Abn logo
Aug 4 2020 @ 01:51AM

300 కోట్లు!

  • రామాలయ నిర్మాణానికి అయ్యే వ్యయం
  • ట్రస్టు వద్ద ప్రస్తుతం ఉన్నది 15 కోట్లే!
  • వెండి, బంగారం పంపొద్దు!

రామాలయ నిర్మాణ వ్యయం రూ.300 కోట్లు ఉండొచ్చని అంచనా. భక్తుల సౌకర్యాల నిమిత్తం ఆలయ ప్రాంగణంలోని 20 ఎకరాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. దీనికి ఎంతలేదన్నా రూ.1,000 కోట్ల వరకు ఖర్చవుతుందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రామాలయ నిర్మాణం కోసం కేంద్రం మహంత నృత్యగోపాల్‌ దాస్‌ సారథ్యంలో ‘శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్టును ఏర్పాటుచేసింది. రామజన్మభూమి ఉద్యమ సమయంలో విశ్వహిందూపరిషత్‌ (వీహెచ్‌పీ) ట్రస్టును ఏర్పాటుచేసి ఆలయ నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు వసూలు చేసింది. అందులో నుంచి రూ.10 కోట్లను కొత్త ట్రస్టుకు బదిలీ చేశారు. అయితే ఇప్పటివరకు దానికి విరాళాల ద్వారా రూ.5 కోట్లు మాత్రమే సమకూరాయి. కరోనా ప్రభావం వల్లే భారీగా విరాళాలు రాలేదని ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్‌దేవ్‌ గిరి వెల్లడించారు. భూమిపూజ తర్వాత ఈ అంశంపై దృష్టి సారిస్తామన్నారు. ఆలయ నిర్మాణానికి ఎంత అంచనా వేసిందీ ఆయన స్పష్టత ఇవ్వలేదు. వందల కోట్లు ఖర్చవుతాయని మాత్రమే చెప్పారు. కాగా ఈ ఏడాది నవంబరు 25 నుంచి డిసెంబరు 25 వరకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిధుల సేకరణ చేపట్టాలని ట్రస్టు నిర్ణయించింది. అలాగే కార్పొరేట్‌ సంస్థలు సామాజిక బాధ్యత కింద భూరి విరాళాలివ్వాలని కోరుతోంది. ప్రభుత్వపరంగా అటు కేంద్రం నుంచి గానీ, ఇటు రాష్ట్రం నుంచి గానీ ఆర్థిక సాయం ఉండకపోవచ్చని అంటున్నారు.

దేశవిదేశాల భక్తులు బంగారు, వెండి ఇటుకలు, కడ్డీలు, ఇతర ఆభరణాలను ఆలయ నిర్మాణం కోసం పంపుతున్నారు. వీటన్నిటికీ రక్షణ కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో కేంద్రం ఇక్కడ పారామిలిటరీ బలగాలను మోహరించింది. వీటిని ఎలా ఉపయోగించుకోవాలో ట్రస్టుకు అర్థం కాక.. బంగారం, వెండి పంపొద్దని.. విరాళంగా నిధులివ్వాలని భక్తులకు పిలుపిస్తోంది.ఆ సామగ్రి అంతా నిర్మాణానికే..

వాస్తవానికి ఆలయ నిర్మాణ పనులు అయోధ్యలోని కరసేవకపురంలో 30 ఏళ్ల కిందే మొదలయ్యాయి. తీర్చిదిద్దిన స్తంభాలు, సీలింగ్‌, శిలలు, ‘శ్రీరామ’ నామ ఇటుకలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. అప్పట్లో ప్రతి గ్రామంలో భక్తులు ఆలయ నిర్మాణానికి పెద్దసంఖ్యలో ఇటుకలు పంపించారు. ఇవన్నీ కరసేవక పురంలోనే ఉన్నాయి. ఆలయ సముదాయం అభివృద్ధికి వీటిని ఉపయోగించనున్నారు.


30 కి.మీ. దూరంలో మసీదు

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బాబ్రీ మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు కేటాయించింది. ఈ విషయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 7న ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటించారు. అయోధ్య ప్రాంతంలోనే పూర్వపు కట్టడానికి ఇది 30 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రమైన ఫైజాబాద్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.


ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆలయం..

ప్రతిపాదిత రామాలయం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ ఆలయంగా వాసికెక్కనుంది. కాంబోడియాలోని ఆంగ్‌కోర్‌ వాట్‌ ఆలయ సముదాయం 401 ఎకరాల్లో వ్యాపించి ఉండగా.. తమిళనాడులోని శ్రీరంగనాథ ఆలయం (తిరుచిరాపల్లి) 155 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇప్పుడు అయోధ్య రామాలయం 120 ఎకరాలకు వ్యాపించి ఉండబోతోంది. (అంగ్‌కోర్‌ వాట్‌ తొలుత విష్ణు దేవాలయం. కాలక్రమంలో దానిని కాంబోడియా పాలకులు బౌద్ధాలయంగా మార్చేశారు.)


రాముడు మా పూర్వీకుడు..

భూమిపూజ మహోత్సవంలో పాల్గొనేందుకు అయోధ్యలోని ముస్లింలు కూడా తహతహలాడుతున్నారు. కరసేవకపురంలో పనులను సాధువులతో కలిసి కొందరు ముస్లిం నేతలు కూడా పర్యవేక్షిస్తుండడం విశేషం. ‘మేం ఇస్లాంలోకి మారాం. నమాజ్‌ పద్ధతి పాటిస్తున్నాం. కానీ దానివల్ల మా పూర్వీకులు మారిపోరు కదా! శ్రీరామచంద్రుడు మా పూర్వీకుడని మేం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం’ అని ఫైజాబాద్‌కు చెందిన జంషెడ్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. శ్రీరామచంద్రుడిని భారతీయ ముస్లింలు ‘ఇమామ్‌-ఎ-హింద్‌’గా పరిగణిస్తున్నారని హాజీ సయీద్‌ తెలిపారు. గర్భగుడి నిర్మించే ప్రదేశంలో అడుగుపెట్టాలని తాను ఆసక్తితో ఉన్నట్లు రషీద్‌ అన్సారీ చెప్పారు. ఒకవేళ అవకాశం దక్కకపోతే.. ఆలయ నిర్మాణ పనుల శ్రీకారాన్ని వేడుకగా జరుపుకొంటామన్నారు.


Advertisement
Advertisement
Advertisement