Abn logo
May 6 2020 @ 00:24AM

కరోనా, నియో లిబరలిజం

రాజ్యం ప్రజలను నియంత్రించడం తప్ప, వేరే కార్యక్రమాలు మార్కెట్‌కు అప్పజెప్పాలనే బలమైన భావజాల ప్రవేశంతో భారతదేశమూ సంక్షేమ భావన పక్కన పెట్టి కార్పొరేట్ ఊడిగంలో పడింది. ఈ పరిణామం వల్ల వైద్యం కార్పొరేటీకరణ చెంది ప్రభుత్వ ఆస్పత్రులు మరణ శయ్యమీద ఉన్న దశలో కరోనా మన మీద దాడి చేసింది. ఏయే దేశాల్లో వైద్యం ప్రజారంగంలో ఉందో ఆ దేశాలు కరోనా విపత్తును కొంత వరకు అధిగమించగలిగాయి. అనుభవంలో నుండి పాఠాలు నేర్చుకొనడం మానేసిన పాలకులు ఇప్పుడైనా కళ్లు తెరుస్తారా? నయా ఉదారవాద అభివృద్ధి నమూనాని పునఃపరిశీలించడానికి సిద్ధంగా ఉన్నారా అన్నది కొవిడ్ విలయం సందర్భంగా చరిత్ర విసురుతోన్న సవాలు.


మానవ చరిత్రలో వందరోజులకు పైగా మొత్తం మానవాళి ఒక భయానక వాతావరణంలో బతకడం బహుశా ఇదే మొదటిసారి. రోగమే భయానకమైంది. అది కలిగించిన భయం భరించరానంత భయంకరంగా ఉన్నది. నిజానికి ప్రపంచం చాలా చిన్నదైపోయిన తరుణంలో మనుషులందరూ ఒకరికొకరు దూరమై భయపడుతున్నారు. భౌతిక దూరం పాటించవలసిన సందర్భంలో సామాజిక దూరం అంటు న్నారు. దగ్గరగా పరిశీలిస్తే నియో లిబరలిజానికి కరోనాకి ఒక అవినాభావ సంబంధమున్నట్లు అనిపిస్తుంది. నియో లిబరలిజం పుణ్యమా అని పెట్టుబడి ప్రపంచం మారుమూలలకీ చొచ్చుకుపోయింది. కరోనా వైరస్ కూడా ఏ ప్రాంతాన్నీ వదలకుండా అంతటా వ్యాపించింది. నియో లిబరలిజం అభివృద్ధిని ఏకవ్యక్తి కేంద్రంగా భావిస్తుంది. ఇది పెట్టుబడిదారీ విధాన పోకడే. పెట్టుబడిదారీ విధానంలో వ్యక్తి స్వప్రయోజనముంటుందని భావిస్తూ, ఆ వ్యక్తి ఇతరుల అవసరాలను నైతికంగా గుర్తిస్తాడని అర్థశాస్త్ర సిద్ధాంతకర్త ఆడమ్ స్మిత్ గుర్తించాడు.


నియో లిబరలిజం ఒక అడుగు ముందుకేసి వ్యక్తి స్వార్థపరుడుగా జీవించాలని, స్వార్థం ఉత్పత్తి శక్తుల చలనానికి చోదకశక్తి అని భావించి అన్ని మానవ సంబంధాలని, మనుషులు అభివృద్ధి చేసుకున్న అన్ని నాగరిక వ్యవస్థలని విధ్వంసం చేయడమే కాక వ్యక్తిని కూడా విచ్ఛిన్నం చేస్తున్నది. సరిగ్గా కరోనాకి కూడా ఈ లక్షణాలే ఉన్నాయి. మనుషులు ఎవరిని ఎవరూ కలవకూడదు, తాక కూడదు, దూరం పాటించాలి. ఎన్నడూలేని ఒక విచిత్రమైన విషవలయం నుండి మానవాళి ప్రయాణిస్తున్నది. భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది అన్న ఒక ప్రాథమికమైన సవాల్‌ను నియో లిబరలిజం, అలాగే కరోనా మన ముందుం చింది. సత్యానంతర కాలంలో భాష ఎంత దురుపయోగానికి గురౌతుందో నేడు గమనించవచ్చు. భౌతిక దూరాన్ని సామాజిక దూరం అనడం, సర్వత్రా ఆ పదాన్నే ఉపయోగించడమన్నది నియో లిబరలిజం భావజాల వ్యాప్తికి సరిగ్గా పనికి వస్తుంది. మనుషులు సామాజిక దూరమే పాటించవలసి వస్తే మనుషుల మధ్య యుగయుగాలుగా ఉండే సంబంధాల మాటేమిటి? మనుషులు ఒకరితో ఒకరు నిరంతరంగా ఆత్మీయంగా సంభాషించడమే కదా సామాజిక అనుభవం.


