిగిన ప్రమాదంలో బాధితుల సహాయార్థం మూడు ప్రత్యేక విమానాలను కోజికోడ్‌కి పంపుతున్నట్టు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇవాళ కోజికోడ్ చేరుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement