Abn logo
Oct 24 2020 @ 05:15AM

అప్పటి లెక్కలు...ఇప్పుడా?

Kaakateeya

బదిలీలకు విద్యాశాఖ కసరత్తు

హేతుబద్ధీకరణ తీరుపై విస్మయం

ప్రస్తుత విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకోవాలి

ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌ 


(ఇచ్ఛాపురం రూరల్‌) : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలల కేటగిరీల వివరాలు సేకరిస్తోంది. ఉపాధ్యాయుల వివరాలను సరిచూసుకుని అప్‌డేట్‌ చేయాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎంఈవోలు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. మరోవైపు హేతుబద్ధీకరణ ప్రక్రియ తీరు ఉపాధ్యాయ సంఘాల్లో చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు తలకిందులై.. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక తదితర పథకాలకు  ఆకర్షితులయ్యారు.


ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటివరకూ 9,500 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నాటి సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులను కేటాయిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ విధానం అవలంభిస్తే పదిమంది విద్యార్థులు ఉన్న పాఠశాలకూ ఇద్దరే, 60 మంది ఉన్నా ఇద్దరే ఉపాధ్యాయులు ఉంటారు. దీనివల్ల అక్కడి ఉపాధ్యాయులపై పనిభారంతోపాటు బోధనపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి హేతుబద్ధీకరణ చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. 


కేటగిరీల వారీ వివరాల సేకరణ  

జిల్లాలో హెచ్‌ఆర్‌ఏ 20, 12, 10, 5 శాతాన్ని బట్టి వరుసగా కేటగిరీ -1, 2, 3లుగా విభజించారు. రోడ్ల సౌకర్యం లేని గ్రామాల్లో ఉన్న పాఠశాలలు కేటగిరి-4 పరిధిలోకి వస్తాయి. అలా జిల్లా వ్యాప్తంగా ఏ మండలంలో ఎన్ని పాఠశాలలు ఏ కేటగిరీలో ఉన్నాయో సేకరించాలి. దీంతో పాటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల వివరాలను పరిశీలించి డీఈవో లాగిన్‌కు అప్‌డేట్‌ చేయాలని ప్రభుత్వం మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఇలా చేయడం వల్ల జిల్లాలో ఉన్న ఖాళీ పోస్టులు... 5, 8 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారో పూర్తి సమాచారం తెలుస్తోంది. ఈ వివరాలను ముందుగానే సేకరిస్తే బదిలీలకు ఎంతమంది అర్హులు ఉన్నారో ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది.


ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల వివరాలను మండల విద్యాశాఖ అధికారి, ఉన్నత పాఠశాలల్లో   ఖాళీల వివరాలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆన్‌లైన్‌లో ఎంఈవో లాగిన్‌కు పంపాల్సి ఉంటుంది. వివరాల నమోదుపై ఉపాధ్యాయులందరికీ అవగాహన ఉండాలని అధికారులు చెబుతున్నారు. ట్రెజరీ ఐడీ, ఉపాధ్యాయుని పేరు, ప్రస్తుత పాఠశాలలో ఎన్నేళ్ల నుంచి పని చేస్తున్నారు.  సర్వీసులో ఎప్పుడు ప్రవేశించారు. గడిచిన 8 ఏళ్లలో స్పౌస్‌ కోటా వినియోగించుకున్నారా?, బోధిస్తున్న అంశం, ఎస్జీటీనా, స్కూల్‌ అసిస్టెంటా? ఏ భాషలో బోధిస్తున్నారు తదితర వివరాలు సరిచూసుకుని ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే నమోదు చేయాలని సూచిస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా బదిలీల ప్రక్రియ సాగనుంది.  


ఖాళీలన్నీ భర్తీ చేయాలి - ఆర్‌వీ.అనంతాచార్యులు, ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి

జిల్లావ్యాప్తంగా కొన్నేళ్ల కిందట కొన్ని ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా వర్గోన్నతి కల్పించారు. ప్రస్తుతం ఆ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు లేరు. కొన్నిచోట్ల సబ్జెక్టు ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాఠశాలల్లో ఖాళీల భర్తీపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి.


జీవం పోయాలి - బి.శంకరం, ఆపస్‌ మండల కార్యదర్శి, ఇచ్ఛాపురం.

హేతుబద్ధీకరణ ద్వారా పాఠశాలలకు జీవం పోయాలి. ఫిబ్రవరి నాటి విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటే చాలా పాఠశాలలు పోస్టులు కోల్పోతాయి. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించాం. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్యను బట్టి క్రమబద్ధీకరణ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

Advertisement
Advertisement