నియో లిబరలిజం మానవాళికి కొన్ని అసాధారణమైన సవాళ్లను విసి రింది. ముందుగా సామాజిక నిర్మాణంలో, నిర్వహణలో రాజ్యం పాత్ర ఏమిటి.. రాజ్యం బలప్రయోగం మీద ఆధారపడ్డ వ్యవస్థ. బలప్రయోగం నుండే పుట్టి ఉండవచ్చు. కరోనా కాలంలో కూడా ఈ పార్శ్వాన్ని గమనిస్తూనే ఉన్నాం. కాలక్రమేణా రాజ్యం సమష్టి జీవనానికి ఒక కేంద్ర బిందువుగా, చిహ్నంగా మారింది. వ్యక్తులు తాము వ్యక్తిగతంగా పరిష్కరించుకోలేని సమస్యలకు, అలాగే సమాజం తాను ఎదుర్కొంటున్న చిక్కు సమస్యలకు ఏదో మేరకు రాజ్యంమీద ఆధారపడక తప్పడం లేదు. ఈ అవసరం నుండే ప్రజాస్వామ్య భావన, రాజ్య అధికారానికి జనబలమే మూలమని, పాలకులకు సంక్రమించిన అధికారం దైవదత్తం కాదనే జన నాగరిక విలువ అభివృద్ధి చెందింది. అందుకే, భారత రాజ్యాంగ రూపకల్పన వెనక ‘భారత ప్రజలమైన మేము’ అనే అత్యున్నత ప్రజాస్వామ్య విలువ అంగీకరింపబడింది.


రాజ్యం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, బల ప్రయోగాన్ని చట్ట పరిమితులలోనే ఉపయోగించాలని, రాజ్య యంత్రాంగం ఆ పరిమితులను అతిక్రమిస్తే వాళ్లు కూడా శిక్షార్హులేననే ప్రమాణం వచ్చింది. వీటిలో భాగంగానే రాజ్యం ప్రజల సంక్షేమానికి బాధ్యత వహించాలి అనే బాధ్యత వచ్చింది. మూడవ ప్రపంచ స్వాతం త్ర్య పోరాటాలలో స్వతంత్ర దేశం, సంక్షేమ రాజ్యం ఒక దానిలో ఒకటి మిళితమై స్వతంత్ర పోరాట నినాదాలుగా మారాయి. భారత రాజ్యాంగమే దీనికి బలమైన నిదర్శనం. నియో లిబరలిజం రాజ్యాంగ స్ఫూర్తికే పెద్ద దెబ్బకొట్టింది. రాజ్యం ప్రజలను నియంత్రించడం తప్ప వేరే కార్యక్రమాలు మార్కెట్‌కు అప్పజెప్పాలనే బలమైన భావజాల ప్రవేశంతో భారతదేశం లాంటి దేశం కూడా క్రమేణా సంక్షేమ భావన పక్కన పెట్టి కార్పొరేట్ ఊడిగంలో పడింది. ఈ పరిణామంవల్ల అత్యంత విలువైన ఆరోగ్యం కార్పొరేటీకరణ చెంది ప్రభుత్వ ఆస్పత్రులు మరణ శయ్య మీద ఉన్న దశలో కరోనా మన మీద దాడి చేసింది. నిన్నటి దాకా అన్ని బాధ్యతలను వదులుకుంటున్న రాజ్యం తికమక పడిపోతున్నది.


