Abn logo
Sep 24 2021 @ 01:15AM

ఆగని కేసులు

  • జిల్లాలో 2,90,091కు చేరుకున్న కొవిడ్‌ కేసులు
  • అత్యధిక పాజిటివ్‌లతో రాష్ట్రంలో తొలి స్థానంలో జిల్లా
  • తర్వాత వరుసలో 2,42,747 కేసులతో చిత్తూరు 
  • జిల్లాలో మళ్లీ క్రమేపీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు
  • గడచిన 47 రోజుల్లో 10,091 మందికి పాజిటివ్‌
  • ఈ పది రోజుల్లో కొవిడ్‌ బారిన 2,259 మంది

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ కేసులు గురువారంతో 2,90,091కి చేరాయి. ఇన్ని కేసు లతో జిల్లా రాష్ట్రం మొత్తం మీద తొలి స్థానంలో నిలిచింది. ఒకపక్క ఇతర జిల్లాల్లో కొన్ని నెలల కిందటే పాజిటివ్‌లు గణనీయంగా అదుపులోకి వచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం అదే పనిగా పట్టిపీడిస్తున్నాయి. ప్రతి రోజు వందల్లో నమోదవుతూ కలవరపెడుతున్నాయి. గడచిన పదిరోజుల్లో జిల్లావ్యాప్తంగా ఏకంగా 2,259 మందికి కొవిడ్‌ సోకింది. అదే గడచిన 47 రోజుల్లో 10,091 కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి కేసుల వేగం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. వాస్తవానికి ఇతర జిల్లాలో ఎక్కడా ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం లేదు. మరోపక్క గడచిన కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళనకు దారితీస్తోంది. గురువారం 255 మందికి కొవిడ్‌ సోకినట్టు రాష్ట్ర ప్రభుత్వ కొవిడ్‌ బులిటెన్‌ వెల్లడించింది. ఇతర జిల్లాల్లో మాత్రం రెండంకెల సంఖ్య లో ఉన్నాయి. మరోపక్క కేసులు తగ్గిపోయాయనే భ్రమలో జిల్లావ్యాప్తంగా అధికారులు పాజిటివ్‌ల నియంత్రణపై దృష్టిసారించడం లేదు. కనీస సమీక్ష కూడా చేయడం లేదు. ఎక్కడైనా కేసులు వస్తే హోం ఐసోలేషన్‌కు అనుమతించి చేతులు దులిపేసుకుంటున్నారు. కంటైన్మెంట్‌ జోన్ల పర్యవేక్షణ పూర్తిగా పక్కనపెట్టేశారు. ఒకపక్క కేసులు పెరుగుతున్నా అప్రమత్తత పాటించడం లేదు. కేవలం కర్ఫ్యూ సమయాన్ని అమలు చేస్తున్నట్టు మాత్రం ప్రకటనలు జారీచేస్తూ మమ అనిపిస్తున్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు, నగరాల్లో కొవిడ్‌ మహమ్మారి పుంజుకుంటోంది. అయినా వైద్యఆరోగ్యశాఖను అప్రమత్తం చేయడం లేదు. అటు కొవిడ్‌ టెస్టింగ్‌ కేంద్రాలను దాదాపు ఎత్తేశారు. శాంపిళ్ల సేకరణ సంగతి సరేసరి. కేసుల రద్దీ పెగిపోతే తట్టుకునేందుకు అమలాపురం,   రాజమహేంద్రవరంలో టెస్టింగ్‌ కేంద్రాల నిర్మాణానికి టెండర్లు పిలిచినా నిర్మాణానికి దిక్కులేదు. ఈ నేపథ్యంలో మహమ్మారి మళ్లీ విజృంభిస్తే మునుపటిలా శాంపిళ్లను కాకినాడ ల్యాబ్‌కు పంపించడం మినహా మరో మార్గం లేదు. ఇదిలాఉంటే గతేడాది ఏప్రిల్‌ రెండో వారం నుంచి జిల్లాలో కొవిడ్‌ ప్రభావం మొదలైంది. అప్పటి నుంచి నవంబరు వరకు కొనసాగిన తొలి వేవ్‌లో జిల్లా మొత్తం మీద 1.11 లక్షలకుపైగా పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఇన్ని కేసులు నిర్ధారణ కావడంతో దేశవ్యాప్తంగా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న 30 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం తూర్పుగోదావరిని చేర్చింది. అత్యధికంగా గతేడాది సెప్టెంబర్‌లో 37,771 పాజిటివ్‌లు రాగా, ఆగస్టులో 39,008 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత డిసెంబ ర్‌ నుంచి మళ్లీ కేసులు తగ్గాయి. దీంతో జనం యథావిథిగా కొవిడ్‌ నిబంధనలు వదిలేసి తిరిగేశారు. ఫలితంగా ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్‌, మే నెలల్లో జిల్లాను కొవిడ్‌ కకావికలం చేసేసింది. రోజుకు మూడు వేలకు పైగా పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. వేలాదిమంది ఆసుపత్రులపాలవగా, వందలాది మంది కన్ను మూశారు. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క, ప్రాణవాయువు దొరక్క చనిపోయినవారి సంఖ్యకు లెక్కేలేదు. దీంతో కేసుల సంఖ్య 2.50 లక్షలకు దాటిపోయింది. తిరిగి జూన్‌లో కొంత తీవ్రత తగ్గింది. ఆ తర్వాత జూలై 12 నాటికి జిల్లాలో మొత్తం పాజిటివ్‌లు 2.70 లక్షలకు చేరుకున్నాయి. తిరిగి మళ్లీ 26 రోజుల వ్యవధిలో పది వేలకు పెరిగి ఆగస్టు 7 నాటికి 2.80 లక్షలకు చేరాయి. మళ్లీ 47 రోజుల తర్వాత గురువారంతో మొ త్తం పాజిటివ్‌లు 2,90,091కు చేరుకున్నాయి. ఇప్పటికీ 2,606 మంది కొవిడ్‌తో ఆసుపత్రులు, హోంఐసోలేషన్‌లలో చికిత్స పొందుతున్నారు.