Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాన్న కోసం ఏటెంబడి కూతురి ఆరాటం.. ఈయన్ను ఎక్కడైనా చూశారా..?

  • చెయ్యేటి వరద తర్వాత కనిపించకుండా పోయిన జడ నాగరాజు
  • తండ్రి జాడ కోసం కూతురి వెతుకులాట

తండ్రి కోసం కూతురు చెయ్యేటి నదిలో ఐదు రోజులుగా వెతకడం కంట తడిపెట్టిస్తోంది. మందపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చెయ్యేటిలో తన తండ్రి ఫొటో చూపిస్తూ ఈయనను ఎక్కడైనా చూశారా అంటూ వెతకడం అందరినీ కలచి వేస్తోంది.


కడప జిల్లా/రాజంపేట : ఈమె పేరు దీప.. వీరి స్వగ్రామం ఎగువ మందపల్లె. ఈమెకు ఐదేళ్ల కిందట చిట్వేలి మండలం నగిరిపాడు గొల్లపల్లెలో వివాహం చేశారు. తల్లి రాజమ్మ కువైత్‌లో ఉంది. ఇక మిగిలింది తండ్రి జడ నాగరాజు. ఈయన పాలేశ్వరాలయం, గుండ్లూరు శివాలయం, కడప తదితర ప్రాంతాల్లో దైవచింతనతో ఆలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. భార్య కువైత్‌లో ఉండటం, కూతురును 50 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామంలో పెళ్లి చేసిన మూలంగా ఇతని దారి వేదాంతధోరణి అయింది. ఇంటిలో భార్య, బిడ్డలు లేకపోవడంతో దైవచెంతనలో నిమగ్నమయ్యాడు. ఇంతలో గత నెల 19 వతేదీన అన్నమయ్య ప్రాజెక్టు తెగి చెయ్యేరు ఊర్లన్నింటీని ముంచెత్తిన నాటినుంచీ ఇతని ఆచూకీ తెలియడం లేదు. 


సంఘటన జరిగిన 19వ తేదీ నుంచి ఏకంగా వారం రోజుల పాటు తమ తండ్రి జడ నాగరాజు ఎక్కడో ఒక చోట ఉంటాడని కుమార్తె దీప అనుకున్నారు. అయితే ఆయన పూజించే శివాలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వరదమయం కావడంతో ఇతని జాడే లేకుండా పోయింది. ఇక చేసేది లేక తమ తండ్రి గల్లంతయ్యాడని రాజంపేట మండలం మందపల్లె సచివాలయంలో దీప ఫిర్యాదు చేశారు. తహసీల్దారుకు, మన్నూరు ఎస్‌ఐకి తెలియజేశారు. అధికారుల నుంచి ఆశించిన మేర ఫలితం లేకపోవడంతో ఆమె తమ బంధువులను వెంటేసుకొని చెయ్యేటిలో తమ తండ్రి జాడ కోసం వెతుకుతోంది. తండ్రి ఫొటోను చేతిలో పట్టుకుని ఈయనను ఎక్కడైనా చూశారా అంటూ కనిపించిన వారినంతా అడుగుతోంది. ఈ ఉదంతం అందరినీ కంట తడి పెట్టిస్తోంది. ఈ విషయమై రాజంపేట తహసీల్దారు రవిశంకర్‌రెడ్డిని వివరణ కోరగా తాము వరద సహాయకచర్యల్లో ఉన్నామని ఈమె విషయాన్ని వెంటనే పరిశీలించి పోలీసులకు సమాచారం అందించి తగు న్యాయం చేస్తామని  అన్నారు.

Advertisement
Advertisement