Abn logo
Jan 17 2021 @ 23:50PM

ఉత్తి కొనుగోళ్లు!

గత ఏడాది జనవరిలో పత్తి కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి వచ్చిన పత్తి బేళ్లు (ఫైల్‌)

సీసీఐ నిబంధనలతో పత్తి రైతుల ఆవేదన

తిరిగి దళారులనే ఆశ్రయిస్తున్న వైనం

జిల్లాలో దిగుబడి అంచనా 42,000టన్నులు

ఇప్పటివరకు కొనుగోలు చేసింది 1,975 టన్నులు


ఒంగోలు (జడ్పీ)/పర్చూరు/మార్కాపురం, జనవరి 17 : జిల్లాలోని పర్చూరు ఏఎంసీలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. దీన్ని అధికార పార్టీ నాయకులు ఆర్భాటంగా ప్రారంభించారు. ఒక్క రోజు తిరక్కుండానే ఎత్తివేశారు. పర్చూరు మండలం దగ్గుబాడు, ఇంకొల్లు మండలం నాగులపాలెంలో పాయింట్లు ఏర్పాటు చేశారు. కొనుగోళ్ల బాధ్యతను అనధికారికంగా వ్యాపారులకు అప్పగించారు. దీంతో వారు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులు ఇళ్ల వద్దనే దళారులకు వచ్చినకాడికి అమ్ముకుంటున్నారు.

మార్కాపురంలో డివిజన్‌ మొత్తానికి కలిపి స్థానిక మార్కెట్‌ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఒక టేబుల్‌ వేశారు. కొనుగోళ్లు నామమాత్రంగా సాగుతున్నాయి. పత్తిని కొనడం అటుంచి రకరకాలైన కారణాలతో కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రంగు, తేమశాతం తదితరాలపై అభ్యంతరాలు చెప్తున్నారని వారు వాపోతున్నారు. ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసలతో తెచ్చినా ధర లభిస్తుందన్న నమ్మకం లేకపోవడంతో రైతులు రావడం లేదు.


ఇదీ జిల్లాలో పత్తి కొనుగోళ్ల తీరు. మొత్తం మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా అన్నీ అదే తీరున సాగుతున్నాయి. రైతులకు మద్దతు ధర లభించేలా చూడటంతోపాటు వారికి అండగా నిలవాల్సిన  కేంద్రాలు లక్ష్యానికి దూరంగా ఉంటున్నాయి. ప్రధానంగా రైతులకు ఈక్రాప్‌ నమోదు తలనొప్పిగా మారింది. అలాగే నిబంధనలు, తేమశాతం, రంగు కూడా ప్రతిబంధకంగా తయారయ్యాయి. దీంతో మంచి ధర లభిస్తుందనే నమ్మకం అటుంచి అసలు మొత్తం కొనుగోలు చేస్తారో లేదోనన్న అనుమానంతో రైతులు ఆ కేంద్రాలకు రావడం లేదు. ఇళ్ల వద్దకే వస్తున్న దళారులు, వ్యాపారులకే వచ్చిన కాడికి అమ్ముకుని నష్టపోతున్నారు.తెల్ల బంగారంగా రైతులు పిలుచుకునే పత్తి సీసీఐ నిబంధనలతో తెల్లబోతోంది. అకాల వర్షాలతో దిగుబడులు తగ్గి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రైతన్నలను పత్తి అమ్మకం దగ్గర కొర్రీలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ మూడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గంపెడాశతో పత్తిని కేంద్రాల వద్దకు తీసుకెళుతున్న రైతులకు ఆయా కేంద్రాల వద్ద నిరాశే ఎదురవుతోంది. తేమ శాతం ఎనిమిదిలోపు ఉంటేనే మద్దతు ధర చెల్లిస్తున్నారు. అంతకన్నా ఎక్కువ ఉంటే తేమశాతాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నారు. ఏదో ఒక రకంగా పత్తిని ఆరబెట్టుకుని రైతులు తేమశాతం నిబంధన నుంచి గట్టెక్కవచ్చు. కానీ నివర్‌ తుఫాన్‌ ధాటికి పత్తి రంగు మారింది. అలా ఉన్న పత్తి కొనుగోలుకు సీసీఐ నిరాకరిస్తోంది. ఇక ఈ-పంట, బ్యాంకు ఖాతా అనుసంధానం తదితర నిబంధనలన్నీ సరేసరి. కష్టనష్టాల కోర్చి ఆయా కేంద్రాల దగ్గరకు పత్తిని చేర్చిన రైతులు నిబంధనల పేరిట అధికారులు కొర్రీలు వేయడంతో గత్యంతరం లేక మరల దళారీలనే ఆశ్రయిస్తూ నిలువునా దోపిడీకి గురవుతున్నారు


