Abn logo
May 29 2020 @ 05:25AM

కరోనా జోరు

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కేసులు

వంగూరు మండలంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి మృతి 

సడలింపులతో కరువైన అప్రమత్తత

శుభకార్యాలు, దావత్‌లతో పొంచిన ఉన్న ప్రమాదం

వలస కూలీల లింకులతో హడలిపోతున్న జనం

కనీసం వారికైనా కరోనా పరీక్షలు నిర్వహించాలనే సూచనలు


మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి :

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా మళ్లీ తిరగబడుతోంది. నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో తాజాగా కేసులు నమోదవడంతో పాటు మరణాలు సంభవించడంతో స్థానికంగా ఆందోళన కలుగుతోంది. ఉమ్మడి జిల్లాను ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌, కులకచర్ల, బొంరాస్‌పేట మండలాలతో పాటు కర్ణాటకలోని రాయచూరు, యాద్గిర్‌ జిల్లాల్లో కూడా కేసులు పెరగడం కలకలం రేపుతోంది. కేసులు పెరగడానికి ప్రధానంగా నియంత్రణ చర్యల్లో లోపాలున్నాయని తెలుస్తోంది. కేసులు బయటపడ్డ దగ్గర ప్రైమరీ కాంటాక్ట్‌లను సైతం హోం క్వారంటైన్‌కే రిఫర్‌ చేస్తున్నారని, వారికైనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని డిమాండ్‌ వస్తోంది. 


లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో విచ్చలవిడి రాకపోకలు, బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లడం, దావత్‌లు చేసుకోవడం, మందు పార్టీలు నిర్వహించడం వంటి వాటితో కరోనా వైరస్‌ కేసులు ఉమ్మడి జిల్లాలో మళ్లీ పెరుగుతున్నాయి. దాంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


నాగర్‌కర్నూల్‌ జిల్లా చారగొండ మండలం రాంచంద్రాపూర్‌లో కరోనా సోకిన వ్యక్తి ఇటీవల ఒక శుభకార్యం నిర్వహించి, వింధు ఇచ్చారు. ఈ వింధులో 50 మంది పాల్గొన్నారు. దీంతో పాటు ఈయన నల్లగొండ జిల్లాలోని డిండి మండలం రామంతాపూర్‌లో ఒక పెళ్లి వేడుకలో పాల్గొనడంతో పాటు, చారగొండలో ఒక దుకాణంలో షాపింగ్‌ చేశారని గుర్తించారు. అరందరినీ క్వారంటైన్‌ చేశారు. 


నల్లగొండ జిల్లాలో జరిగిన ఒక వివాహానికి మాడ్గుల మండలం గిరికొత్తపల్లి నుంచి 30 మంది వరకు వెళ్లగా, వారినీ క్వారంటైన్‌కు తరలించారు. మొత్తంగా ఈ ఘటనతో నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు, చారగొండ మండలాల్లోని రామంతాపూర్‌, కిష్టంపల్లి, తుర్కపల్లి, ఇదంపల్లి, మర్రిగూడ, నల్గొండ జిల్లా డిండి మండలం రాంచద్రాపూర్‌ గ్రామాలను కంటైన్మంట్‌ జోన్లుగా ప్రకటించారు. అక్కడి కాంటాక్ట్‌లందరినీ హోం క్వారంటైన్‌ చేశారు. 


నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో పాజిటివ్‌ కేసు నమోదైంది. బాధితుడు కిందపడడంతో పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అతను కోమాలోకి వెళ్లి, బుధవారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇతను గాయపడడానికి మూడు రోజుల ముందు ఒక వివాదంలో పంచాయతీ నిర్వహించగా కలిసి మెలిసి ఉన్నాడని, ఈ సందర్భంగానే కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. అప్పటి కాంటాక్ట్‌లందరినీ పరీక్షిస్తే ఇక్కడ ఎవరి ద్వారా సోకిందనే  విషయం బయటపడుతుందని తెలుస్తోంది. 


మక్తల్‌  మండలం జక్లేర్‌లో నాలుగు నెలల బాబుకి కరోనా సోకిన కేసులోనూ బారసాల కార్యక్రమం నిర్వహించిన తర్వాతే బాబుకి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బాబు తండ్రి వలసకూలీ కావడం, తిరిగివచ్చిన తర్వాత కార్యక్రమం నిర్వహించడంతో ఈ కేసు బయటపడింది. 


కృష్ణ మండలంలోని గుడేబల్లూరులో చనిపోయిన వృద్ధుడికి కరోనా సోకినట్లు నిర్ధారించినా, ఇక్కడ కారణాలు ఇంకా గుర్తించలేకపోతున్నారు. 

పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మండలంలో పాజిటివ్‌ల సంఖ్య ఏడుకు చేరడం వెనుక కూడా దావత్‌లే కారణంగా తెలుస్తోంది. ఇక్కడ ఒక వ్యక్తి సిగరెట్‌ను మరో ఇద్దరు షేర్‌ చేసుకోవడంతో వారికి కూడా కరోనా సోకినట్లు తాజాగా నిర్ధారించారు. 


కులకచర్ల, బొంరాస్‌పేట మండలాల్లోనూ వలస కూలీలు తిరిగి వచ్చిన తర్వాతే కేసులు బయటపడ్డాయి. వారంతా ముంబయి, పూణే నుంచి వచ్చినావారే కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వలస కూలీలు తిరిగొచ్చిన తర్వాత హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నా ఉండడం లేదని, దీంతో వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందని, ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలనే సూచనలు వస్తున్నాయి.


వలస కూలీలకైనా పరీక్షలు నిర్వహించాలి

తాజాగా కరోనా కేసులు పెరగడానికి వలస కూలీలే కారణమని, వారికైనా పరీక్షలు నిర్వహించాలనే సూచనలు వస్తున్నాయి. మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక నుంచి తిరిగొచ్చిన కూలీలకు పరీక్షలు చేయాలని అంటున్నారు. సరిహద్దులు దాటేటప్పుడు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్నప్పటికీ అది సరిపోదని, చాలామంది పాజిటివ్‌ వచ్చినవారికి ఎలాంటి లక్షణాలు లేని విషయాన్ని గుర్తించాలని చెబుతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి నారాయణపేట జిల్లాకు వచ్చిన వారు 5,142 మంది ఉన్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 4,435 మంది, జోగులాంబ గద్వాల జిల్లాలో 1,155 మంది, వనపర్తి జిల్లాలో 1,265 మంది, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 2,650 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఉన్నట్లు తెలుస్తోంది. వారందరికీ పరీక్షలు నిర్వహించాలని, లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలనే సూచనలు వస్తునాయి.

Advertisement
Advertisement