Abn logo
May 14 2020 @ 00:34AM

పేదలకు కరెంట్ షాక్‌!

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో రైతుకు ఇచ్చే విద్యుత్‌ సబ్సిడీ విలువ సుమారు 58 వేలు. అంటే నెలకు సుమారు రూ.5 వేలు. కేంద్రం తీసుకురాబోయే చట్టం ప్రకారం రైతు విద్యుత్‌ బిల్లును చెల్లించాలి. వ్యవసాయ ఖర్చు తడిసి మోపెడు అయిందని ఆందోళన చెందుతున్న తరుణంలో రైతులు ఈ మొత్తం ముందు చెల్లించగలరా అన్నది ప్రశ్న. సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం ముందే రైతుల అకౌంట్లో వేయవచ్చు. కానీ ఏ పంపుసెట్‌ పని చేస్తుందో, ఏది చేయడంలేదో తెలియదు. పైగా అన్ని నెలలూ ఒకే రకంగా విద్యుత్‌ వాడకం ఉండదు. వ్యవసాయ పంపుసెట్ల వద్దకు వెళ్లి ప్రతి నెలా మీటరు రీడింగ్‌ తీయడమూ అసాధ్యమే. 


విద్యుత్‌ రంగం ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాలి. అపుడే ఈ రంగం మనగలుగుతుంది. వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ అందుతుంది. అలాంటి రంగం కునారిల్లితే ఆ ప్రభావం విద్యుత్‌ సంస్థలపై పడడమేగాక రంగమూ దెబ్బతింటుంది. విద్యుత్‌ అందడమూ గగనమవుతుంది. ఇపుడు ఇదే కనబడుతోంది. సంస్కరణలు ఎన్ని తెచ్చినా విద్యుత్‌ రంగం సంక్షోభం నుంచి బయటపడడంలేదు. ఇలాంటి స్థితి నుంచి బయటపడేయడానికి కేంద్రం ఎప్పటికప్పుడు సంస్కరణల పేరిట మార్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రాల అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు యత్నిస్తోంది. బలవంతంగా నిబంధనలను రుద్దే ప్రయ త్నం చేస్తోంది. ప్రస్తుత ప్రతిపాదిత విద్యుత్‌ (సవరణ) బిల్లు ఆ కోవలోదే. ఈ బిల్లులోనే సబ్సిడీలకు మంగళం పాడడానికి పూనుకొంది. ఇది సమాజంలోని అల్పాదాయ వర్గాలు ముఖ్యంగా రైతులకు గొడ్డలిపెట్టువంటిది. పంపుసెట్ల మీద ఆధారపడే రైతులు వ్యవసాయం చేయడమే కష్టం అయ్యే ప్రమాదముంది. ఈ వర్గాలు ఛార్జీల భారం మోయడం కష్టమే.


జనరేషన్‌ కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ తీగల ద్వారా ప్రవహించి వినియోగదారులకు చేరుకుంటుంది. ఇందుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రతి యూనిట్‌కు 7 రూపాయలు అవసరం అవుతోంది. ప్రతి యూనిట్‌కు అయిన ఖర్చును ప్రతి వినియోగదారుడి నుంచి రాబట్టాలనుకుంటే అల్పాదాయ వర్గాలు ఇబ్బంది పడే అవకాశముంది. అందుకే ఈ వర్గాల నుంచి తక్కువ ఛార్జీని నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం గృహ రంగంలో నెలకు 50 యూనిట్లు విద్యుత్‌ వాడుకుంటున్న వినియోగదారులకు నిర్ణయించిన యూనిట్‌ ఛార్జీ కేవలం రూ.1.45 పైసలు. అంటే యూనిట్‌కు సుమారు రూ.5.50 పైసల ఆదాయం ఈ వర్గాల నుంచి తగ్గుతోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, పరిశ్రమలకు ఎక్కువ ఛార్జీని నిర్ణయించిన కారణంగా వచ్చే ఆదాయం (క్రాస్‌ సబ్సిడీ) రూపంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలు పొందుతున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన బిల్లు ప్రకారం ఈ పద్ధతికి స్వస్తి చెప్పాల్సిందే. ఒక యూనిట్‌ సరఫరాకు అయిన ఖర్చును పరిగణనలోకి తీసుకొని ఈఆర్‌సీ నిర్ణయించిన ఛార్జీని ప్రతి వినియోగదారుడూ ముందు చెల్లించాలి. ప్రభుత్వం కావాలనుకుంటే రాయితీని వినియోగదారుడికి తరువాత అందించొచ్చు.