జిల్లాలో పత్తి దిగుబడి అంచనా 42,000టన్నులు

జిల్లాలో దాదాపు 30,000 హెక్టార్లలో పత్తి సాగు చేయగా 42,000టన్నుల దాకా దిగుబడి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెలరోజులు దాటింది. ఇప్పటి వరకు 654 మంది  రైతుల దగ్గర నుంచి 1,975 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. వాస్తవానికి జిల్లాలో దిగుబడి అవుతున్న పత్తి మొత్తాన్ని సీసీఐ కొనుగోలు చేసే అవకాశముంది. కానీ నిబంధనల కత్తి దూయడంతో లక్ష్యానికి ఆమడదూరంలోనే పత్తి కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి


మద్దతు ధర క్వింటా రూ. 5,825

క్వింటా పొడవు పింజ పత్తికి మద్దతుఽ దరను రూ. 5,825గా నిర్ణయించారు. మీడియం అయితే రూ.5,725, కురచ రకానికి 5,615గా సీసీఐ లెక్కకట్టింది. జిల్లాలో  మార్కాపురంలో ఒకటి, పర్చూరులో రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రకృతి విపత్తులకు తోడు తెగుళ్లు కూడా విజృంభించడంతో ఈ ఏడాది దిగుబడి కూగా సగానికి సగం తగ్గిపోయింది. దీంతో పత్తి రైతులు నష్టాల ఊబిలోకి కూరుకుపోయారు. తేమశాతం నిబంధనను అలానే ఉంచినా రంగుమారిన పత్తిని కూడా సీసీఐ కేంద్రాల్లో కొనే విధంగా కేంద్రం ఆదేశాలివ్వాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. 


పూర్తిగా నష్టపోయాం

శివాలశెట్టి సుబ్బారావు, పర్చూరు.

ప్రకృతి ప్రతికూలత, గులాబిరంగు తెగులుతో ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయాం. ఒకటిన్నర ఎకరంలో పత్తిని సాగు చేయగా ఎకరానికి రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఎకరానికి రూ.50వేలకు పైగా పెట్టుబడులు పెట్టా. ప్రభుత్వం క్వింటాకు రూ.5,800 చొప్పున మద్దతు ధర కల్పించినా అమ్ముకుందామంటే కొనే నాఽథుడే కరువయ్యారు. 


అధిక వర్షాలతో దిగుబడి తగ్గింది

ఏరువ చిన్న నారాయణరెడ్డి, పెద్దారవీడు

ఈ ఏడాది పత్తి దిగుబడి బాగా తగ్గింది. అధిక వర్షాలు, తుఫాన్‌ల కారణంగా తీవ్రంగా నష్టపోయాం. ఏటా ఎకరాకు  10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చేది. కానీసారి 6 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. అదీనూ పురుగు పట్టి నాణ్యత తగ్గింది. దీంతో పత్తి కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లలేక మా ఊర్లోనే క్వింటా రూ.3700- రూ.3,900 మధ్యలో అమ్ముకున్నా.


పత్తి కొనుగోలు సగానికి తగ్గింది

రవికుమార్‌, కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, మార్కాపురం

ఈ ఏడాది పత్తి కొనుగోలు సగానికి తగ్గింది. గతేడాది మార్కాపురం  కొనుగోలు కేంద్రం ద్వారా 9,975 క్వింటాళ్ల పత్తిని సేకరించాం. కానీ ఈ ఏడాది ఇప్పటికి 4,675 క్వింటాల పత్తిని మాత్రమే కొనుగోలు చేశాం. రైతులు తీసుకువస్తున్న పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో వారికి గిట్టుబాటు కావడం లేదు.


మంగళవారం అమ్మకానికి ఉంచిన పత్తి భైళ్లు


Advertisement
Advertisement
Advertisement