Abn logo
Oct 15 2021 @ 00:46AM

జలవిహారానికి బ్రేక్‌

తెప్పోత్సవానికి సిద్ధమైన హంస వాహనం

నిబంధనలకు లోబడి తెప్పోత్సవం

పరిమిత సంఖ్యలో అనుమతి

పంటుపై పూజలు మాత్రమే 


విజయవాడ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఏడాదీ దసరా రోజున కృష్ణానదిలో నిర్వహించే గంగా సమేత దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవం ఈ ఏడాది సాదాసీదాగానే జరగనుంది. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చిన అనంతరం పంటుపై ప్రత్యేక పూజలు నిర్వహించి, జలవిహారం చేయాల్సి ఉండగా, ప్రకాశం బ్యారేజ్‌కి ఎగువ నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు వస్తున్నందున జలవిహారాన్ని రద్దు చేశారు. పంటుపై ఉత్సవమూర్తులకు పూజలు మాత్రమే నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ నివాస్‌ గురువారం తెలిపారు. ప్రముఖులను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నా మని, సాధారణ భక్తులకు అనుమతి లేదని వెల్లడించారు. పంటుపై సాయంత్రం 5.30గంటలకు పూజలు ప్రారంభమవుతాయని చెప్పారు. సీపీ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ, ఈ ఏడాది అమ్మవారి దర్శనానికి అంచనాకు మించి భక్తులు వచ్చారని, అన్ని శాఖలు సమన్వయంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.


ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..

- దుర్గాఘాట్‌లో తెప్పోత్సవం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఆ సమయంలో వాహనదారులు రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. 

- పీఎన్‌బీఎస్‌ నుంచి హైదరాబాద్‌, తిరువూరు, జగ్గయ్యపేట వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, ఆర్టీసీ వై జంక్షన్‌, ఏలూరు రోడ్డు, చల్లపల్లి బంగళా, ఏలూరు లాకులు, జీఎస్‌ రాజు రోడ్డు, బుడమేరు వంతెన, సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ మీదుగా పైపులరోడ్డు, వైవీరావు ఎస్టేట్‌ సీవీఆర్‌ ఫ్లైఓవర్‌, కబేళా, సితార సెంటర్‌, గొల్లపూడి బైపాస్‌ నుంచి వెళ్లాలి.

- కుమ్మరిపాలెం వైపు నుంచి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలను సితార వైపు నుంచి చిట్టినగర్‌ వైపునకు మళ్లిస్తారు. 

- తాడేపల్లి - ప్రకాశం బ్యారేజ్‌ మధ్య పరిస్థితులను బట్టి వాహనాలను నియంత్రిస్తారు.

- పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ - వినాయకుడి గుడి మార్గంలో వాహనాలను అనుమతించరు.

- కనకదుర్గ ఫ్లైఓవర్‌ను రెండు వైపులా మూసివేస్తారు.

- పీఎన్‌బీఎస్‌ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లాల్సిన సిటీ బస్సులు, ఇతర వాహనాలు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, లోబ్రిడ్జి, కాళేశ్వరరావు మార్కెట్‌, బీఆర్పీ రోడ్డు, పంజాసెంటర్‌, చిట్టినగర్‌, సొరంగం, సితార, గొల్లపూడి బైపాస్‌ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలి.

- ఇబ్రహీంపట్నం నుంచి పీఎన్‌బీఎస్‌కు వచ్చే వాహనాలు గొల్లపూడి బైపాస్‌ రోడ్డు, సితార, కబేళా సెంటర్‌, సీవీఆర్‌ ఫ్లైఓవర్‌, చిట్టినగర్‌, పంజా సెంటర్‌, కాళేశ్వరరావు మార్కెట్‌, లోబ్రిడ్జి, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ మీదుగా రావాలి.

- బ్యారేజ్‌వద్ద భక్తుల రద్దీ పెరిగితే తాడేపల్లి - విజయవాడల మధ్య వాహనాలను కనకదుర్గమ్మ వారధి వైపునకు మళ్లిస్తారు.