Abn logo
Mar 26 2020 @ 03:36AM

సంక్షోభ సమయంలో సాంత్వన

దేశం ఎన్నడూ చూడని సంక్షోభంలో ఉన్నది. ఒక్క దేశమే కాదు, ప్రపంచం ఇప్పుడు చావు బతుకుల సమస్య చుట్టూ తిరుగుతున్నది. ‍‍ఈ సంక్షోభంతో– అధికులం అన్నవారు; ఆధునికులం అనుకున్న వారు; అగ్రరాజ్యాలమని విర్రవీగినవారు; వర్ణ, వర్గ, జాతి, కుల, మత భేదాలతో కోటలు, గోడలు కట్టుకున్న వారు ఇప్పుడు ఎవరి గదిలో వారు ఒంటరిగా, మౌనంగా రోదించాల్సి వస్తోంది. అందరిలోనూ ఒకే ప్రశ్న! రేపు ఏమౌతుంది, ఇవాళ ఎలా గడుస్తుంది? వారం క్రితం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన తర్వాత ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించి శంకు శబ్దాలతో, ఘంటానాదాలతో లేదా తప్పెట్లతోనో, చప్పట్లతోనో మహమ్మారిని తరిమేశామని భ్రమపడ్డవారికి ఇది మోదీ చేసిన ముందస్తు హెచ్చరిక అని బోధపడలేదు. కానీ, అధికారంలో ఉన్న వారికి ఇది ఎప్పుడో అర్థమయ్యింది. ఢిల్లీలో రాజకీయ పరిణామాలను గమనిస్తున్న వారికి ఉపద్రవ ప్రభావం అర్థమవుతూనే ఉంది. నామ్‌కె వాస్తే పార్లమెంటు నడిపించారు కానీ ప్రభుత్వం మాత్రం బిక్కుబిక్కుమంటూనే ఉంది. ఎటువంటి అధికారిక కార్యక్రమాలూ జరగలేదు. రాజకీయ వ్యవహారాలు కూడా పూర్తిగా సద్దుమణిగిపోయాయి. ఒక రకంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 


మంగళవారం మోదీ ప్రసంగాన్ని టెలివిజన్ ఛానెళ్లలో చూసిన తరువాత దేశం దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఒక తీవ్రత పొంచి ఉన్న సంక్షోభ హెచ్చరిక అందరికీ వినబడింది. అది అందరినీ, అంటే నిన్నూ, నన్నూ భారతీయులందరినీ చేష్టలుడిగేలా చేసింది. నేను కూడా ఫోన్ పక్కనే పడేసి అదే ఆలోచనలో మునిగిపోయాను. నా ఫోన్ క్షణానికొకసారి ట్విట్టర్‌ అలర్ట్స్ అందిస్తూనే ఉన్నా, నేను అవేవీ పట్టించుకోలేదు. నేనెలా బయట పడాలి? నా కుటుంబాన్ని ఎలా కాపాడాలి? బ్రహ్మంగారు చెప్పింది నిజమైతే ఎలా? నిజంగానే ఆయనలా చెప్పాడా? మా యాస్వాడ అయ్యవారు చెప్పినట్టు కలియుగాంతం వచ్చిందా? క్లోరోక్విన్ వేసుకుంటే బతికిపోతామా? గోమూత్రం చచ్చినా తాగలేం కానీ పసుపు, కర్పూరం, తులసి ఇంకేదో కలిపి తాగేద్దామా? హోమియోలో ఆర్సెనిక్‌లో అదేదో ఇంకొక మందుకలిపి ఏమైనా ట్రై చేద్దామా, ఓల్డ్ సిటీలో ఎవరైనా హకీమ్‌తో మాట్లాడి యునాని ప్రయత్నిద్దామా... ఇలా నన్ను, నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలా అని మాత్రమే ఆలోచిస్తున్నాను. బహుశా దేశంలో చాలామంది, ఇంకా చెప్పాలంటే అందరూ ఇదే ఆలోచిస్తూ ఉంటారు. ప్రధాని చెప్పినట్టు మిమ్మల్ని మీరు, మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అని మాత్రమే ఆలోచించి వుంటారు.


కానీ, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాత్రం అలా లేడు. ఆయన ప్రజల గోడు వింటూ ‘ఆపద్భాంధవుడి’గా ఉన్నారు. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ తరువాత భారత ప్రధానమంత్రి తమ ప్రసంగాలతో ప్రజానీకానికి ఒక భరోసా ఇచ్చిన సంక్షోభ సమయంలో కేటీఆర్‌ కార్యాచరణలోకి దిగారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకొనే పనిలో పడ్డారు. దేశమంతా లాక్‌డౌన్‌ చేసుకున్న సమయంలో ఆయన తన హృదయపు తలుపులు తెరిచి నిస్సహాయుల గోడు విన్నారు. ట్విట్టర్ వేదికగా ఆపన్న హస్తం అందిస్తూనే ఉన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం ముగిసాక రాత్రి 8 గంటల 18 నిమిషాలకు ఉమా సుధీర్ అనే ఒక సీనియర్ పాత్రికేయురాలు ఆయనకు ఒక ట్వీట్ చేసింది. హైద్రాబాద్‌కు చెందిన ఒక వైద్యురాలు విమానాలు రద్దవడంతో మంగళూరు విమానాశ్రయంలో నిలిచిపోయింది.