ఇది ఒక రకంగా గ్యాస్‌ సబ్సిడీ వంటిదే. గ్యాస్‌ సిలిండర్‌కు అయ్యే ఖర్చును వినియోగదారుడు తొలుత భరిస్తే ఆ పిదప ప్రభుత్వం అతని అకౌంట్లో రాయితీ సొమ్మును జమ చేస్తోంది. ఇదే డీబీటీ. విద్యుత్‌ రంగంలో డీబీటీ అంత సులువు కాదు. నిత్యం వాడుకునే విద్యుత్‌కు ప్రతి నెలా వందల్లో ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఎంత విద్యుత్‌ వాడుకున్న వారికి రాయితీ ఇవ్వాలి? సొమ్ము రూపంలో ఇవ్వాలా? లేక ప్రతి నెలా కొన్ని యూనిట్లను పరిగణనలోకి తీసుకొని రాయితీ ఇవ్వాలా? ఇళ్లు అద్దెకు ఇచ్చే వారికి మూడు నాలుగు విద్యుత్‌ కనెక్షన్లు ఉంటాయి. అపుడు వారికి కూడా ఇవ్వాలా? రాయితీ అద్దె దారుకు వెళుతుందా లేక ఇంటి యజమానికా? ఇవి అన్నీ చిక్కుముళ్లే. ఏతావతా ఈ వర్గాలకు సబ్సిడీ ఎగనామం పెట్టాలన్న సంకల్పం ఉందా అన్న అనుమానం కలుగుతోంది. వ్యవసాయ రంగం పరంగా మరింత సంక్లిష్టత కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి.


తెలంగాణలో వ్యవసాయానికి కూడా 24 గంటల ఉచిత విద్యుత్‌ అమలవుతోంది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు లేవు. రైతు ఎంత విద్యుత్‌ వాడుకునే విషయం తెలియాలంటే వీటికి మీటర్లు అవసరం. మీటర్ల ఏర్పాటుకే తెలుగు రాష్ట్రాలు వెయ్యేసి కోట్ల మేర తొలుత ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొత్తం విద్యుత్‌ వినియోగంలో 30 శాతం మేర వ్యవసాయ రంగమే ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో రైతుకు ఇచ్చే విద్యుత్‌ సబ్సిడీ విలువ సుమారు 58 వేలు. అంటే నెలకు సుమారు రూ.5 వేలు. కేంద్రం తీసుకురాబోయే చట్టం ప్రకారం రైతు విద్యుత్‌ బిల్లును చెల్లించాలి. వ్యవసాయ ఖర్చు తడిసి మోపెడు అయిందని ఆందోళన చెందుతున్న తరుణంలో రైతులు ఈ మొత్తం ముందు చెల్లించగలరా అన్నది ప్రశ్న. సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం ముందే రైతుల అకౌంట్లో వేయవచ్చు. కానీ ఏ పంపుసెట్‌ పని చేస్తుందో, ఏది చేయడంలేదో తెలియదు.


పైగా అన్ని నెలలూ ఒకే రకంగా విద్యుత్‌ వాడకం ఉండదు. పొలాల్లో ఎక్కడో ఉన్న వ్యవసాయ పంపుసెట్ల వద్దకు వెళ్లి ప్రతి నెలా మీటరు రీడింగ్‌ తీయడమూ అసాధ్యమే. ఉచిత వ్యవసాయ విద్యుత్తు గృహరంగానికి ఏటా సబ్సిడీ అందుతోంది. అయితే సకాలంలో సబ్సిడీ విడుదల కావటం లేదు. ఇలాంటి సంద ర్భంలో విద్యుత్‌ సంస్థలు ఋణాలు తెచ్చుకుని లోటు పూడ్చు కుంటున్నాయి. కొత్త బిల్లు ప్రకారం ఈ అవసరం ఉండదు. కానీ సబ్సిడీ అమలు విధానమే కష్టం. ఆచరణ సాధ్యం కాని పథకం అటకెక్కుతుంది.


పునరుత్పాదక రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న కేంద్రం ఆ రంగంలో సానుకూల పెట్టుబడుల వాతావరణం కల్పించడానికి ప్రయత్నిస్తోంది. బిల్లులో ఇందుకు కొన్ని సవరణలు ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఒక పరిణామం ఇందుకు ప్రాతిపదిక అయినట్లు కనిపిస్తోంది. సౌర, పవన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ఒక దశలో దూసుకెళ్లింది. పెట్టుబడిదారులతో ఇందుకు అనేక ఒప్పందాలను చేసుకుంది. ఆ ఒప్పందాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని అందుకే వాటిని రద్దు చేయాలని లేక మళ్లీ సంప్రదింపులు (రీనెగోషియేట్‌) చేయాలని వై.ఎస్‌.జగ న్మోహన్‌రెడ్డి సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ నిర్ణ యం తీసుకుంది. ఈ చర్య దుష్పరిణామం కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితంకాక దేశ సౌర, పవన రంగంలో పెట్టుబడులపై పడింది. ఏపీ నిర్ణయం చెడు సంప్రదాయానికి దారి తీసింది. ఈ రంగంలో పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీసిందన్న భావనను కేంద్రం అప్పట్లోనే వ్యక్తీకరించింది.


