Sep 25 2021 @ 12:07PM

నాని సినిమాలో నటించబోతున్న ఈ దియా హీరో బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..

ఇతర భాషలకు చెందిన నటులను విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చూపించేందుకు తెలుగు దర్శకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పలు ఇతర భాషలకు చెందిన నటులు ఇప్పటికే ఎంతో మంది తెలుగు తెరపై మెరిశారు. కన్నడ హీరో దీక్షిత్ షెట్టి కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే తెలుగు తెరపై మెరిసిన దీక్షిత్.. నాని నిర్మాణంలో తెరకెక్కనున్న `మీట్ క్యూట్` సినిమాలో నటించనున్నాడు. 


థియేటర్ ఆర్టిస్టుగా, సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన 29 ఏళ్ల దీక్షిత్.. బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నాడు. `నాగిన్` సీరియల్‌లో అర్జున్‌గా నటించి కన్నడంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా గుర్తింపు పొందాడు. ఇక, 2020లో విడుదలైన కన్నడ సినిమా `దియా`తో బ్లాక్‌బస్టర్ హీరోగా మారాడు. ప్రస్తుతం తెలుగుపై కూడా దృష్టి సారించాడు. `వాల్ పోస్ట‌ర్` సినిమా బ్యాన‌ర్‌పై హీరో నాని నిర్మిస్తున్న చిత్రం `మీట్ క్యూట్`లో అవకాశం దక్కించుకున్నాడు. 


నాని సోదరి దీప్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. ఐదు క‌థ‌ల నేప‌థ్యంలో అంథాల‌జీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీక్షిత్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. దీక్షిత్‌కు జోడీగా ఆకాంక్ష సింగ్ కనిపించనుంది. ప్రముఖ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటించనున్నారు. ఆదా శ‌ర్మ‌, ఆకాంక్ష సింగ్, రుహానీ శ‌ర్మ‌, సున‌య‌న‌, వ‌ర్ష బొల్ల‌మ్మ‌, రోహిణి ఇతర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.