Abn logo
Sep 6 2020 @ 03:43AM

బల్దియా సమావేశంపై తర్జనభర్జన

Kaakateeya

తాండూరు : తాండూరు మున్సిపల్‌ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించే విషయమై పాలకవర్గం, అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పాలకవర్గం ఏర్పడి ఇప్పటికే తొమ్మిది నెలలు కావస్తున్నా,  కరోనా పేరిట సమావేశం జరగలేదు. జనవరిలో కొత్త పాలకవర్గం ఏర్పడిన రోజు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక కోసమే సమావేశం నిర్వహించారు. తర్వాత జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఒకసారి ఆన్‌లైన్‌ ద్వారా సమావేశం జరిగింది. ప్రతి మూడు నెలలకోసారి జరగాల్సిన సమావేశం జరుగకుండానే ఇప్పటికే కౌన్సిల్‌ ఆమోదం లేకుండా 12అంశాల ఆమోదం పేరుతో పనులు చేపట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈనెల 11వ తేదీన సమావేశం జరిపేందుకు అధికారులు, పాలకవర్గం స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో చర్చించారు.


ఈ సమావేశాన్ని చర్చ లేకుండా త్వరితగతిన ముగించే విధంగా ఉండాలని ఎమ్మెల్యేను కోరగా, అందుకు ఎమ్మెల్యే నిరాకరించినట్లు సమాచారం. మీడియాను కూడా అనుమతించొద్దన్న విషయాన్నీ చర్చించినట్లు తెలిసింది. అయితే రాజకీయాలకతీతంగా విపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పించాల్సిందేనని ఎమ్మెల్యే తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా సర్వసభ్య సమావేశం ఎప్పుడు జరిగినా ఈ సారి వాడీవేడిగానే జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పట్టణ ప్రగతి, కొవిడ్‌-19 నిధులు, మిషన్‌-90, సమాచారహక్కు చట్టం వివరాలపై కొందరు గట్టిగా నిలదీసే అవకాశం ఉంది. పట్టణ పరిధిలోని ఓ వెంచర్‌ విషయంపై కూడా చర్చలు జరిగే అవకాశముందని తెలిసింది.  

Advertisement
Advertisement