Abn logo
Sep 25 2021 @ 12:31PM

HYD: కొవిడ్‌ మందులతో ఇన్‌ఫెక్షన్‌

ఓ మహిళ రెండు మోకాళ్లకు కూడా..

శస్త్రచికిత్సతో సరిచేసిన కిమ్స్‌ వైద్యులు


హైదరాబాద్‌ సిటీ: కరోనా వైరస్‌ తర్వాత పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలు చాలా మందిని వెంటాడుతున్నాయి. ఇన్‌ఫెక్షన్‌ సోకి ఆస్పత్రి పాలు చేస్తోంది. కొవిడ్‌ వచ్చి తగ్గిన ఓ వృద్ధురాలికి మందుల ప్రభావం వల్ల రెండు మోకాళ్లలో ఇన్‌ఫెక్షన్‌ సోకింది. ఈ పరిస్థితిని శస్త్రచికిత్సతో సరిచేసినట్లు కిమ్స్‌ ఆస్పత్రి పేర్కొంది. ఒంగోలుకు చెందిన నాగేశ్వరమ్మ (60) ఏడేళ్ల క్రితం రెండు మోకాళ్లు మార్పిడి చేయించుకున్నారు. గత ఏడాది ఆగస్టులో ఆమెకు కొవిడ్‌ సోకింది. వైరస్‌ నియంత్రణకు కార్టికో స్టెరాయిడ్లు, యాంటీవైరల్‌ మందులు, ఇతర ఔషధాలను వినియోగించారు. నెల రోజుల పాటు క్వారంటైన్‌ తర్వాత ఆమెకు రెండు మోకాళ్లు వాచి నొప్పి మొదలైంది. రక్తపరీక్షలు చేయిస్తే ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు తేలింది. స్థానిక వైద్యులు ఇచ్చిన యాంటీబయోటిక్స్‌తో తగ్గినట్లే తగ్గి కొన్ని వారాల తర్వాత నొప్పి, వాపు మళ్లీ మొదలయ్యాయి. దీంతో మోకాళ్లలో ఉండే ద్రవాలను తీసి కల్చర్‌ పరీక్ష చేయించగా బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు తేలింది. దీంతో చికిత్స కోసం కొండాపూర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఫిబ్రవరిలో ఆమె మోకాళ్లలోని ఇంప్లాంట్లు తీసి యాంటీబయోటిక్‌ సిమెంట్‌ స్పేసర్లను వేశారు. ఆరు వారాల తర్వాత మార్చి నెలలో స్పేసర్లను తీసి రెండు వైపులా మోకాళ్ల మార్పిడిని సరి చేసే శస్త్రచికిత్స చేశారు. రెండు కాళ్లకు ఒకేసారి పెరిస్టోస్టెటిక్‌ జాయింట్‌ ఇన్‌ఫెక్షన్‌ రావడం చాలా అరుదని ఆస్పత్రి చీఫ్‌ కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్‌, జాయింట్‌ రీప్లే్‌సమెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ సాయిలక్ష్మణ్‌ వివరించారు. ఎక్కువ మోతాదులో కార్డికో స్టెరాయిడ్స్‌ వినియోగించడం వల్లనే ఈ సమస్య ఏర్పడిందని, కొవిడ్‌ చికిత్సకు వినియోగించే మందులు ఎన్నాళ్ల తర్వాతయినా ఎలాంటి దుష్ప్రభావాలైనా చూపిస్తాయని ఈ రోగి విషయంలో తేలిందని పేర్కొన్నారు.