Abn logo
Sep 7 2020 @ 04:36AM

ఇష్టారాజ్యంగా కరెంట్‌ కోతలు

Kaakateeya

పేరుకే 24 గంటల సరఫరా 

పగలు, రాత్రి తేడా లేకుండా కరెంట్‌ కట్‌ 

చిరువ్యాపారాలకు ఆటంకం

పట్టించుకోని శాఖాధికారులు 

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామాల ప్రజలు


మోమిన్‌పేట: అధికారుల అలసత్వంతో మండలంలో ఇష్టారాజ్యంగా కరెంట్‌ కోతలు విధిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కరెంట్‌ కోతలు విధిస్తున్నారు. అధికారులు విద్యుత్‌ పనులు చేసే కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ ప్రజలకు, రైతులకు, చిరు వ్యాపారస్తులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 24 గంటల కరెంట్‌ అంటూనే విపరీతమైన కోతలు విధిస్తున్నారు. మోమిన్‌పేట మండల కేంద్రంలోని 33కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిస్థితి మరీ అద్వానంగా తయారైంది. ఏ ఒక్క గ్రామంలో విద్యుత్‌ పనులు చేపట్టినా ఎల్‌సీ తీసుకున్న ఫీడర్‌ మొత్తం విద్యుత్‌ ఆపివేసి ప్రజలను ఇక్కట్ల పాలుచేస్తున్నారు. కరెంట్‌ పోయినప్పుడు కొన్ని సందర్భాల్లో పొలాల వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లు కూడా దొంగతనానికి గురైన సంఘటనలు ఉన్నాయి. టేకులపల్లి గ్రామంలో రెండు ట్రాన్స్‌ఫార్మర్లను అగంతకులు దొంగిలించారు. స్తంభాలకు వేలాడుతున్న విద్యుత్‌ తీగలు వాహనాలకు తగిలి స్తంభంతో పాటు తీగలు తెగిపోయాయి.


ఇప్పటి వరకు స్తంభం మరమ్మతులు జరగలేదు. ఇదిలా ఉంటే గ్రామాల నుండి సర్పంచులు పలుమార్లు చెప్పినా విద్యుత్‌ అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంట్‌ సరఫరా చేసేందుకు ప్రారంభంలో ఉపశమనం ఇచ్చినా ఇప్పుడు కరెంట్‌ కష్టాలు కోతల రూపంలో తీవ్రంగా ఉంటున్నాయి. మండలంలోని టేకులపల్లి, ఎన్కతల, చీమలదరి, దేవరంపల్లి, చక్రంపల్లి, బాల్‌రెడ్డిగూడెం, గోవిందాపూర్‌, రాంనాథ్‌గుడుపల్లి తదితర గ్రామాల్లో పరిస్థితి దిగజారింది. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదని గ్రామప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో వడ్రంగి, వెల్డింగ్‌, పిండి గిర్ని, మెకానిక్‌ తదితర చిరువ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. 


ముందస్తు సమాచారం లేకుండానే..

విద్యుత్‌ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే గంటల తరబడి కరెంట్‌ కోత విధిస్తున్నారు. ఒక్కోసారి రోజంతా రాకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. గతంలో రోజులో సగం కన్నా ఎక్కువ సమయం విద్యుత్‌కోత విధించాల్సి వస్తే ముందస్తు సమాచారం ఇచ్చి మరమ్మతులు చేసేవారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు, రైతులు, చిరువ్యాపారస్తులు కోరుతున్నారు.

Advertisement
Advertisement