Abn logo
Jul 29 2021 @ 01:24AM

పన్నుల భారం ఏకపక్షం

కౌన్సిల్‌ హాలు ఎదుట టీడీపీ, సీపీఎం సభ్యుల నిరసన

సవరణ తీర్మానాన్ని  ప్రతిపాదించిన ప్రతిపక్షాలు

పట్టించుకోకుండా అర్ధంతరంగా సభ ముగించిన మేయర్‌

పన్ను పెంపు 0.15 నుంచి 0.13 తగ్గిస్తూ ఆమోదం

375 చదరపు అడుగులకు రూ.50 వసూలుకు ఆమోదం

నివాస గృహాలకు స్వల్ప ఊరట


ప్రతిపక్షాల అభిప్రాయాలకు విలువలేదు. సవరణకు అవకాశం ఇవ్వలేదు. జీవో 198పై చర్చించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం ఏకపక్షంగానే సాగింది. సమావేశం ప్రారంభం కాగానే జీవో 198పై ఎజెండాను ప్రవేశ పెట్టి అధికార పార్టీ వెంటనే ఆమోదించుకుంది. దీనిపై ప్రతిపక్షం అభ్యంతరాలకు అవకాశం ఇవ్వలేదు. సవరణ అంశాన్ని ప్రతిపాదించినా పట్టించుకోలేదు. దీంతో జీవోను రద్దు చేయాలని ప్రతిపక్ష కార్పొరేటర్లు సభలో ఆందోళన చేశారు. చివరికి అధికార పక్షం పేదల పార్టీ అంటూ జీవోలో నివాస గృహాలకు పన్ను పెంపు 0.15 నుంచి 0.13 తగ్గించడంతోపాటు, 375 చదరపు అడుగులకు రూ.50 పన్ను వసూలు చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ ఆమోదించుకుంది. 


చిట్టినగర్‌, జూలై 28 : నగరపాలక సంస్థ కౌన్సిల్‌ హాలులో మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన 198 జీవోపై ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం బుధవారం జరిగింది. కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ పన్ను వనూలు విధానాన్ని సభకు వివరించారు. అనంతరం అదనపు కమిషనర్‌ శారదాదేవి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అద్దె ఆధారిత, ఆస్తి విలువ ఆధారితపన్నుల విధింపుపై కార్పొరేటర్లకు వివరించారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ నెలిబండ్ల బాలస్వామి, సీపీఎం ఫ్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబు, ప్రతిపక్ష కార్పొరేటర్లు 198 జీవోను రద్దు చేయాలని, ప్రజలపై భారాలు మోపవద్దని ఆందోళన చేసినా అధికార పార్టీ కార్పొరేటర్లు ముక్తకంఠంతో జీవోను ఆమోదించుకున్నారు.


లోపల, బయట నిరసనలు

198జీవోపై కౌన్సిల్‌ బయట కూడా నిరసనలు వెల్లువెత్తాయి. వామపక్షాలు వీఎంసీ కార్యాలయం ఎదురుగా ఆందోళనకు దిగాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు. కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి వెలంపల్లి కారును ప్రతిపక్ష టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అనంతర జీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ కౌన్సిల్‌ హాలుకు వెళ్లారు. కార్పొరేషన్‌ ఎదుట వామపక్షాల నాయకులు ఆస్తి, నీటి, చెత్త తదితర పన్నులను రద్దు చేయాలని ఆందోళనకు దిగడంతో సీపీఎం నేతలు సీహెచ్‌ బాబూరావు, దోనేపూడి శంకర్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. 


చర్చించకుండా తీర్మానం చేశారు 

198జీవోపై ఎటువంటి చర్చలేకుండా ఏకపక్షంగా తీర్మానం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సవరణ తీర్మానం పెట్టమన్నా మేయర్‌ పట్టించుకోలేదు. సభను అర్ధాంతరంగా ముగించారు. సవరణ ద్వారా ఓటింగ్‌ పెట్టాలని ఫోన్‌ చేసినా, భయపడి ఓటింగ్‌ కూడా పెట్టకుండా అధికార పార్టీ పారిపోయింది. - ఎన్‌.బాలస్వామి, టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ 


నిరసన తెలుపుతున్న వామపక్ష నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు