Abn logo
Sep 21 2020 @ 03:25AM

ఢిల్లీ సూపర్‌

Kaakateeyaమయాంక్‌ అద్భుత ఇన్నింగ్స్‌ వృథా 

పంజాబ్‌ ఓటమి

స్టొయినిస్‌ మెరుపు అర్ధసెంచరీ


తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఉత్తమ గణాంకాలు (3/15) నమోదు చేసిన పేసర్‌ మహ్మద్‌ షమి. అలాగే పవర్‌ప్లేలో తొలిసారిగా రెండు వికెట్లు తీశాడు.


ఐపీఎల్‌ చరిత్రలో సూపర్‌ ఓవర్‌లో అత్యల్ప (2) స్కోరును నమోదు చేసిన పంజాబ్‌.


 ఢిల్లీ తరఫున వేగంగా (20 బంతుల్లో) అర్ధసెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా సెహ్వాగ్‌ సరసన చేరిన స్టొయినిస్‌. క్రిస్‌ మోరిస్‌ (17 బంతుల్లో)తొలి స్థానంలో ఉన్నాడు.


ఐపీఎల్‌ తాజా సీజన్‌లో అదిరిపోయే మ్యాచ్‌. చివరి వరకు ఊపిరి బిగపట్టేలా చేసిన మ్యాచ్‌ టైగా ముగియగా.. తుదకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సూపర్‌ ఓవర్‌లో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. అంతకుముందు 17 ఓవర్లలో 100 పరుగులే చేసిన ఢిల్లీని తన అసమాన ఇన్నింగ్స్‌తో స్టొయినిస్‌ 157 రన్స్‌తో పోటీలో నిలపగా.. పంజాబ్‌ కూడా ఆదిలో వికెట్లు కోల్పోయినా మయాంక్‌ అగర్వాల్‌ వన్‌మ్యాన్‌ షోతో చుక్కలు చూపించాడు. కానీ రెండు బంతుల్లో 1 పరుగు చేయలేక చివరకు మూల్యం చెల్లించుకుంది.


దుబాయ్‌: అటు స్టొయినిస్‌..ఇటు మయాంక్‌ అగర్వాల్‌ అసాధారణ ఆటతీరుతో అభిమానులకు అసలు సిసలు మజాను చూపించారు. కానీ చివరకు పంజాబ్‌ జట్టుకు దురదృష్టం వెంటాడడంతో పరాజయం పాలైంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 20 ఓవర్లలో 157 పరుగులే చేయడంతో టైగా ముగిసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. దీంట్లో మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ అదిరే బోణీ చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. స్టొయినిస్‌ (21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 53), శ్రేయాస్‌ (39), పంత్‌ (31) రాణించారు. షమికి మూడు, కాట్రెల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బరిలోకి దిగిన పంజాబ్‌ కూడా 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. మయాంక్‌ అర్ధ సెంచరీతో (60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 89) రాణించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా స్టొయినిస్‌ నిలిచాడు.


ఆరంభంలోనే టపటపా..:

ఈ పిచ్‌పై కాస్త కష్టసాధ్యమైన లక్ష్యం కోసం బరిలోకి దిగిన పంజాబ్‌ తమ ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. కేవలం 3 ఓవర్ల వ్యవధిలోనే తొలి నాలుగు వికెట్లను కోల్పోయింది. రాహుల్‌ (21), కరుణ్‌ నాయర్‌ (1), పూరన్‌ (0), మ్యాక్స్‌వెల్‌ (1) నిరాశపరిచారు. దీంతో పంజాబ్‌ 35/4 స్కోరుతో ఇబ్బందిపడింది. అటు ఓపెనర్‌ మయాంక్‌ మాత్రం ఒంటరి పోరాటం చేశా డు. గౌతమ్‌ (20)తో కలిసి ఆరో వికెట్‌కు 46 రన్స్‌ చేర్చాడు. 