ఒక ఆడపిల్ల ఇలాంటి దిక్కులేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయింది, మీరే కాపాడాలి అని అభ్యర్థించింది. ఉమా సుధీర్‌ ఒక జాతీయ ఛానెల్ ప్రతినిధి. ఆమె నేరుగా ప్రధానికో, పౌర విమానయాన మంత్రికో, ఈ దేశ హోమ్ మంత్రికో ఈ సందేశం పంపవచ్చు. లేదా అదే వూరిలో ఉంటున్న ఆమె సహచరులను పురమాయించి ఉండవచ్చు, వారిద్వారా నేరుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఉండవచ్చు. కానీ ఆమె కేటీఆర్‌కు మాత్రమే పంపింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా ‘ఆమె కాంటాక్ట్ డీటెయిల్స్ పంపండి, ఆమెను సురక్షితంగా తీసుకు వస్తాం, నా కార్యాలయం సమన్వయం చేస్తుంది’ అని సమాధానం ఇచ్చారు కేటీఆర్‌. ఇలా దాదాపు యాభయ్ ట్వీట్లు, అనుబంధంగా వందలాదిమంది బాధితులు ఆయనను రాత్రంతా సంప్రదిస్తూనే ఉన్నారు. చివరగా బుధవారం తెల్లవారుఝామున ఒంటిగంట 29 నిముషాలకు బెంగళూరు నుంచి గర్భిణి శ్రీకన్య ట్వీట్ చేసింది. తాను తొమ్మిది నెలల నిండు గర్భిణిని అని మూడేళ్ళ మరో శిశువుతో బెంగళూరులో చిక్కుకు పోయానని తాను హైదరాబాద్ రావడానికి సహాయం చేయమని ప్రాధేయపడింది. వెంటనే కేటీఆర్‌ ‘ఆ బాధ్యత నాది’ అని ఒక అన్నలా భరోసా ఇచ్చి తన కార్యాలయాన్ని పురమాయించారు. అర్ధరాత్రి అందిన ఈ ఆత్మీయ హామీ ఆమెకు కచ్చితంగా ఎంతో ఊరటనిచ్చి ఉంటుంది. ఇట్లా ఆంధ్రాలో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు, తెలంగాణలో ఆగిపోయిన ఆంధ్రా ప్రజలు, పెళ్లిళ్లు జరగాల్సిన వాళ్ళు, చావులకు రావాల్సిన వాళ్ళు వందలు, వేలుగా ఆయనకు అభ్యర్థనలు పంపించారు. అర్థరాత్రి దాటేదాకా మేలుకుని ఉండి ఆయన అందరికీ సమాధానాలు ఇస్తూ, సాంత్వన చేకూరుస్తూనే ఉన్నారు.


నేను సామాజిక మాధ్యమాల్లో చాలామందినే ఫాలో అవుతుంటాను. అమితాబ్‌ బచ్చన్ మొదలు అమిత్ షా వరకు, ప్రధాని నరేంద్ర మోదీ మొదలు నీతూ అంబానీ వరకు అనేక మందిని అనుసరిస్తుంటాను. కానీ ఇంతటి భరోసా కల్పించే నాయకుడు నాకు ఇంకొకరు కనిపించలేదు. ఇప్పుడే కాదు ప్రతిరోజూ ఉదయం లేవగానే కేటీఆర్ దినచర్య ట్విట్టర్‌లో బాధితుల గోడు వినడంతో మొదలవుతుంది. కొన్ని వందల మంది తమ బాధలు వివరిస్తుంటారు, ఆయన వింటారు, అందరికీ సమాధానాలు ఇస్తారు. సమస్యలు పరిష్కరించే బాధ్యత అప్పటికప్పుడు తన కార్యాలయానికి అప్పగిస్తారు. అదంతా వేరే సంగతి. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. మీ జీవితాలకు మీరే కాపలాదారని అందరూ చెపుతున్నారు. ఎవరికి వారు, ఎవరి గడపముందు వారు లక్ష్మణ రేఖ గీసుకుని తమ ఇంట్లో తాము ఉండిపోవాలని చెపుతున్నారు. కానీ, ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే ప్రజలకు అండగా వుండాలని తమ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. మంత్రులు మొదలు మామూలు పంచాయతీ కమిటీ సభ్యుల వరకు ఒక్కొక్కరు ఎక్కడికక్కడ కథానాయకులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది ఎందరు విన్నారో లేదో తెలియదు గానీ ఆ బాధ్యతను కేటీఆర్ తన భుజాలమీద వేసుకున్నారు. ఇలా ప్రతీ నాయకుడు ఒక కథానాయకుడు అయితే అంతకు మించి ఇంకేం కావాలి?!


డా. రాహుల్ రాజారామ్

సామాజిక, రాజకీయ పరిశోధకుడు

Advertisement