Abn logo
Oct 6 2020 @ 03:33AM

పత్తి రైతు చిత్తు...!

Kaakateeya

అధిక వర్షాలకు దెబ్బతిన్న తెల్లబంగారం.

పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం.... 

ఎకరాకు ఐదు క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి

పెట్టుబడులు వచ్చేదీ కష్టమే.. ఆందోళనలో అన్నదాతలు


పరిగి: ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన అధిక వర్షం పత్తి రైతును చిత్తు చేసింది. ఆరంభంలో ఆశలు రేపిన తెల్లబంగారం ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులను తెల్లబోయేలా చేసింది. ఏపుగా ఎదిగి ఊపుమీద ఉన్న పత్తి పంట అతివృష్టితో కురిసిన వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నది. వర్షపు నీటికి పత్తికాయలు రాలిపోవడమే కాకుండా పత్తిమొక్కలు కూడా నిలుపునా మురిగిపోయాయి. ప్రస్తుతం పత్తికాయలు పగిలి కళకళలాడాల్సిన పత్తి వికారాబాద్‌ జిల్లాలో నీటమునిగి అపార నష్టాన్ని కలిగించింది. పంటను రక్షించుకునేందుకు ఆరంభం నుంచి అష్ట, కష్టాలు పడ్డామని, ఆపై పురుగుల బాధతో తీవ్ర నష్టాల పాలయ్యామని రైతులు వాపోతున్నారు. ఇలాంటి అతివృష్టి  పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని స్థితిలో రైతులు దిక్కులు చూస్తున్నారు. వర్షాధారంపై సాగయ్యే పత్తి ఈసారి సాధారణ విస్తీర్ణం కంటే రెండింతలు సాగు చేశారు. జిల్లాలో గత ఏడాది పత్తి లక్షన్నర ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 2,30,192 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు.


అయితే అధిక వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ సారి మొదటి నుంచి వర్షాలు ఎక్కువగానే ఉండడంతో రైతులు ఎంతో సంతోషించారు. విత్తనాలు విత్తిన నాటి నుంచి పూత, కాత వరకు మురిపించింది. కాయలు గట్టిపడే సమయంలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో పత్తి పంటకు నష్టం జరిగింది. అంతా బాగుందనుకున్న సమయంలో వర్షాభావం తీవ్ర దెబ్బ తీసింది. ఆశించిన దానిలో సగం కూడా దిగుబడులు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. పత్తి నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు సమర్పించిన నివేదికలు నామమాత్రంగానే ఉన్నాయి.


జిల్లాలో దాదాపుగా 50వేల ఎకరాలకు పైగా పత్తి పంటకు నష్టం జరిగిందని అంచనా. అయితే అధికారులు మాత్రం పది వేలలోపు ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగిందని చెబుతున్నారు. అన్నిరకాలుగా అనుకూలిస్తే ఎకరాకు 12 నుంచి 20  క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చేది. ఈ సారి ఎకరానికి ఆరు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరానికి రూ.35 వేల వరకు పెట్టు బడులు పెట్టారు. దిగుబడి ఐదు క్వింటాళ్లు వస్తే కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.


అధికవర్షాలకు తోడు తెగులు 

అధిక వర్షానికి తోడు పంటకు ఎర్ర తెగులు సోకింది. ఎన్నడూ లేనివిధంగా పూత, కాయలు రాలిపోతూ... మొక్క చనిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 


పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు.. - గోలియానాయక్‌, పత్తిరైతు, నజీరాబాద్‌తండా

రెండెకరాల్లో పత్తేశాను. మొత్తం పంటకు రూ.60వేల దాకా ఖర్చయింది. మొదట్లో పంట బాగా పెరిగింది. తర్వాత వర్షాలు ఆగకుండా పడ్డాయి. దీంతో పొలంలో నీరు నిలబడటంతో మొక్కలు నీట మునిగాయి. దీంతో చెట్టుకు పట్టిన కాయలు రాలిపోయాయి. మొదట్లో చెట్టుకు 50 కాయల దాకా ఉండేవి. ఇప్పుడు అన్నీ రాలి 20 కాయలు కూడా లేకుండా పోయాయి. ఎకరాకు నాలుగు క్వింటాళ్ల పత్తి కూడా పండేలా లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. 

Advertisement
Advertisement