Abn logo
Mar 26 2020 @ 02:46AM

రాదారిపై రచ్చ!

అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపం... సుమారు 2 వేల మందికి శాపంగా మారింది. ఉగాది పండగ రోజున అటు ఇళ్లూ చేరక, ఇటు ఉన్న చోటా ఉండక... 8 గంటలకుపైగా నడిరోడ్డుపై పడిగాపులు కాయాల్సి వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా... దేశమంతా కరోనా కట్టడికోసం ‘లాక్‌డౌన్‌’ అమలవుతున్న సమయంలో, జాతీయ రహదారి ఒకేచోట వందలమందితో కిక్కిరిసిపోయింది. ఇది... కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం రామాపురం వద్ద బుధవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా నెలకొన్న పరిస్థితి! అసలేం జరిగిందంటే...


రెండు వేల మంది 8 గంటలు రోడ్డుపైనే

యంత్రాంగం మధ్య సమన్వయ లోపం

హైదరాబాద్‌ నుంచి పోటెత్తిన వాహనాలు

హాస్టళ్ల మూసివేతతో మొదలైన సమస్య

క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన టీ-పోలీసులు

ఆంధ్రా చెక్‌ పోస్టు వద్ద ఆపిన ఏపీ పోలీసులు

రాష్ట్రంలోకి అనుమతించేందుకు ససేమిరా

పరీక్షలు లేకుండా పంపడమెలా అనే ప్రశ్న

తీవ్ర అయోమయం, ఉన్నతస్థాయిలో చర్చలు

చివరికి క్వారంటైన్‌ సెంటర్లకు తరలింపు

వైద్య పరీక్షల ఆధారంగా స్వస్థలాలకు?


విజయవాడ/జగ్గయ్యపేట, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో కరోనా తీవ్రత, 21 రోజుల లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉన్నట్టుండి చాలా హాస్టళ్లను మూసివేశారు. ‘మీదారి మీరు  చూసుకోండి’ అని బయటికి పంపించేశారు. దీంతో... హాస్టళ్లలో ఉన్న వారంతా తమ ఇళ్లకు వెళ్లిపోవడానికి  అనుమతించాలని హైదరాబాద్‌ పోలీసులను కోరారు. ఠాణాల ముందు గంటలకొద్దీ క్యూలలో నిల్చుని క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు పొందారు. ‘అంతా ఓకే కదా’ అనుకుని సొంత కార్లు, ద్విచక్ర వాహనాలలో ఏపీలోని తమ స్వగ్రామాలకు బయలుదేరారు. నిజానికి... లాక్‌డౌన్‌కు ముందు నుంచే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ వాహనాలను అనుమతించడంలేదు. రెండు రాష్ట్రాల పోలీసులు అటూ ఇటూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కానీ, బుధవారం వాహనాలు ఒక్కొక్కటిగా తెలంగాణ చెక్‌పోస్టులు దాటి ఏపీలోకి ప్రవేశించాయి. ‘ఎందుకొచ్చారు? ఎలా వచ్చారు?’ అని ప్రశ్నించగా... తెలంగాణ పోలీసులు ఇచ్చిన క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు చూపించారు. దీంతో అక్కడున్న పోలీసులు అయోమయానికి గురయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా ఏపీలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కొందరు తెలంగాణలోని  మెడికల్‌ సెంటర్లలో పరీక్షలు చేయించుకుని, కరోనా లక్షణాలు లేవని అప్పటికప్పుడు ధ్రువీకరణ పత్రం పొందినప్పటికీ ససేమిరా అన్నారు.


ఉన్నతస్థాయిలో చర్చలు... 

