Abn logo
Oct 24 2020 @ 05:36AM

మోడీ విధానాలతో దేశంలో సంక్షోభం

Kaakateeya

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం


వనపర్తి టౌన్‌, అక్టోబర్‌ 23 : ప్రధాన మంత్రి మోడీ విధానాలతో దేశంలో ఆహర భద్రత సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో హైదరాబద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించగా, తమ్మినేనితోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కృష్ణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ మోడీ తెస్తున్న నూతన చట్టాల వల్ల భారతదేశం బిచ్చమెత్తుకునే దుస్ధితి వస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ సంపదను శరవేగంగా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతుందని మండిపడ్డారు. పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడం కోసమే ఎర్రజెండా పని చేస్తుందని ఆయన అన్నారు.


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తూ, మతసామరస్యాలకు విఘాతం కలిగిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకట్‌,  కిల్లె గోపాల్‌, జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, డి చంద్రయ్య, సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement