Abn logo
Jun 19 2021 @ 08:04AM

బ్రిట‌న్‌లో ద‌డ పుట్టిస్తున్న డెల్టా వేరియంట్‌!

వారంలో 33 వేలకు పైగా పాజిటివ్‌లు

99 శాతం కేసులు ఈ వేరియంట్‌వే

డెల్టాతో కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలు

లండన్‌, జూన్‌ 18: కరోనా డెల్టా వేరియంట్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)ను వణికిస్తోంది. శరవేగంతో వ్యాపిస్తూ థర్డ్‌ వేవ్‌కు కారణమవుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 99 శాతం ఈ వేరియంట్‌వే. వారంలో 33 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. వేరియంట్ల ప్రభావంపై ప్రతి వారం సమీక్ష చేస్తున్న పబ్లిక్‌ హెల్త్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ (పీహెచ్‌ఈ) సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య వ్యవస్థపై భారం తగ్గించేందుకు జూలై 19 వరకు లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ప్రభుత్వం ఆలోచిస్తోంది.


టీకా రెండు డోసులతో పూర్తి రక్షణ

ప్రస్తుతం యూకేలో వైరస్‌ బారినపడుతున్నవారిలో యువతే అధికం. అందులోనూ టీకా తీసుకోనివారే ఎక్కువ. ఈ నేపథ్యంలో అర్హులైన యువత అంతా టీకా తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు రెండు డోసులు తీసుకున్నవారికి డెల్టా ముప్పు చాలా తక్కువని పీహెచ్‌ఈ పేర్కొంది.  


11 రోజుల్లో కేసులు డబుల్‌

డెల్టా వేరియంట్‌తో యూకేలో ప్రతి 11 రోజులకు కేసులు రెట్టింపవుతున్నాయి. మే నెలాఖరు, జూన్‌ ప్రారంభంలో లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీ బృందం అధ్యయనంలో ఇది వెల్లడైంది. పరిశీలనలో భాగంగా లక్షపైగా నమూనాలను ఈ బృందం సేకరించింది. ఇక.. కరోనాతో ప్రపంచవ్యాప్తం ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 40 లక్షలు దాటింది. 20 లక్షల మరణాలకు ఏడాదిపైగా సమయం పట్టగా.. గత 166 రోజుల్లోనే 20 లక్షల మంది మృతిచెందారు. మొత్తం మరణాల్లో దాదాపు 50 శాతం అమెరికా (6.16 లక్షలు), బ్రెజిల్‌ (4.96 లక్షలు), భారత్‌ (3.83 లక్షలు), రష్యా (1.28 లక్షలు), మెక్సికో (2.30 లక్షలు)ల్లోనే సంభవించాయి.