Abn logo
Jul 11 2020 @ 06:14AM

జనగణనకు బ్రేక్‌!

2021 జనాభా లెక్కలకు కరోనా కష్టాలు

ప్రారంభంకాని ప్రక్రియ

జనవరిలోగా సేకరణ కష్టమే..


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల అమలు, నిధుల కేటాయింపు ఇలా అన్నింటికీ జనాభా లెక్కలు కీలకం. ఎటువంటి గణనకు అయినా ఇవే గీటురాయి. అందుకే ప్రభుత్వం ప్రతీ పదేళ్లకు ఒకసారి జనగణన చేపడుతుంది. 2011లో జనగణన చేపట్టగా..ఇప్పుడు 2021లో చేపట్టాల్సి ఉంది. ఇందుకు ఏడాది ముందుగానే ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. కానీ కరోనా వైరస్‌తో ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో 2021 జనాభా లెక్కలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తొలుత మార్చిలోనే ప్రక్రియ ప్రారంభించడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. పురుషులు, స్త్రీలు ఇలా వేర్వేరుగా  డేటా షీట్లు సైతం సిద్ధం చేశారు. కానీ వైరస్‌ ప్రభావంతో వాటన్నింటినీ పక్కన పడేశారు. ప్రస్తుతం కేసులు ఉధృతమవుతున్న వేళ జనగణన ఎప్పుడు ప్రారంభిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. 


గతంలో గణనలు ఇలా..

2011 జనాభా లెక్కల ప్రకారం 23,44,474 మంది జనాభా ఉన్నారు. అయితే ఇందులో మహిళలే ఎక్కువ కావడం గమనార్హం. 11,61,477 మంది పురుషలుంటే, మహిళలు 11,82,997 మంది ఉన్నారు. 21,520 మంది మహిళలు అధికంగా ఉన్నారు. జిల్లా ఓటర్లలో మహిళలదే అధిక్యం.  2001 జనాబా లెక్కలతో పోల్చితే వృద్ధి రేటు తగ్గింది. 2001లో 6.55 శాతం జానాభా వృద్ధి రేటు ఉంది. 2011లో జిల్లాలో జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది.


4.23కు పడిపోయింది. ఈ సారి కూడా ఇదే స్థాయిలో జనాభా వృద్ధి రేటు ఉండే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. కాస్త తగ్గినా ఇదే వృద్ధి రేటు కొనసాగే పరిస్థితి ఉంది. 2001లో జనాభా 22,49,254 మంది ఉన్నారు. అప్పుడు కూడా మహిళా జనాభా ఎక్కువగా ఉండటం గమనార్హం. 2011లో మహిళల సంఖ్య మరింత పెరిగింది. 2021లో కూడా ఇదే తరహాలో ఉంటుందని యంత్రాంగం భావిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం అక్షరాస్యత శాతం 58.89 శాతం ఉంది. 2001లో 51.07 శాతం మాత్రమే ఉంది. అంటే 7.82 శాతం మాత్రమే పెరిగింది. ఈసారి మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.  

Advertisement
Advertisement
Advertisement