Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం సిమ్లాకు పోతే.. అదే రాజధానా.?: రామకృష్ణ

అనంతపురం: వైసీపీ మంత్రులు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని రైతులతో మాట్లాడటం అనవసరం అంటూ ఓ మంత్రి అంటే.. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని ఇంకో మంత్రి అంటున్నారని విమర్శించారు. సీఎం జగన్ సిమ్లాకు వెళ్లాడు.. అంటే అప్పుడు అదే రాజధాని అవుతుందా అని ఎద్దేవాచేశారు.  మంత్రి పదవుల కోసం దిగజారి మాట్లాడవద్దని హితవుపలికారు. ఆర్థిక మంత్రా, అప్పుల మంత్రా.. అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పారు. 


జిల్లాలో ఎమ్మెల్యేల అదాయానికి సహకరించకపోవడం వల్లే కలెక్టర్ గంధం చంద్రుడును బదిలీ చేశారని ఆరోపించారు. సహకరించని అధికారులపై రాజకీయ ఒత్తిడి చేస్తున్నారని దుయ్యబట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలని సూచించారు. నీటి పంపకాలపై 2015 జూన్‌లో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమక్షంలో అగ్రిమెంట్ చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం కేసీఆర్.. ఆ అగ్రిమెంట్‌‌ను తిరగదోడాలి అంటున్నారని.. అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్.. ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ క్షణానికోసారి మారుతున్నారని రామకృష్ణ విమర్శించారు.


మోదీ అధికారంలోకి వచ్చాక చరిత్రను వక్రీకరిస్తున్నారని.. అన్నింటినీ నిస్సిగ్గుగా ప్రైవేటీకరణ చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రోడ్లు, రైల్వే పరిశ్రమలు, గంగవరం పోర్టులను ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పారు. మోదీ.. మరో మూడేళ్లలో అంబానీ, ఆదానీలకు కట్టపెడతారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సెప్టెంబర్ 20న అన్ని పార్టీలతో కలిసి  ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా సెప్టెంబర్ 25న భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement