Abn logo
Jul 29 2021 @ 01:44AM

ఆస్పత్రి పైనుంచి దూకి కొవిడ్‌ బాధితుడి ఆత్మహత్య

కృష్ణయ్య మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ దేవేంద్రకుమార్‌ తదితరులు

పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రిలో విషాద ఘటన 

సిబ్బంది తీరే కారణమంటున్న సహ పేషెంట్లు


తిరుపతి సిటీ, జూలై 28: కొవిడ్‌ బాధితుడొకరు ఆస్పత్రి మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలోని స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చోటు చేసు కుంది. పోలీసుల కథనం మేరకు.... చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన పారిశుధ్య కార్మికుడు అయితేపల్లి కృష్ణయ్య(50) కొవిడ్‌ బారినపడి ఈ నెల 24న స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ ఆస్పత్రిలో చేరాడు. మరుసటి రోజు నుంచే తనకు కొవిడ్‌ తగ్గేలా లేదని... ఆస్పత్రిలో ఉండలేనంటూ  వెంటనే ఇక్కడ నుంచి తీసుకువెళ్లాల్సిందిగా బంధువులకు ఫోన్‌ చేసి ఆందోళన చెందేవాడు. త్వరలోనే పూర్తిగా కోలుకుంటావని వారు ధైర్యం చెప్పినా వినిపించుకోకుండా కొవిడ్‌తో చనిపోతానని భయంగా ఉందని ఆందోళన చెందేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కృష్ణయ్య కొవిడ్‌ ఆస్పత్రి మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అక్కడి సిబ్బంది కృష్ణయ్య బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం తెలుసుకున్న అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.కొవిడ్‌ తగ్గదన్న భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కృష్ణయ్య బంధువులు చెప్పిన మేరకు అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఆస్పత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌ లోని పీఐసీయూ వార్డులో చికిత్స పొందుతుండిన కృష్ణయ్య రెండు రోజుల నుంచి ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే బతికి బయటపడతానన్న నమ్మకం లేదని అంటూ ఉండే వాడని ఆయనతోపాటు చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులు పేర్కొంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యే వాడని గుర్తు చేసుకుంటున్నారు. గత నెల 13న నెల్లూరుకు చెందిన కమతం జయమ్మ(60) అనే బ్లాక్‌ ఫంగస్‌ బాధితురాలు  స్విమ్స్‌ శ్రీపద్మావతి కొవిడ్‌ ఆస్పత్రిలోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.అప్పటి వరకు వారితో పాటు చికిత్స పొందు తున్న తోటి కొవిడ్‌ బాధితులు ఈ ఆత్మహత్యలను చూసి మరింత భయాందోళనకు గురవుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మనోధైర్యం కోల్పోయి ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.