Abn logo
Sep 25 2021 @ 12:11PM

HYD: గుండెపై కొవిడ్‌ ఎటాక్‌

పెరిగిన హృదయ సంబంధిత సమస్యలు

ఆకస్మిక మరణాలకు కారణమవుతున్న సీవీడీ

అత్యవసర చికిత్సతో ప్రాణాపాయ స్థితి దాటివేత


హైదరాబాద్‌ సిటీ: కరోనా కాలంలో గుండె సమస్యలు మరింత పెరిగాయని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‌ మొదటి, రెండో దశ ప్రభావం గుండె పనితీరుపై ప్రభావం చూపుతోందని పేర్కొంటున్నారు. చాలా మంది ఇళ్లలో ఉండడంతో శారీరక శ్రమ తగ్గింది. రెడీమేడ్‌ ఆహార పదార్థాలకు అలవాటు పడ్డారు. దీంతో అధిక బరువు, షుగర్‌ సమస్యలు తలెత్తడంతో గుండె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు వివరించారు. 

ఆకస్మిక గుండెపోటు అంశంపై మెడికవర్‌ వైద్యులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర అంశాలతో పాటు కొవిడ్‌ సంబంధిత సమస్యలను వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. అకస్మాత్తు మరణాలకు కార్డియోవాస్కులర్‌ డిసీజ్‌ (సీవీడీ) ప్రధాన కారణం. గుండె జబ్బులున్న 40 ఏళ్లు దాటిన వారిలో 35 నుంచి 40 శాతం కార్డియాక్‌ అత్యవసర పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి వారిలో 50 శాతం మంది ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ తరహా గుండెపోటు వచ్చిన వారికి లెవల్‌ -1 కార్డియాక్‌ ఎమర్జెన్సీ కేర్‌ సెంటర్‌ ద్వారా చికిత్స అందిస్తే దాదాపు 80 శాతం మేరకు రోగిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చు. కార్డియాక్‌ ఎమర్జెన్సీ కేర్‌ చికిత్సతో బాధితుల మనుగడ రేటును 80 శాతానికి పెంచడానికి అస్కారముందని వివరించారు. తీవ్రమైన గుండెపోటుతో వచ్చిన రోగి రక్తపోటు స్థితి, ఎడమ జఠరిక పంపు వైఫల్యం ఆధారంగా రెండు గ్రూపులుగా వర్గీకరించి చికిత్సలు అందించాల్సి ఉంటుంది. రెండో తరహాలో స్టంట్‌ లేకుండా రక్తనాళాన్ని తెరవడం ద్వారా అత్యవసర యాంజియోగ్రామ్‌ నిర్వహించి సరిచేయవచ్చు. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చిన రోగి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం అత్యంత వేగంగా అంచనా వేసి చికిత్స అందిస్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విలేకరుల సమావేశంలో మెడికవర్‌ గ్రూప్‌ సీటీసీవీఎస్‌ సర్జన్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌, చైర్మన్‌ డాక్టర్‌ అనిల్‌కృష్ణ, డైరెక్టర్‌, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ శరత్‌రెడ్డి, ఎమర్జెన్సీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ సతీష్‌ కుమార్‌ కైలాసం పాల్గొన్నారు.