Abn logo
Apr 2 2020 @ 06:24AM

గదిలో పెట్టి... తాళం వేసి

శుభ్రం చేసుకోవాల్సిందీ బాధితులే

ఐసోలేషన్, క్వారంటైన్ వార్డుల్లో ఇదీ పరిస్థితి

బీపీ, డయాబెటిస్ టాబ్లెట్లు కూడా ఇవ్వని వైనం


రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ను నియంత్రించడానికి జిల్లాలోని పలువురు అనుమానితులను ఐసోలేషన్‌, క్వారంటైన్‌ వార్డులలో ఉంచుతున్న సంగతి తెలిసిందే. కాగా వీరుంటున్న వార్డుల్లోకి పారిశుధ్య సిబ్బంది కూడా వెళ్లడంలేదు. ఇంతకు ముందు ఇద్దరు పారిశుధ్య కార్మికులు వార్డులను క్లీన్‌ చేసేవారు. అనుమానితులు వాడిన వస్తువులు, వాళ్లు తాకిన వాటిని, టిఫిన్‌, భోజనం చేసినప్పుడు ముట్టుకున్న వాటిని, ఎవరైనా మందులు వాడితే వాటి వేస్టేజీని దూరంగా తీసుకుని వెళ్లి భూమిలో కప్పేట్టేవారు.


ఇటీవల ఢిల్లీ సభకు వెళ్లి వచ్చిన ఒక మతానికి చెందిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్‌ వస్తున్న నేపథ్యంలో పారిశుధ్య కార్మికులు కూడా చేతులెత్తేశారు. బొమ్మూరు టిట్కో సముదాయంలోని హోం క్వారంటైన్‌లో ప్రస్తుతం 66 మంది ఉన్నారు. వీరిలో ఢిల్లీ మతపర సమావేశానికి వెళ్లి వచ్చిన వారే ఎక్కువ మంది వున్నారు. వారందరినీ వార్డుల్లో పెట్టి తాళాలు వేశారు. చీపురు, బకెట్‌, సబ్బు, శానిటేషన్‌కు సంబంధించిన వస్తువులు ఇచ్చారు. వార్డుతో పాటు బాత్రూమ్‌ను కూడా వారే శుభ్రం చేసుకోవాలని అధికారులు ఆదేశించారు.


దీంతో ఎవరి గదిని వాళ్లే క్లీన్‌ చేసుకుంటున్నారు. ఇక్కడ వైద్యం ఏమీ చేయరు. ప్రస్తుతానికి వీరంతా అనుమానితులే. వైద్యులు కిటికీల వద్ద నుంచి వారిని పరిశీలించి, మార్పులేమైనా వస్తున్నాయేమోనని గమనిస్తారు. కొంతమూరుకు చెందిన ఒక మతానికి చెందిన వ్యక్తికి బీపీ, డయాబెటిస్‌ వున్నాయి. కనీసం వాటికి సంబంధించిన మందులు కూడా ఇవ్వడం లేదని ఆయనకు సంబంధించిన వ్యక్తి ఒకరు చెప్పారు. అలాగే సరిహద్దులు దాటి వచ్చిన విద్యార్థులు ఎవరినీ క్వారంటైన్‌కు తీసుకుని రాకూడదని నిర్ణయించినట్టు సమాచారం.


ఎవరైనా ఉంటే హాస్టళ్లకు లేదా ఇళ్లకు పంపించి పరిశీలించాలనే భావనకు వచ్చారు. ఇటీవల విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు బొమ్మూరు క్వారంటైన్‌లో ఉన్నారు. చాలా రోజులుగా సుమారు 40 మంది ఉన్నారు. వీరందరికీ నెగిటివ్‌ రావడంతో వారిని ఇళ్లకు పంపించి వేశారు. ప్రస్తుతం బొమ్మూరు క్వారంటైన్‌లో 66, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో 49 మంది ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement