Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 1 2021 @ 13:16PM

కట్టుదిట్టంగా Covid మార్గదర్శకాలు

- అధికారులను ఆదేశించిన సీఎం 

- బెంగళూరు అపార్ట్‌మెంట్‌లో పదిమందికి వైరస్‌ 

- సీల్‌డౌన్‌


బెంగళూరు: కొవిడ్‌ మార్గదర్శక సూత్రాలను కట్టుదిట్టంగా పాటించాలని అధికారులకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మంగళవారం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌ వైరస్‌ క్లస్టర్లుగా మార్చిన ధార్వాడ ఎస్‌డీఎం కళాశాల, ఆనేకల్‌, మైసూరు కళాశాలల్లో మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. బెంగళూరు ఆర్‌టీ నగర్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేపదే హెచ్చరిస్తున్నా మీడియాలో ఒమైక్రాన్‌పై వదంతులు ప్ర సారం చేస్తున్న వైనంపై సీఎం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించాలని ప్రజలను అనవసరంగా భయాందోళనలకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. అవసరమైతే మీడియా సంస్థల నిర్వాహకులతో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఒమైక్రాన్‌ వైరస్‌ దేశంలో ఇంకా ఎక్కడా గుర్తించలేదని, అయినా ముందు జాగ్రత్తగా పూర్తిస్థాయిలో జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశామన్నారు. సరిహద్దుల్లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అన్ని ప్రముఖ విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కొవిడ్‌ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రమంతటా ఆరోగ్య శాఖాధికారులు నిఘాను విధించారన్నారు. 


అపార్ట్‌మెంట్‌లో పది మందికి వైరస్‌ 

బెంగళూరు కోరమంగలలోని రహేజా అపార్ట్‌మెంట్‌లో పది మందికి కొవిడ్‌ పాజిటివ్‌ సోకడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. బీబీఎంపీ అధికారులు తక్షణం రంగంలోకి దిగి అపార్ట్‌మెంట్‌ను సీల్‌డౌన్‌ చేశారు. ఇటీవల అపార్ట్‌మెంట్‌లో పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న 16 మందిలో పది మందికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు జరుపుకోగా పాజిటివ్‌ వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగురిని కూడా క్వారంటైన్‌లో ఉంచారు. ఇప్పటికే ధార్వాడలోని ఎస్‌బీఎం కళాశాలలో గెట్‌ టు గెదర్‌లో పాల్గొన్న 300 మంది విద్యార్థులకు పాజిటివ్‌ సోకిన సంగతి తెలిసిందే. 


రెండో వేవ్‌ సమయంలో రూ. వెయ్యి కోట్ల ఖర్చు 

కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో రాజధాని బెంగళూరులో అపార ప్రాణనష్టం సంభవించిన సంగతి తెలిసిందే. అప్పట్లో చికిత్సల కోసం బీబీఎంపీ మొత్తం 198 వార్డుల్లో కొవిడ్‌ నిర్వహణ ఆస్పత్రుల్లో చికిత్సల కోసం ఏకంగా రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసింది. ఈ మేరకు బీబీఎంపీ నగరంలో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యుత్‌ స్మశాన వాటికల్లో కొవిడ్‌ మృతుల అంత్యక్రియల కోసం రూ.88 లక్షలు ఖర్చు చేయగా కంటోన్మెంట్‌ జోన్‌లలో ప్రజలకు ఆహార కిట్‌ల కోసం రూ.47.50 కోట్లను ఖర్చు చేశాయి. కొవిడ్‌ వారియర్స్‌గా పనిచేసిన హోంగార్డులకు రూ.89 లక్షలు చెల్లించారు. కొవిడ్‌ పరీక్షల కోసం రూ.219 కోట్లు ఖర్చు చేశారు. అంబులెన్స్‌, ఇతర సేవల కోసం రూ.125 కోట్లు వెచ్చించారు. సీల్‌డౌన్‌, క్వారంటైన్‌ల కోసం రూ.346 కోట్లు ఖర్చు చేశారు. 


విందులు, వినోదాలు వద్దే వద్దు

కొత్త వైర్‌సకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి మార్గసూచి వెలువడేంత వరకు ఎలాంటి నిషేధాలు ఉండవని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ స్పష్టం చేశారు. నగరంలో మంగళవారం ఆయన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒమైక్రాన్‌ కథనాల నేపథ్యంలో వైద్య నిపుణుడు డాక్టర్‌ రవి నాయకత్వంలో పది మంది సభ్యుల సమితిని ఏర్పాటు చేశామన్నారు. యూనిఫాం ట్రీట్‌మెంట్‌ ప్రొటోకాల్‌ను రూపొందించే దిశలో ఈ కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తుందన్నారు. ప్రజలంతా సాధ్యమైనంత త్వర గా వ్యాక్సిన్లు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొదటి డోసు పూర్తయినవారు గడువులోగా రెండో డోసును కూడా వేయించుకోవాలని ఈ విషయంలో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. 


Advertisement
Advertisement