ఇపుడు పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా చట్ట సవరణకు పూనుకుంది. ఇందులో భాగంగానే ఎలక్్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీనొకదాన్ని కేంద్రం నెలకొల్పుతుంది. విద్యుత్‌ కొనుగోళ్లు, అమ్మకం, ట్రాన్స్‌మిషన్‌ అంశాల పర్యవేక్షణ బాధ్యతను ఈ అథారిటీకి అప్పగించాలని సంకల్పించింది. విద్యుత్‌ కొనుగోళ్లపై కుదిరే ఒప్పందాలను పంపిణీ సంస్థలు ఈ అథారిటికీ ముప్పై రోజుల్లోనే సమర్పించాలి. ఒప్పందాల నిర్ణయాధికారం ఇక కేంద్రం చేతిలోని ఈ అథారిటీదే. రాష్ట్రాలు ఒప్పందాలను ఇష్టానుసారం రద్దు చేయడం కుదరదు. అయితే స్వల్ప, దీర్ఘకాలికం... ఏ ఒప్పందాలు ఈ అథారిటీ పరిధిలోకి వస్తాయనే విషయమై స్పష్టత రావలసి ఉంది. వినియోగదారుల ప్రయోజనాలు, అదే సమయంలో విద్యుత్‌ సంస్థల ఆర్థిక బాగోగులను చూడాల్సిన విద్యుత్‌ నియంత్రణ మండళ్లు (ఈఆర్‌సీ) స్వతంత్రంగా వ్యవహరించ లేకపోతున్నాయని కేంద్రం భావిస్తోంది.


తత్ఫలితంగానే ఈఆర్‌సీల నియా మకాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని పూనుకుంది. కేంద్రం తన నిర్ణయాలను ఈఆర్‌సీల ద్వారా రాష్ట్రాలపై రుద్దే అవకాశం లేకపోలేదు. వినియోగదారుల ఆర్థిక స్థితి చూడకుండా ఇష్టానుసారంగా ఛార్జీల వడ్డనకు ఈఆర్‌సీలు అనుమతి ఇస్తే వారి నడ్డి విరగడం ఖాయం. స్వతంత్రంగా పని చేసేట్లు చూడడానికి రాష్ట్రాల అధికారాలను హరించడమే మార్గం కాదు. ప్రత్యామ్నాయం వెతకాలి. 


ప్రైవేటీకరణ పల్లవి పాడుతూ వచ్చిన కేంద్రం తాజాగా ప్రతిపాదిత కొత్త బిల్లులో సబ్‌ లైసెన్సు, ప్రాంచైజ్‌కు తెరతీసింది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. ఖర్చు తడిసిమోపెడు అవుతున్నా ఆదాయం అందుకు అనుగుణంగా రావడంలేదు. సాంకేతిక నష్టాలకు తోడు వ్యవస్థాపరమైన లోపాలు వెంటాడుతున్నాయి. నష్టాలు తగ్గించడం.. ప్రతి పైసాను సమర్థంగా వసూలు చేయడంలో భాగంగా కేంద్రం ఈ ప్రతిపాదనను తెర మీదకు తీసుకువచ్చింది. వీటికి ఈఆర్‌సీకి అనుమతి కూడా అక్కర్లేదు. పంపిణీ సంస్థ తన స్థాయిలోనే ఒప్పందం చేసుకోవచ్చు. లాభసాటిగా ఉన్న ప్రాంతా ల్లో ఇందుకు ఎవరైనా ముందుకు వస్తారు. ఆదిలాబాద్‌ లేదా మరో మూల ప్రాంతాల్లో సబ్‌లైసెన్స్‌ లేదా ప్రాంచైజ్‌ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు.


అపుడు విద్యుత్‌ సంస్థల పని కుడితిలో పడిన ఎలుక అవుతుంది. దేశం, ఆ మాటకొస్తే ప్రపంచం పునరుత్పాదక ఇంధన వన రులు ముఖ్యంగా సౌర, పవన విద్యుత్‌పై వేగంగా ముం దుకెళుతున్నాయి. సౌర, పనవ విద్యుత్‌ రేటు కూడా గణనీయంగాపడిపోయింది. యూనిట్‌ మూడు నాలుగు రూపాయలకే వస్తోంది. అయినా తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఈ రంగంపై చిన్నచూపే. కొన్ని రాష్ట్రాలు ఇంకా బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికే  పెద్దపీట వేస్తున్నాయి. దీనికి కళ్లెం వేయాలన్నది కేంద్రం యోచన. అందుకే నేషనల్‌ రెన్యుబుల్‌ ఎనర్జీ పాలసీని తీసుకురావాలని ప్రతిపాదించింది. ఈ పాలసీలోనే నిర్దిష్ట ప్రమాణం మేరకు రెన్యుబుల్‌ ఎనర్జీని కొనాలని కేంద్రం నిర్దేశించబోతోంది. రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న ఈ బిల్లుపై సలహాలు, సూచనలకు కేంద్రం జూన్‌ 5వ తేదీ వరకూ సమయం ఇచ్చింది. ఆ తరువాతే బిల్లు ఏ రూపం దాల్చనుందనేది వెల్లడికానుంది.

వల్లభనేని సురేశ్‌

సీనియర్‌ జర్నలిస్‌్ట 

Advertisement
Advertisement
Advertisement