Abn logo
May 2 2020 @ 01:58AM

భ్రమాన్విత భావనలు- బాధాకర బతుకులు

లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత ఆర్థిక వ్యవస్థ తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుందా? పెద్ద నోట్ల రద్దు మహాతప్పిదానికి కుదేలయిపోయిన మన ఆర్థిక వ్యవస్థ ఇంతవరకూ కోలుకోనేలేదు. హడావుడిగా ప్రవేశపెట్టి, అస్తవ్యస్తంగా అమలుపరిచిన వస్తు -సేవల పన్ను (జీఎస్టీ)తో వాటిల్లిన నష్టాల నుంచీ మనం ఇంకా తేరుకోలేదు. మరి ఇప్పుడు లాక్‌డౌన్ అనంతరం మనం అంత తేలిగ్గా ఆర్థిక స్వస్థతను పొందలేము. 


కరోనా వైరస్ పై యుద్ధానికి, ఆ మహమ్మారి సామాజిక, ఆర్థిక పర్యవసానాలను సమర్థంగా ఎదుర్కొనే బృహత్తర ప్రయత్నాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేతృత్వం వహిస్తున్నాయి. ప్రజలమైన మనం కేవలం అనుచరులం లేదా సైనికులం మాత్రమే. అయితే అనయాయులుగా మనం చాలా విషయాలను ఊహించగలం.


వ్యాక్సిన్ అవసరం లేకుండానే కరోనా వైరస్‌ను నిర్మూలించగలమని భావించండి. ఈ భావన మనలను, లాక్‌డౌన్ ఒక చికిత్స, ఆ చికిత్స పూర్తయ్యేదాకా లాక్‌డౌన్ వైరస్ వ్యాప్తిని నిలువరించగలదని ఊహించేందుకు పురిగొల్పుతుంది. యథార్థమేమిటంటే లాక్‌డౌన్ ఒక చికిత్స కాదు, అది వైరస్ వ్యాప్తిని అరికట్టలేదు. లాక్‌డౌన్ ఒక విరామం; వైరస్ వ్యాప్తిని అది మందగింప చేస్తుంది; మహమ్మారిపై పోరుకు అత్యవసరమైన వైద్య, ఆరోగ్యభద్రతా సదుపాయాలను నిర్మించుకునేందుకు తగు సమయాన్ని మనకు సమకూరుస్తుంది. అంతేకాదు, మహమ్మారి వ్యాప్తిపై అవగాహనను పెంపొందిస్తోంది; వైరస్ సోకిన వ్యక్తులు, అందునా ఆస్పత్రిలో చికిత్స అనివార్యమైన రోగులు ఎంత అత్యధిక సంఖ్యలో వున్నప్పటికీ వారికి ఉపశమనం కలిగించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని సమకూర్చుకునేందుకు వ్యవధినిస్తుంది. లాక్‌డౌన్ విధించాలని డిమాండ్ చేసినవారు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. 


తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళకుండా నిరోధింపబడిన వలస శ్రామికులు తాము ఆశ్రయం పొందుతున్న ఆవాసాలు (షెల్టర్ హోమ్స్), సహాయక శిబిరాలలోను; క్వారంటైన్ లలోను ఆనందంగా వున్నారని, ఆయా ప్రదేశాలలోని జీవన పరిస్థితులు, లభిస్తున్న ఆహారం పట్ల సంతృప్తితో వున్నారని అనుకోండి. వాస్తవమదేనా? వలస కూలీలు ఆశ్రయం పొందుతున్న ఆవాసాలు, శిబిరాలను తనిఖీ చేసిన ఢిల్లీ పోలీసులకు కన్పించిన దేమిటి? కనీస వసతుల కొరత. తిరగని పంకాలు, టాయ్ లెట్స్‌లో పూర్తిగా లోపించిన పారిశుద్ధ్యం. పౌరరక్షణ సిబ్బంది అమర్యాదకర ప్రవర్తనపట్ల వలస కూలీల మనస్తాపం. టాయ్ లెట్స్ ఉదయం 7 నుంచి 11 గంటల దాకా మాత్రమే నీటి సరఫరా. స్నానం చేసేందుకు, బట్టలు ఉతుక్కునేందుకు అవసరమైన సబ్బులు లేక పోవడం. విద్యుత్ కోతలు సరేసరి. స్వచ్ఛందంగా వుంటున్న షెల్టర్ హోమ్స్‌లోనే పరిస్థితులు ఇలా వుంటే ఇష్టపూర్వకంగా వుండని సహాయక శిబిరాలు, క్వారంటైన్‌లలో పరిస్థితులు ఎలా వుంటాయో కదా! 


వలస కార్మికుడు (ఉదాహరణకు ముంబై లేదా సూరత్‌లో) తన ఏక గది అద్దె ఇంటిలో దాదాపు పదిమందితో కలిసి ఉద్యోగం, పని, డబ్బు లేకుండా, కుటుంబానికి ఏమీ పంపలేని పరిస్థితిలో సైతం సంతోషంగా ఉన్నాడని అనుకోండి. యథార్థంగా అలా వున్నాడా? వుండగలడా? అలాంటి వలస కార్మికులలో అత్యధికులకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. నగదు బదిలీ గానీ, నిత్యావసర సరుకుల పంపిణీ గానీ జరగడం లేదు. ఆ అభాగ్యవలస కూలీల ఏకైక కోరిక స్వస్థలానికి తిరిగి వెళ్ళడమే.  


