Abn logo
May 8 2021 @ 17:01PM

మానవాళిని వణికించిన వైరస్‌లు.. కరోనాను మించిన విలయం!

గతేడాది కాలంగా సార్స్-కోవ్-2 వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అమెరికా వంటి అగ్రరాజ్యం సైతం కరోనా ధాటికి కకావికలమైంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మందికి పైగా మరణించారు. వైద్యరంగం ఇంతగా అభివృద్ధి చెందిన, వైద్య సదుపాయాలు ఎంతో మెరుగుపడిన ఈ కాలంలోనే ఈ వైరస్ ఇంత విలయం సృష్టించింది. అసలు ఎలాంటి ఆధునిక సదుపాయాలు లేని రోజుల్లో కరోనా కంటే భయంకరమైన వైరస్‌లు ప్రపంచాన్ని వణికించాయి. 


ఈ వైరస్‌లు వెళుతూ వెళుతూ లక్షల సంఖ్యలో ప్రాణాలను తీసుకెళ్లిపోయాయి. ప్లేగు వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది మరణించారు. సరిగ్గా వందేళ్ల క్రితం 1920లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మందిని తీసుకెళ్లిపోయింది. ఒక్క భారత్‌లోనే ఈ వైరస్ వల్ల 2 కోట్ల మంది మరణించి ఉంటారని అంచనా. మహాత్మా గాంధీ కూడా ఈ వైరస్ బారిన పడి కోలుకున్నారు. ఇప్పటివరకు మానవాళిని వణికించిన అతి భయంకరమైన వైరస్‌ల గురించిన సమాచారం.. 

హమీన్ మాంగా (3000 బి.సి.)

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికస్తున్న కరోనాతోపాటు ఎన్నో వైరస్‌లు చైనా నుంచి పుట్టుకొచ్చినవే. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలో ఈశాన్య చైనాలో చాలా ప్రాంతాలను హమీన్ మాంగా వైరస్ తుడిచిపెట్టేసినట్టు ఇటీవల బయటపడింది. మంగోలియా లోపలి ప్రాంతాల్లో 2011-15 మధ్య కాలంలో జరిపిన తవ్వకాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

అథేనియన్ ప్లేగు (165-185)

క్రి.పూ.430-26 మధ్య ఏథెన్స్, స్పార్టా మధ్య జరిగిన పెలొప్పోనీషియన్ యుద్ధ సమయంలో ఈ ప్లేగు వ్యాధి ప్రబలింది. ఇథియోపియా నుంచి పుట్టుకొచ్చి ఈజిప్టు, గ్రీస్‌కు వ్యాపించింది. జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, దగ్గు మొదలైన లక్షణాలు కనిపించేవి. వైరస్ సోకిన వ్యక్తి ఏడు లేదా ఎనిమిదో రోజు మరణించేవాడు. దాదాపు లక్ష మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. వైరస్ సోకినా బతికిన వారు పక్షవాతంతోనూ, అంధత్వంతోనూ, అమ్నీసియాతోనూ బాధపడేవారు. 

బ్లాక్ డెత్ (1343 - 1356)

చైనాలో 1334లో ప్రారంభమైన బబోనిక్ ప్లేగు కేవలం ఐదేళ్లలో యూరప్ అంతటా విస్తరించింది. 60 శాతం మంది ఐరోపా వాసులను ఈ వైరస్ బలి తీసుకుంది. 1343-1356 మధ్య ప్రాంతంలో తీవ్రంగా విజృంభించి మధ్య ఆసియా, ఉత్తర భారతదేశం, యూరప్, రష్యా, మధ్య ప్రాచ్యంలో తీవ్ర స్థాయిలో విజృంభించింది. దాదాపు 15 కోట్ల మంది ప్రాణాలను బలితీసుకుంది. 

స్పానిష్ ఫ్లూ (1918-1920)

స్పెయిన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి సోకింది. భారత్‌లోనూ ఈ వైరస్ విలయం సృష్టించింది.  బాంబే పోర్టులో పనిచేసే ఓ వ్యక్తికి మొదట ఈ వైరస్ సోకింది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న అతడికి మలేరియా వచ్చిందేమోనని వైద్యులు భావించారు. వైద్య పరీక్షల్లో మలేరియాకు సంబంధించిన లక్షణాలేవీ కనిపించలేదు. అయితే, ఆ వ్యాధి అతడి నుంచి ఇతరులకూ సోకింది. చాపకింద నీరులా బాంబే మొత్తం విస్తరించింది. ఆ అంతుబట్టని వ్యాధి వేల మందిని బలి తీసుకోవడం ప్రారంభించింది. అప్పట్లో యాంటీ బయాటిక్స్ వంటివి అందుబాటులో లేకపోవడంతో వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయేవారు. ఈ వ్యాధి సోకిన వారు చావు కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. దాదాపు 2 కోట్ల మంది భారతీయులను ఈ వైరస్ బలితీసుకుంది. గుజరాత్‌లోని గాంధీ ఆశ్రమాన్ని కూడా ఈ వైరస్ తాకింది. గాంధీ సుదీర్ఘ కాలం వ్యాధితో పోరాడాల్సి వచ్చింది. కేవలం ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకుని గాంధీ దీని నుంచి బయటపడ్డారు. దాదాపుగా 10 కోట్ల మంది ఈ వైరస్ వల్ల ప్రాణాలను వదిలారు. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక ప్రాణాలను బలిగొన్న వైరస్‌గా దీన్ని ఇప్పటికి పరిగణిస్తారు.

స్మాల్‌పాక్స్ (1780-1982)

ఎడ్వర్డ్ జెన్నర్ వ్యాక్సిన్ కనిపెట్టక ముందు స్మాల్‌పాక్స్ యూరప్, అమెరికా, ఆసియా దేశాల్లో విలయం సృష్టించింది. 1900కి ముందు ఈ వ్యాధి వల్ల దాదాపు 4 కోట్ల మంది మరణించారు. వ్యాక్సిన్ వచ్చాక ఈ వ్యాధి తగ్గుముఖం పట్టింది. 

ఎయిడ్స్ (1981)

ఎక్వైర్డ్ ఇమ్యునో డెఫిసియెన్సీ సిండ్రోమ్‌గా పిలిచే ఎయిడ్స్ వ్యాధి మానవ రోగ నిరోధక వ్యవస్థను నాశనం చేసి మరణానికి చేరువ చేస్తుంది. అరక్షిత శృంగారం, రక్త మార్పిడి వంటి వాటి ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వల్ల 3 కోట్ల మందికి పైగా మరణించారు. ఆఫ్రికా ఖండంలోని చింపాజీల నుంచి ఈ వైరస్ మానవులకు సంక్రమించినట్టు పరిశోధకులు భావిస్తున్నారు. 

హెచ్1ఎన్1 (2009)

శ్వాస వ్యవస్థపై దాడి చేసే ఇన్‌ఫ్లుయాంజా ఏ వైరస్ 2009-10 సంవత్సరాల్లో ప్రభావం చూపించింది. ఈ వైరస్  కారణంగా 5.75 లక్షల మంది మరణించారు.  


ప్రత్యేకంమరిన్ని...

Advertisement