Abn logo
Jan 18 2021 @ 00:53AM

జిల్లాలో రెండోరోజు మందకొడిగా వ్యాక్సినేషన్‌

మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌

485 మందికే వ్యాక్సిన్‌!

విజయవాడ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది. తొలిరోజు జిల్లాలో ప్రారంభించిన 30 సెషన్‌ సైట్లలో 2027 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా.. రెండోరోజు ఆదివారం 14 సెషన్‌ సైట్లలో 485 మందికి మాత్రమే ఇచ్చారు. తొలివిడత జిల్లావ్యాప్తంగా 36 వేల మందికి పైగా హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌కు వ్యాక్సిన్‌ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఏర్పాట్లు చేసినా, ప్రక్రియ అందుకనుగుణంగా సాగడం లేదు. ప్రతి సెంటరులో రోజుకు 100 మంది చొప్పున మూడు వేల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. టైమ్‌స్లాట్‌ ప్రకారం వారికి మెసేజ్‌లు పంపిస్తున్నారు. అయితే మెసేజ్‌లు అందుకున్న హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌ అందరూ వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. శనివారం జిల్లావ్యాప్తంగా మూడు వేల మంది ఆరోగ్య సిబ్బందికి టీకా అందించాలనేది లక్ష్యం కాగా.. 973 మంది ముందుకు రాలేదు. వారి కోసం ఆదివారం సెలవు రోజైనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగించారు. అయినా 485 మందికి మాత్రమే టీకా ఇవ్వగలిగారు. మొత్తంగా ఈ రెండు రోజుల్లో 2,512 మంది మెడికల్‌, పారామెడికల్‌ సిబ్బంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఇంకా 488 మంది ముందుకు రాలేదు. సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని సెషన్‌ సైట్లలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 


విజయవంతంగా వ్యాక్సినేషన్‌ : కలెక్టర్‌ 

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : జిల్లాలో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా జరుగుతోందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అన్నారు. మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. వ్యాక్సిన్‌ను భద్రపరచిన గదిని, వ్యాక్సిన్‌ వేస్తున్న విధానాన్ని పరిశీలించి, ఇందుకు సంబంధించిన వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ  శని, ఆదివారాల్లో 2,700మందికి  కరోనా వ్యాక్సిన్‌ వేశారన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారందరూ సురక్షితంగా ఉన్నారని, ఒకరిద్దరు స్వల్ప అస్వస్థతకు గురైనా, వెంటనే కోలుకున్నారని చెప్పారు. కలెక్టర్‌ సమక్షంలో వ్యాక్సిన్‌ వేయించుకున్న డాక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం తదితరులకు  ధ్రువపత్రాలను అందజేశారు. 

Advertisement
Advertisement
Advertisement