ఉద్యోగాలకు ఎటువంటి నష్టం జరగలేదని, కార్మికులు, ఉద్యోగులు తమ పని ప్రదేశాలకు తిరిగి వచ్చేంతవరకు ఉద్యోగాలు భద్రంగా ఉంటాయని భావించండి. వాస్తవమేమిటి? ఏప్రిల్ 27న నిరుద్యోగిత రేటు 21.1 శాతంగా ఉన్నదని, ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొంటున్న కార్మికుల సంఖ్య 35. 4 శాతానికి తగ్గిపోయిందని సి ఎమ్ ఐ ఇ నివేదిక వెల్లడించించింది. వాస్తవమేమిటంటే సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలలో ఏ ఒక్కటైనా ఒకసారి షట్ డౌన్ అయిన తరువాత దాన్ని పునః ప్రారంభించడం అంత తేలికకాదు. ఈ పరిశ్రమలలో పని చేసే కార్మికుల సంఖ్య సాధారణంగా 2 నుంచి 10 దాకా ఉంటుంది. తాము పని చేసే సంస్థ మూత పడగానే వీరు ఇతర పనులకో లేదా వలసపోవడమో పరిపాటి. వారాల తరబడి షట్ డౌన్ అయిన తరువాత సదరు సంస్థ తాను చెల్లించవలసిన బిల్లులను చెల్లించడం గానీ, వసూలు చేసుకోవల్సిన బిల్లులను వసూలు చేసుకోవడం గానీ అంత తేలికకాదు.


వ్యాపార, పారిశ్రామిక రంగాలను ముఖ్యంగా సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రెండవ ఆర్థిక కార్యచరణ ప్రణాళికను తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం మార్చి 25న ఇచ్చిన హామీని నెరవేర్చనున్నదనుకోండి. వాస్తవమేమిటి? ఆ హామీని నెరవేర్చేందుకు (మే 1న ఈ వ్యాసం రాస్తున్న సమయానికి కూడా, కేంద్రం చేసిందేమీ లేదు. ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ఏదైనా సిఫారసుచేసిందేమో మనకు తెలియదు. పెద్ద పరిశ్రమలు ఏదో ఒక విధంగా ఈ సంక్షోభం నుంచి నుంచి బయటపడ్డాయను కోండి. అయితే అవి, పాత సాధారణ పరిస్థితులు శాశ్వతంగా అంతరించిపోయాయని నిశ్చితంగా నిర్ణయించుకుని, కొత్త సాధారణ పరిస్థితులను అన్వేషిస్తున్నాయి. నగదును ఆదా చేసుకునేందుకు, పెట్టుబడి వ్యయాలను తగ్గించుకునేందుకు, కార్మికులను తగ్గించుకునేందుకు, అప్పుల నుంచి బయటపడేందుకు, వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని విస్తరింపచేసేందుకు పెద్ద పరిశ్రమలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 


లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత ఆర్థిక వ్యవస్థ తిరిగి పూర్వ స్థితికి చేరిందనుకోండి. క్షీణించిపోయిన ఆర్థిక కార్యకలాపాలు యథావిధిగా వేగం పుంజుకోవడాన్ని మనం చూడగలుగుతామనుకోండి. అయితే వాస్తవమేమిటి? పెద్ద నోట్ల రద్దు మహాతప్పిదానికి కుదేలయిపోయిన మన ఆర్థిక వ్యవస్థ ఇంతవరకూ కోలుకోనేలేదు. హడావుడిగా ప్రవేశపెట్టి, అస్తవ్యస్తంగా అమలుపరిచిన వస్తు -సేవల పన్ను (జీఎస్టీ)తో వాటిల్లిన నష్టాల నుంచీ మనం ఇంకా తేరుకోలేదు. మరి ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేసినా అంత తేలిగ్గా ఆర్థిక స్వస్థతను పొందలేము. అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను క్రమేణా పునరుద్ధరించుకోవాలన్నా చాలా కఠోర పరిశ్రమ చేయవలసివుంటుంది. పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవల్సి వున్నది. ఆ ప్రణాళికలను శ్రద్ధగా అమలుపరచవలసివున్నది. ధనం అపారంగా అవసరం. బహిరంగ విపణులు మనకు అనుకూలంగా వుండడమూ చాలా ముఖ్యం. వాణిజ్య బంధాలూ, అంతర్జాతీయ సహకారమూ ఎంతైనా అవసరం. వాస్తవాలు కఠోరంగా ఉన్నప్పటికి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆంగ్ల రచయిత లెవిస్ కరోల్ (1832-98) చెప్పిన సత్యమది. ‘యథార్థానికి వ్యతిరేకంగా చేసే యుద్ధంలో ఊహాశక్తి మాత్రమే ఆయుధం’ అని ఆయన అన్నారు.


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Advertisement
Advertisement
Advertisement