కరోనా బాధితులను ఎక్కడికి తీ సుకుపోవాలి, సరిపడా ఆస్పత్రులు లేవు, బెడ్లు లేవు, పరీక్షా పరికరాలు లేవు, వెంటిలేటర్లు లేవు, ఒకటి కాదు అన్నిటి కొరకు వెతకడమే. ఇవన్నీ రాత్రికి రాత్రి సమకూరేవి కాదు. మన దేశంలోనే కాదు, నియో లిబరలిజాన్ని పరాకాష్ఠకు తీసుకుపోయిన అమెరికా దుస్థితిని చూస్తే జాలేస్తుంది. లక్షలమంది కరోనా పాలయ్యారు. వేల సంఖ్యలో మనుషులు అసహజంగా మరణిస్తున్నారు. ఏం చేయాలో అయోమయంలో పడిన కార్పొరేట్ ప్రతినిధి ట్రంప్ ఏదో ఒక మిష కొరకు వెతుకుతూ చైనాని నిందిస్తున్నారు. నిజమే, ఈ వైరస్ చైనా నుంచే వచ్చిందనుకుందాం. కానీ, అమెరికాలో ప్రభుత్వ ఆస్పత్రులు లేకపోవడానికి, ఈ విపత్తుకి కనీస మాత్ర సంసిద్ధత లేకపోవడానికి ఎవరు కారణం? ఒబామా తన పదేళ్ల కాలంలో వైద్య విధానాన్ని సంస్కరించడానికి ఎంత ప్రయాస పడ్డా దానికి అడ్డు తగిలిందెవరు? మరి కార్పొరేట్ వైద్య విధానంతో ఎందుకు ఈ విపత్తును తట్టుకోలేకపోతున్నారన్న మౌలిక ప్రశ్నకు సమాధానమేమిటో? ఏయే దేశాల్లో వైద్యం ప్రజారంగంలో ఉందో ఆ దేశాలు ఈ విపత్తును కొంత అధిగమించగలిగాయి. అనుభవంలో నుండి పాఠాలు నేర్చుకొనడం మానేసిన పాలకులు ఇప్పుడైనా కళ్లు తెరుస్తారా? అభివృద్ధి నమూనాని పునఃపరిశీలించడానికి సిద్ధంగా ఉన్నారా అన్నది చరిత్ర విసురుతోన్న సవాలు.


భారత దేశం సంక్షేమ భావాన్ని క్రమంగా వదులుకోవడంతో ఒక నాడు ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ ఆస్పత్రులు తీవ్రంగా దెబ్బతిన్నవి. సంక్షేమ భావన కుంచించుకు పోవడంతో ప్రధానమంత్రి దేశ ప్రజలనుద్దేశించి మూడుసార్లు ప్రసంగించినా ప్రజలు ఏం చేయాలన్నది చెప్పారే తప్ప ప్రభుత్వం నుండి ఏ సహాయసహకారాలు ఉంటాయో చెప్పలేదు. వైద్యాన్ని జాతీయం చేశాం అనే లాంటి ఆలోచనలు మచ్చుకైనా తట్టడం లేదు. స్పెయిన్‌లో జాతీయం చేశారు. నియో లిబరలిజం మన పాలకుల నరనరాల్లోకి పాకింది. వలస కార్మికులు ఎంత దయనీయమైన స్థితికి గురయ్యారో మీడియాలో చూశాం. పిల్లల్ని ఎత్తుకొని, మూటలు నెత్తినపెట్టుకొని కాలే కడుపుతో, ఎండుటెండలో వందల కిలోమీటర్లు నడుస్తూపోవడం చూసి హృదయమున్న వాళ్లందరికీ హృద యం చలించింది. వలసకూలీల రైలు ఖర్చులు ఎవరు భరించాలనే వివాదం ఎంత అమానవీయం!.


సంపన్నుల బ్యాంకుబకాయిలు రూ.68వేల కోట్లు రద్దుచేసిన పాలకులు కూలీల రైలు చార్జీల గురించి ఆలోచిస్తున్నారు! పారిశ్రామిక వేత్తలు తమ సంపదను సృష్టించిన కార్మికుల పట్ల కష్టకాలంలోనైనా కనికరం చూపించలేరా. తమ సంపదల్లో, లాభాల్లో కొద్ది వాటా వాళ్ల మీద ఖర్చు పెడితే వాళ్ల ‘మానవత్వానికి’ దెబ్బ తగులుతుందా? నియో లిబరలిజం పెరుగుతున్న కొద్దీ కార్మిక చట్టాలన్నీ మారుస్తూ, వేతనాల విషయంలో, జీవన ప్రమాణాల విషయంలో అన్ని పార్శ్వాల్లో వాళ్లకు వ్యతిరేకమైన చట్టాలే చేశారు. కోట్లాది లాభాలు చేసుకునే వారు ఏ బాధ్యత తీసుకోకపోవడంతో మొత్తం బాధ్యత ప్రభుత్వాల మీద, సమాజ దాతృత్వం మీద పడింది. ప్రభుత్వాలు కార్మికులకు సంబంధించిన యంత్రాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాయి. దూరం పాటించాలి అని ఎంత ప్రచారం చేసినా అమలు చేయడానికి యంత్రాం గమే లేదు. ముంబైలోని దాద్రాలో వేలమంది రైళ్ల కొరకు ఎదురు చూస్తున్న సంఘటన చూశాం. తాము పని చేసే పరిశ్రమలతో, తాము నివసించే పట్టణాలతో సంబంధం లేదు. చివరికి తమ గ్రామమే తమకు రక్ష అని నమ్ముతున్నారంటే పరిశ్రమల నుండి, పట్టణాల నుండి కార్మిక లోకం ఎంత నిరాకరణకు గురయ్యిందో చూడవచ్చు.


ఇవ్వాళ రాజ్యం ఆలోచించవలసింది ఇలాంటి పరిస్థితి ఇప్పుడైనా భవిష్యత్తులోనైనా ఎదు రైతే కోట్లాది కూలీల, శ్రామికుల పట్ల రాజ్యం బాధ్యత ఏమిటి? వాళ్లు సంపద సృష్టికర్తలు అనే కనీస ఆలోచన రాజ్యం నెత్తికేమైనా ఎక్కుతుందా? వాళ్లు గ్రామాల నుండి తిరిగి రావడానికి నిరాకరిస్తే పరిస్థితి ఏమిటి? ఈ అనుభవం, మనని మరింత మానవీయంగా ఆలోచింపచేస్తుందా అనేది ప్రశ్న. కరోనా మన ముందుంచిన మరో సంక్లిష్టమైన సవాల్ మనిషికి ప్రకృతి కుండే సంబంధమేమిటనే తాత్విక ప్రశ్న. మనిషి ప్రకృతితో సహజీవనం, అలాగే సంఘర్షణలో ఉన్నాడు. ప్రకృతి సూత్రాలను ఉపయోగిస్తూ తన జీవన విధానాన్ని సుఖమయం చేసుకునే శక్తిని సాధించుకున్నాడు. ప్రకృతిశక్తులని ఉపయోగించుకొనడమనేది మనిషికుండే విశిష్టతే. కాని ప్రకృతిమీద యుద్ధమే ప్రకటించి, దానిని ధ్వంసంచేస్తూ పోవడంతో ప్రకృతి తిరగబడుతున్నది. ప్రకృతిని పూజించే దశ నుండి శాసించే దశకు చేరుకోవడం నాగరికత అభివృద్ధే అనుకున్నాం. కాని ఇవ్వాళ ప్రకృతి గడగడలాడిస్తున్నది. ఒక చిన్న ప్రాణం లేని కణం మనని ముప్పుతిప్పలు పెడుతున్నది. వేలాదిమంది మరణిస్తుంటే అసహాయంగా దీనంగా ఒక అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా మనిషికి ప్రకృతికుండే విడదీయరాని సంబంధపు చారిత్రక, నైతిక, తాత్విక మూలాలలోకి వెళ్లే ప్రయత్నం జరగాలి. నియో లిబరలిజాన్ని పక్కకు నెట్టి ప్రకృతితో మన సంబంధాన్ని పునఃనిర్వచించుకోవాలి.


సంక్షోభంనుండి లేదా భయంనుండి బయటపడే సమూహం నుండి ప్రశ్నలు పుడతాయి. ఆదిమ కాలంలో గ్రీకు, రోమన్ తత్వ శాస్త్రాల్లో, మన ఉపనిషత్తులలో ప్రకృతి అర్థం కాని దశలో– ఆ అమాయకమైన మనుషులు, మనిషి జీవిత లక్ష్యమేమిటీ జీవితానికి అర్థమేమిటీ, మనుషులు ఎందుకు, లేదా ఎలా జీవిస్తున్నారు... లాంటి ప్రశ్నలు అడిగారు. ఇవ్వాళ చాలా జ్ఞానాన్ని కూడబెట్టుకున్న మనిషి అవే ప్రశ్నలను అడగాలి. ఎందుకంటే అవి సమాధానాలు దొరకని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. మనిషి భౌతిక అభివృద్ధి విస్మయం చెందేలా సాధించాడు. కాని ఆ భౌతిక అభివృద్ధే మనిషిలోని అన్వేషణ గుణాన్ని ప్రశ్నించే తత్వాన్ని దెబ్బతీసింది. కరోనా విపత్తు కాలంలో మనుషులు ఒంటరిగా గృహనిర్బంధంలో ఉన్నారు. నిర్బంధం నుండి కూడా మానవ సృజనాత్మకత విలసిల్లింది. భౌతిక అభివృద్ధి చట్రం, అలాగే మత మూఢ అమానవీయ విశ్వాసాలను దాటి నాగరికత పరిణామక్రమంలో ప్రసవించిన ప్రేమ, స్నేహం, సమా నత్వం, సహజీవనం, సహకారం, లౌకిక భావన, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వం లాంటి ఉదాత్త మానవ విలువలు వికసిల్లేలా ఆలోచిద్దాం. భయం నుండి బయటపడి సమూహంగా మానవ నాగరికత సహ జీవనం వైపు గంతులు వేయాలని స్వప్నిద్దాం.

ప్రొ. జి. హరగోపాల్

Advertisement
Advertisement
Advertisement