Abn logo
Sep 28 2020 @ 04:21AM

అప్పన్న ఉద్యోగుల ఆకలి కేకలు

Kaakateeya

మార్చి నుంచి జీతాలు, పింఛన్లలో కోత

ఇప్పటికీ ఆగస్టు శాలరీ అందని వైనం

10 కోట్ల మేర ఆలయానికి తగ్గిన ఆదాయం


(సింహాచలం - ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అతిముఖ్య పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచలం దేవస్థానంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. వరాహ లక్ష్మీనృసింహస్వామి సేవలో నిమగ్నమైన శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులకు కరోనా పేరుతో జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో వారంతా అల్లాడుతున్నారు. మార్చి నుంచి జూలై వరకు సగం జీతాలే ఇచ్చారు. ఆగస్టు నెల జీతాలను ఇంతవరకు చెల్లించలేదు. పదవీ విరమణ చేసినవారి పింఛన్లూ ఆగిపోయాయి. ఇక ఆలయానికి పువ్వులు, నిత్యావసర సరకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు సరేసరి. ఏడు నెలల నుంచి బిల్లుల చెల్లింపే లేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చి 20 నుంచి సింహాచలం ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు.


ఆ తర్వాత పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించినా.. ఇది ఆలయ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది సుమారు రూ.10 కోట్ల మేర ఆదాయం తగ్గింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి నుంచి ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది, పింఛనుదారులకు 50 శాతం మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కోత రెండు నెలలు మాత్రమే విధించారు. దేవస్థానం ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి మాత్రం కోతను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వీరికి జూలై వరకూ సగం జీతాలే రాగా... ఆగస్టు నెల జీతాలు ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పటి వరకూ మొత్తం మీద జీతాలు, పింఛన్లు కలిపి రూ.7.50 కోట్ల మేర బకాయిలున్నట్టు చెబుతున్నారు. 


బ్యాంకుల్లో రూ.100 కోట్ల డిపాజిట్లు

దేవస్థానం భూముల క్రమబద్ధీరణ ద్వారా వచ్చిన మొత్తం సుమారు రూ.74 కోట్లు, అన్నప్రసాద పథకం నిధులు సుమారు రూ.26 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. డిపాజిట్ల నుంచి కొంత సొమ్మును డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ సుమారు 2 నెలల క్రితం దేవస్థానం ఈఓ, పాలకమండలి చైర్‌పర్సన్‌కు ప్రతిపాదనలు పంపారు. దీనిపై స్పందన రాలేదని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement