Abn logo
Sep 17 2021 @ 01:22AM

పెళ్లింట విషాదం

గుండెపోటుతో వరుడి అన్న మృతి

ధర్మవరం, సెప్టెంబరు 16: వరుడి అన్న గుండెపోటుతో మృతి చెందటంతో పెళ్లింట విషాదం నెలకొన్న సంఘటన ధర్మవరంలో గురువారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు... పుట్టపర్తి నగర పంచాయతీ ఎనుములపల్లికి చెందిన టాక్సీ ఓనర్‌ కిరణ్‌ (35) తమ్ముడు ప్రశాంత్‌కు, ధర్మవరానికి చెందిన యువతితో  వివాహం నిశ్చయమైంది. దేవాంగ కల్యాణ మండపంలో గురువారం వివాహం జరుగుతుండగా పెళ్లి కుమారుడు ప్రశాంత్‌ అన్న కిరణ్‌కు ఉన్నఫలంగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కొద్దిసేపు పక్కన కూర్చోబెట్టి వివాహం అయిన తరువాత బంఽధువులు ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. కిరణ్‌ పుట్టపర్తిలో టాక్సీ ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల టాక్సీకి బాడుగలు లేక ఆర్థిక సమస్యలతో తరచూ మనోవేదన చెందుతుండేవాడని బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో గుండెపోటుతో మృతి చెందాడని పేర్కొన్నారు. ఇతడికి భార్య సుజాత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.