ఈసారి మయాంక్‌ వంతు..:

17 ఓవర్లు ముగిశాక 116/6తో ఉన్న పంజాబ్‌.. గెలవాలంటే 18 బంతుల్లో 42 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో అచ్చం స్టొయినిస్‌ తరహాలోనే మయాంక్‌ కూడా చెలరేగాడు. 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది 17 పరుగులు సాధించడంతో ఉత్కంఠ పెరిగింది. తర్వాతి ఓవర్‌లో రెండు ఫోర్లతో 12 పరుగులు రాబట్టాడు. ఇక ఆఖరి ఓవర్‌లో గెలిచేందుకు 13 రన్స్‌ కావాల్సి ఉండగా.. తొలి బంతిని సిక్సర్‌, మూడో బంతిని ఫోర్‌గా మలవడంతో స్కోరు సమమైంది. ఇక రెండు బంతులు, ఒక్క రన్‌ అవసరమైన దశలో ఐదో బంతికి మయాంక్‌, ఆరో బంతికి జోర్డాన్‌ (5) అవుట్‌ కావడంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది.


ఆదుకున్న శ్రేయాస్‌, పంత్‌:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను పంజాబ్‌ పేసర్‌ మహ్మద్‌ షమి ఆరంభంలోనే వణికించగా కేవలం 13 పరుగులకే టాపార్డర్‌ ఆటగాళ్లు పెవిలియన్‌లో కూర్చున్నారు. కెప్టెన్‌ శ్రేయాస్‌, రిషభ్‌ పంత్‌ జోడీ నాలుగో వికెట్‌కు 73 పరుగులు జత చేసి పరువు కాపాడే ప్రయత్నం చేసినా రన్‌రేట్‌లో పెరుగుదల కనిపించలేదు. కానీ ఆఖరి మూడు ఓవర్లలో స్టొయినిస్‌ చూపిన తెగువతో ఢిల్లీ పోటీలో నిలవగలిగింది. ముందుగా ఓపెనర్‌ ధవన్‌ (0) రనౌట్‌ కాగా నాలుగో ఓవర్‌లో పృథ్వీ షా (5), హెట్‌మయెర్‌ (7)లను షమి అవుట్‌ చేశాడు. దీంతో పవర్‌ప్లేలో ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయి 23 పరుగులే చేసింది. ఇక వికెట్‌ను కాపాడుకునే క్రమంలో శ్రేయాస్‌, రిషభ్‌ ఆచితూచి ఆడారు.


చివరకు 9వ ఓవర్‌లో పంత్‌ ఫోర్‌, అయ్యర్‌ లాంగాన్‌లో సిక్సర్‌ బాదడంతో 13 పరుగులతో స్కోరుబోర్డు కాస్త కదిలింది. అటు ఐపీఎల్‌లో వేసిన తన తొలి ఓవర్‌లోనే రవి బిష్ణోయ్‌ నాలుగు పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. అయితే మరో స్పిన్నర్‌ కె.గౌతమ్‌ను లక్ష్యంగా చేసుకున్న శ్రేయాస్‌ 13వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో గేరు మార్చాడు. కానీ 14వ ఓవర్‌లో రిషభ్‌ను బిష్ణోయ్‌ బౌల్డ్‌ చేయగా.. ఆ తర్వాత శ్రేయా్‌సను షమి దెబ్బతీయడంతో ఢిల్లీ పని ముగిసిందనిపించింది.


వామ్మో.. స్టొయినిస్‌:

17 ఓవర్లలో ఢిల్లీ కష్టమ్మీద 100 పరుగులు పూర్తి చేసి దయనీయ స్థితిలో ఉంది. కానీ ఆ తర్వాత 18 బంతుల్లో జట్టు ఏకంగా 57 పరుగులు సాధించిందంటే కారణం.. హార్డ్‌ హిట్టర్‌ స్టొయినిస్‌ ఊచకోత పుణ్యమే. జోర్డాన్‌ వేసిన 18వ ఓవర్‌ తొలి రెండు బంతులను 6,4గా మలిచిన తను 19వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో విజృంభించాడు. ఇక ఆఖరి ఓవర్‌లోనైతే మరోసారి జోర్డాన్‌కు కాళరాత్రే మిగిల్చాడు. వరుసగా 6,4,4,4,6 ద్వారా 30 పరుగులతో మైదానాన్ని హోరెత్తించాడు. అయితే చివరిదైన ఆరో బంతి నోబ్‌ అయినా స్టొయినిస్‌ రనౌటయ్యాడు. కానీ ఈ దూకుడుతో తను 20 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.


స్కోరుబోర్డు

ఢిల్లీ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) జోర్డాన్‌ (బి) షమి 5; ధవన్‌ (రనౌట్‌) 0; హెట్‌మయెర్‌ (సి) మయాంక్‌ (బి) షమి 7; శ్రేయాస్‌ (సి) జోర్డాన్‌ (బి) షమి 39; పంత్‌ (బి) బిష్ణోయ్‌ 31; స్టొయినిస్‌ (రనౌట్‌) 53; అక్షర్‌ (సి) రాహుల్‌ (బి) కాట్రెల్‌ 6; అశ్విన్‌ (సి) షమి (బి) కాట్రెల్‌ 4; రబాడ (నాటౌట్‌) 0; నోర్టే (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 9;

మొత్తం: 20 ఓవర్లలో 157/8. వికెట్ల పతనం: 1-6, 2-9, 3-13, 4-86, 5-87, 6-96, 7-127, 8-154.

బౌలింగ్‌: కాట్రెల్‌ 4-0-24-2; షమి 4-0-15-3; జోర్డాన్‌ 4-0-56-0; గౌతమ్‌ 4-0-39-0; బిష్ణోయ్‌ 4-0-22-1.


పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌ (బి) మోహిత్‌ శర్మ 21, మయాంక్‌ అగర్వాల్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) స్టోయినిస్‌ 89, కరుణ్‌ నాయర్‌ (సి) పృథ్వీషా (బి) అశ్విన్‌ 1, పూరన్‌ (బి) అశ్విన్‌ 0, మ్యాక్స్‌వెల్‌ (సి) శ్రేయాస్‌ (బి) రబాడ 1, సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ (సి) పృథ్వీ షా (బి) అక్షర్‌ 12, గౌతమ్‌ (సి) పంత్‌ (బి) రబాడ 20, జోర్డాన్‌ (సి) రబాడ (బి) స్టోయినిస్‌ 5, షమి (నాటౌట్‌) 0,


ఎక్స్‌ట్రాలు 8, మొత్తం: 20 ఓవర్లలో 157/8;

వికెట్లపతనం: 1/30, 2/33, 3/34, 4/35, 5/55, 6/101, 7/157, 8/157;

బౌలింగ్‌: నోర్జె 4-0-33-0, మోహిత్‌ శర్మ 4-0-45-1, రబాడ 4-0-28-2, అశ్విన్‌ 1-0-2-2, అక్షర్‌ పటేల్‌ 4-0-14-1, స్టోయినిస్‌ 3-0-29-2.ఆ ముగ్గురు.. ఐపీఎల్‌కు కొత్త

ఆదివారం నాటి మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్‌లో కొత్తగా అడుగుపెట్టారు. అండర్‌-19 ప్రపంచక్‌పలో సంచలన బౌలింగ్‌తో రాణించిన స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌, విండీస్‌ పేసర్‌ షెల్డన్‌ కాట్రల్‌ కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ తరఫున క్యాప్‌ అందుకున్నారు. ఇక పేసర్‌ క్రిస్‌ వోక్స్‌ స్థానంలో చివరి నిమిషంలో భర్తీ అయిన సఫారీ పేసర్‌ ఎన్రిచ్‌ నోర్టేకు కూడా ఇదే తొలి ఐపీఎల్‌ కావడం విశేషం. 


కుర్రాడు కుమ్మేశాడు..


తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన 20 ఏళ్ల స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. పదో ఓవర్‌లో కెప్టెన్‌ రాహుల్‌ అతడిని బరిలోకి దించాడు. అప్పుడు క్రీజులో స్ట్రోక్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళన లేకుండా బిష్ణోయ్‌ తన అద్భుత గూగ్లీలతో అదరగొట్టాడు. దీంతో అతడి బంతులను ఎదుర్కొనేందుకు వీరిద్దరూ తెగ ఇబ్బందిపడ్డారు. ఆ ఒత్తిడిలో సహనం కోల్పోయిన పంత్‌ స్లాగ్‌ స్వీప్‌కు ప్రయత్నించగా బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్లను గిరాటేసింది. ఓవరాల్‌గా 4 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చి ఓ వికెట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. వేలంలో ఈ కుర్రాడిని పంజాబ్‌ రూ.2 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.


Advertisement
Advertisement
Advertisement