Abn logo
Oct 24 2020 @ 02:57AM

దశమహా విద్యలు- దివ్య జీవనసాధనాలు

సృష్టి స్థితి వినాశానాం శక్తి భూతే సనాతని

గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే

అని మార్కండేయ పురాణం జగన్మాతను స్తుతిస్తోంది. సృష్టి స్థితి, సంహార శక్తులైన హరి, హర, బ్రహ్మలు తమ తమ పనుల్లో శక్తి వినా, సమర్థులు కాకపోవడం వల్ల సృష్టి మొదలగు కార్యాలకు భగవతి అయిన శ్రీదేవియే హేతువు. ఆ తల్లి  సర్వస్వతంత్ర. దేవతలు, మానవులు భక్తితో స్తుతించినపుడు కష్టాలను తొలగించడానికి వివిధ శక్తులతో ప్రకటితమవుతుంది. అందరి హృదయాల్లో నివసిస్తూ, వారి బుద్ధిని, ఇంద్రియాలనూ, కర్మలనూ నిర్దేశిస్తుంది.

మనకు దుఃఖాలు దూరం కావాలన్నా, దారిద్య్రం పోవాలన్నా, విజయం సాధించాలన్నా శక్తి ఉపాసన చేయాలి. శక్తి ఆరాధన ఎందుకు చేయాలి? అని ఆలోచిస్తే.. అన్నింటికీ ఆధారం శక్తియే అంటుంది నారద పంచరాత్ర దుర్గాతత్వం. తాంత్రిక పరంపరలో శక్తి పూజకు సంబంధించి దశ మహా విద్యలున్నాయి. దశ మహా విద్యా స్వరూపంలో ప్రథమ రూపమైన కాళి.. భయంకరంగా, మహా బలోపేతంగా దర్శనమిస్తుంది. అసుర సంహారం కోసం ఈమె సృష్టిలోనికి వస్తుంది. ఈమెయే శుభదాయకమై భద్రకాళి అవుతుంది. ఆయుష్షు, మృత్యువు, ఈ రెండూ కాలం వల్లనే నిర్దేశింపబడతాయి. ఈ మహాకాళి ఉపాసన వల్ల కాలాన్ని అతిక్రమించి జీవనాన్ని అమృతప్రాయంగా తీర్చిదిద్దుకోవచ్చు.


రెండవ రూపం తార. మంత్ర శాస్త్రంలో ‘తార’ శబ్దానికి ప్రణవమని అర్థం ఉంది. సంసారాన్ని తరింపచేయడం వల్ల ప్రణవ తారకమైంది. కాళి-చీకటి వలె నల్లనిది కాగా, తార నిర్మల స్ఫటికాకృతిలో తెల్లగా దర్శనమిస్తుంది. మూడోరూపం ఛిన్న మస్తాదేవి. అహాన్ని ఖండించి ఆత్మజ్ఞానం ఇచ్చే తల్లి. నాలుగో రూపం షోడశీమహేశ్వరి త్రిపుర సుందరి. ఈమె హృదయం దయా ప్రపూర్ణం. విశ్వంలోని మంత్ర తంత్రాలన్నీ ఈ మహా విద్యా శక్తినే ఆరాధిస్తాయి. ఈ తల్లి ఉపాసన వలన భోగ మోక్షాలు రెండూ సిద్ధిస్తాయి. ఈమె సౌందర్యానికి ప్రతీక. ఐదో రూపమైన భువనీశ్వరీదేవిని సప్తకోటి మహా మంత్రాలు ఆరాధిస్తాయి. ఆరో రూపమైన త్రిపుర భైరవి చెడుతో పోరాడే శక్తినిచ్చే తల్లి. ఏడోరూపం ధూమ్రావతి. ఈమె శరణాగతి వలన విపత్తులు నాశనమై సంపదలు లభిస్తాయి. సిద్ధిని ప్రసాదించే తల్లి. ఎనిమిదో రూపమైన భగళాముఖిని.. శత్రుశమనార్ధం ఆరాధిస్తారు.


బ్రహ్మదేవుడు భగళ మహా విద్యోపాసకుడని చెబుతారు. తొమ్మిదో రూపమైన మాతంగికి.. గృహస్థ జీవితాన్ని సుఖవంతంచేసి, పురుషార్థాలను సిద్ధింపజేసే శక్తి ఉంది. ఇక పదో రూపం.. కమలాలయ. ఈ తల్లి సమృద్ధికి ప్రతీక. భార్గవుల చేత పూజింపబడుట వల్ల భార్గవి అనే పేరు కూడా ఉంది. ఈ తల్లిని పద్మావతీ దేవిగా కూడా పిలుస్తారు. ఈ ‘‘దశమహా విద్యలు- దివ్య జీవన సాధనాలు’’.


శ్రీదేవిని ప్రణుతి చేయడానికిగానీ, స్తుతించడానికిగానీ అనేక జన్మల పుణ్యఫలం ఉండాలని శారదా తిలక గ్రంథం చెప్పింది. ‘చిచ్చక్తి చేతనా రూపా..’ అంటూ అమ్మవారి శక్తిని చైతన్య రూపంగా ఆరాధించాలి.

ఆ శక్తి ప్రాణశక్తి, ఆత్మశక్తి, చైతన్య శక్తి వంటి విభిన్న రూపాల్లో మనలో ఉన్నది. కనుక మూల కారణమైన పరాశక్తిని ప్రసన్నం చేసుకునేందుకే శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకొంటున్నాం.

- మేఘశ్యామ (ఈమని), 8332931376