Abn logo
Sep 21 2021 @ 23:31PM

కరోనా కలకలం

అంకన్నగూడెంలో పారిశుధ్యంపై వివరాలడుగుతున్న ఐటీడీఏ పీవో

రాచన్నగూడెంలో నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌

ముందుగా ఉపాధ్యాయురాలికి కొవిడ్‌ నిర్ధారణ


జీలుగుమిల్లి, సెప్టెంబరు 21: రాచన్నగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం కలకలం రేపింది.  తొమ్మిదేళ్లు, పదకొండేళ్ల వయసు పిల్లలకు కరోనా సోకడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో స్థానికులు సైతం హడలిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం  పాఠశాల ఉపాధ్యాయురాలు ఎం.కవితకుమారికి జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆమెకు కొవిడ్‌ పాటిజివ్‌ నిర్ధారణ అయింది. అనంతరం పాఠశాల్లో నలుగురు విద్యార్థులకు వైరస్‌ సోకింది. నాలుగో తరగతి బాలురు ముగ్గురు, ఆరో తరగతి బాలికకు పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు స్థానికులు చెబుతున్నారు. పిల్లలను పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రులు భయప డుతున్నారు. ఈ విషయమై పీహెచ్‌సీ వైద్యురాలిని ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. పాఠశాలలో 70 మంది విద్యార్థులకు మంగళవారం కరోనా పరీక్షలు చేశారు. అనంతరం పాఠశాలకు సెలవు ఇచ్చి అందరిని ఇంటికి పంపేశారు. చిన్నారులకు కరోనా టెస్టులు చేసే సమయంలో ఏఎన్‌ఎం కిట్‌ ధరించకపోవడం గమనార్హం. ఇటీవల ప్రజాప్రతినిధులు పాఠశాల్లో నాడు–నేడు కార్యక్రమ సందర్శనకు రావడం పాఠశాలలో వారితోపాటు ప్రజలు గుమిగూడడంతో విద్యార్థులు కరోనా బారిన పడ్డారని గ్రామస్థులు వాపోతున్నారు.


గ్రామాల్లో పారిశుధ్యంపై ఐటీడీఏ పీవో ఆరా


గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచే చర్యలపై కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఐటీడీఏ పీవో ఆనంద్‌ అన్నారు. మండలంలో అంకన్నగూడెం, తాటియాకులగూడెం, రాచన్నగూడెం, జీలుగుమిల్లి పంచాయతీల్లో పారి శుధ్యం ఆయన స్వయంగా పరిశీలించారు. వలంటీర్ల పనితీరు, ప్రజారోగ్యం పై క్షేత్రస్థాయిలో ప్రజలను ఆరా తీశారు. వ్యాక్సినేషన్‌, పారిశుధ్యంకు సంబంధించి రికార్డులు తనిఖీ చేశారు. ఆయన వెంట కార్యదర్శులు సప్తగిరి, రాంకీ, వీఆర్వో వెంకటేశ్వరావు ఉన్నారు.


సీజనల్‌ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి


సీజనల్‌ జ్వరాలైన డెంగీ మలేరియా, చికున్‌గున్యా జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో వైద్యం పొందాలని 104 వైద్యులు ప్రి యాంక అన్నారు. జిల్లా ఇన్‌చార్జి సాయిగణేష్‌, డివిజన్‌ ఇన్‌చార్జి సురేష్‌ ఆదేశాల మెరకు గిరిజన గ్రామాల్లో 104 సేవలు అందజేస్తున్నామన్నారు. 8రకాల పరీక్షలు, 98రకాల మందులు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. దోమ తెరలు వాడుకోవాలని సూచించారు. ఇళ్ల వద్ద మురుగునీరు నిల్వ ఉంచరాదన్నారు. హెల్త్‌ ఎడ్యుకేటర్‌ సరోజిని, కార్యదర్శి దేవప్రియుడు, వైద్య సిబ్బంది హరీష్‌, బేగ్‌, పద్మ, దుర్గ ఉన్నారు.

పి.అంకంపాలెంలో జ్వరాలపై అవగాహన కల్పిస్తున్న వైద్యులు