Abn logo
Sep 25 2020 @ 00:13AM

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి దందా

Kaakateeya

డబ్బులు ఇవ్వనిదే ముందుకు సాగని పనులు

ఎల్‌ఆర్‌ఎస్‌ను అడ్డం పెట్టుకొని భారీ బాదుడు

మార్కెట్‌ వాల్యుయేషన్‌ సర్టిఫికెట్ల జారీకి అడ్డగోలు వసూళ్లు

రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్న సిబ్బంది


మంచిర్యాల, సెప్టెంబరు 24: జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యా లయంలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతీ పనికి డబ్బులు గుంజడం సిబ్బందికి అలవాటైపోయింది. పైసలియ్యకపోతే గంటలో కావాల్సిన పనికి రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని రూపుమాపేందుకు  ముఖ్యంగా భూముల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. రెవెన్యూ శాఖలో అవినీతి హెచ్చుమీరిందని భావించిన కేసీఆర్‌ ప్రభుత్వం ఏకంగా  వీఆర్వో వ్యవస్థనే రద్దుచేశారు. తహసీల్దార్లకు ఉన్న సర్వాధికారాల్లో కొన్నింటికి కత్తెర వేస్తూ ఆర్డీఓలకు అప్పగించింది. అలాగే సబ్‌ రిజిస్ట్రార్‌ల అధికా రాల్లో కొన్ని తహసీల్దార్‌లకు తర్జుమా చేసింది. అయినా కొన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి అంతం కాకపోగా, లంచాల కోసం ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు.


పేరుకే సిటిజన్‌ చార్టర్‌

మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం గోడలకు సిటిజన్‌ చార్టు బో ర్డులు అతికించారు. అందులో పేర్కొన్న విధంగా సమయపాలన పాటిం చకపోవడంతో అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. సిటిజన్‌ చార్టర్‌ లో ఒక్కో పనికి ఎంత సమయం పడుతుందనేది స్పష్టంగా పేర్కొన్నారు. భూముల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేసేందుకు గరిష్టంగా 24 గంటల సమయం పడుతుండగా, కంప్యూటరైజ్డ్‌ ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) జారీకి గంట, అలాగే ఈసీ నకలు మ్యానువల్‌గా ఇచ్చేందుకు 24 గంట లు, పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కు గంట, పెండింగ్‌ డాక్యుమెంట్లు ఇచ్చేందుకు ఒక రోజు, పెండింగ్‌ డాక్యుమెంట్లు సెక్షన్‌ 47-ఏ కింద జారీ చేసేందుకు 7 రోజులు, భూముల మార్కెట్‌ వాల్యువేషన్‌ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు గంట సమయం కేటాయిస్తూ సిటిజన్‌ చార్టులో పేర్కొన్నారు. అయితే ఇవ్వన్ని నామమాత్రమే. అదనంగా ముడుపులు చెల్లిస్తేనే పనులు జరుతాయి. లేకుంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే.  


ప్రతి పనికీ ఓ రేటు...

మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రతి పనికీ ఓ రేటును ఫిక్స్‌ చేసుకొని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. భూములు, ఇతర ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు మార్కెట్‌ వాల్యుపైన సేల్‌ డీడ్‌ అయితే స్టాంపు డ్యూటీ 4 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ సుంకం 1.5 శాతం, రిజిస్ట్రేషన్‌ చార్జీలు 0.5 చొప్పున మొత్తం 6 శాతం చార్జీలు చెల్లించాలి. అదే గిఫ్ట్‌ డీడ్‌ అయితే స్టాంపు డ్యూటీ 1 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 0.5 శాతం, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 చొప్పున కనీసం రూ. 1000, గరిష్టంగా రూ. 10 వేలు చెల్లించాలి. పై చార్జీలు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉండగా ఒక్కో డాక్యుమెంట్‌పై రూ.1000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు తెలి సింది. నిబంధనల మేరకు లొసుగులు ఉన్న పక్షంలో కనీసం రూ. 3 వేల నుంచి గరిష్టంగా రూ. 15 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.


అలాగే ఈసీ జారీ చేసేందుకు 1983 నుంచి ఇప్పటి వరకు చార్జీలు రూ. 220, అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి ఈసీ జారీ చేసేం దుకు రూ. 520 చార్జీలు చెల్లించాలి. అయితే అక్కడ అదనంగా మరో రూ. 200 అక్రమంగా వసూలు చేస్తున్నారు. అలాగే ధ్రువీకరించిన నకలు కాపీలు జారీ చేసేందుకు ప్రభుత్వపరంగా చార్జీలు 1983 నుంచి ఇప్పటి వరకు రూ. 220, అంతకు ముందుది కావాలంటే రూ. 520 చెల్లించాలి. అయితే ఇక్కడ అదనంగా రూ.300 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోం ది. స్థిరాస్థి విలువ నిర్ధారణ పత్రం (మార్కెట్‌ వాల్యు సర్టిఫికేట్‌) జారీకి అధికారికంగా రూ.10 చెల్లించాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం రూ. 200  వసూలు చేస్తున్నారు. పెళ్లి రిజిస్ట్రేషన్లకు రూ. 250 చార్జీలు ఉండగా, రూ. 500 వసూలు చేస్తున్నారు. అందులో లొసుగులు ఉంటే రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 


కాసులు కురిపిస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌...

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ (ఎల్‌ఆర్‌  ఎస్‌) సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. భూము లను క్రమబద్ధీకరించుకొనేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు అక్టోబర్‌ 15గా ప్రభు త్వం ప్రకటించింది. మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో వేలాది మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇందుకు సబ్‌ రిజిస్ట్రార్లు జారీ చేసే స్థిరాస్థి విలువ నిర్ధారణ పత్రం తప్పనిసరి. గడువు దగ్గర పడుతున్నందున సహజంగానే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ప్రజ ల తాకిడి పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరో పణలున్నాయి. కేవలం ఒక గంట వ్యవధిలో జారీ చేయాల్సిన మార్కెట్‌ వాల్యు సర్టిఫికేట్‌ను డబ్బులు ఇవ్వడం లేదనే నెపంతో రోజుల తరబడి తిప్పుతున్నట్లు తెలిసింది. దీంతో చేసేదేమీ లేక సిబ్బంది అడిగినంత చెల్లించి, సర్టిఫికెట్లు తీసుకెళ్తున్నట్లు సమాచారం.


ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం...మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ రవికాంత్‌

కార్యాలయంలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న విషయం ఇప్పటి దాకా నా దృష్టికి రాలేదు.  విషయం నా దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటా. సిబ్బంది ఎవరూ వినియోగదారుల వద్ద డబ్బులు వసూలు చేయరాదు. మార్కెట్‌ వ్యాల్యు సర్టిఫికెట్‌ కోసం ఆన్‌లైన్‌ చార్జీలు చెల్లించిన వారికి వెంటనే అందజేయాలి. వినియోగదారులు సైతం దళారులను ఆశ్రయించకుండా నేరుగా కార్యాలయానికి వచ్చి పనులు చేసుకోవాలి.  

Advertisement
Advertisement
Advertisement