చూస్తుండగానే 1500 నుంచి 2 వేల మంది కార్లు, బైక్‌లలో చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం, ఉత్కంఠ నెలకొన్నాయి. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఈ సమస్యను జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారిని అనుమతించడంపై ఏపీ అధికారులు తీవ్ర తర్జనభర్జనలు పడ్డారు. పోనీలే పాపం అని వదిలేద్దామంటే... వారిలో ఎవరికి కరోనా పాజిటివ్‌  ఉన్నా పెద్ద ‘రిస్క్‌’ చేసినట్లవుతుంది. చివరికి... ఇలాంటి సమయంలో రిస్క్‌ తీసుకోలేమని, పూర్తిస్థాయిలో స్ర్కీనింగ్‌ పరీక్షలు చేసిన తర్వాతగానీ ఏపీలోకి అనుమతించరాదని నిర్ణయించారు. హైదరాబాద్‌ నుంచి దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించిన వారిని వెనక్కి పంపించలేక, అలాగని నేరుగా ఇళ్లకూ పంపించలేక మార్గాంతరం అన్వేషించారు. చివరికి కృష్ణా, గుంటూరు జిల్లాలవారిని బస్సుల్లో నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి తరలించారు. తూర్పుగోదావరి జిల్లావారిని రాజమండ్రిలో క్వారంటైన్‌కు పంపించారు. పశ్చిమగోదావరి జిల్లావారిని తాడేపల్లిగూడం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్‌ కేంద్రాలకు పంపించారు.  అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి, ఫలితాల ఆధారంగా స్వస్థలాలకు పంపాలని నిర్ణయించారు. 


అసలేం జరిగింది?

హైదరాబాద్‌లోని అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో హాస్టళ్లు ఉన్నాయి. ఒంటరిగా ఉండే ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ కోర్సుల్లో చేరిన వారు ఎక్కువగా హాస్టళ్లలో ఉంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బుధవారం నుంచి హాస్టళ్లను మూసి వేస్తున్నామని, స్వస్థలాలకు వెళ్లిపోవాలని వాటి నిర్వాహకులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ అనుమతించడంతో.. పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసు స్టేషన్లలో ‘క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు’ ఇచ్చేశారు. ఇలా సర్టిఫికెట్లు తీసుకున్న వారు ఏపీ సరిహద్దుల్లోకి రావడంతో అసలు సమస్య మొదలైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఏపీ డీజీపీ గౌతంసవాంగ్‌ తెలంగాణ పోలీస్‌ బాస్‌ మహేందర్‌ రెడ్డితో మాట్లాడారు. ‘‘ఇలా ఒక్కసారిగా హైదరాబాద్‌ నుంచి పంపించేస్తే ఎలా? వారికి కరోనా లక్షణాలు లేవని ఎలా నిర్ధారించుకోవాలి?’’ అని క్షేత్రస్థాయి సమస్యను వివరించినట్లు తెలిసింది. ఇలా వందలాదిమందిని ఒకేసారి ప్రయాణానికి అనుమతించడం లాక్‌డౌన్‌ మార్గదర్శకాలకు కూడా విరుద్ధమని చెప్పినట్లు సమాచారం.


దీంతో... అక్కడి డీజీపీ వెంటనే స్పందించి హాస్టళ్ల మూసివేతకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అలాగే, క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు చెల్లవని కూడా ఒక ప్రకటన వెలువడింది. మరోవైపు... మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ  మంత్రి కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ వెంటనే... హాస్టళ్ల నిర్వాహకులకు తెలంగాణ సర్కారు స్పష్టమైన సూచనలు చేసింది. వాటిని కొనసాగించి తీరాలని స్పష్టం చేసింది. మరోవైపు...  హైదరాబాద్‌ నుంచి తగిన అనుమతులతో రాష్ట్రంలోకి వచ్చే వారికి అనుమతిస్తామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని ప్రకటించడం విశేషం. అనుమతి ఉంటే ఇక్కడకు వచ్చే వారిని రానిస్తామని, అయితే అలా రాష్ట్రంలోకి ప్రవేశించిన వారంతా నివాసాలకు చేరుకున్న తర్వాత వైద్యులకు సమాచారం అందజేయాలని ఆయన సూచించారు.

Advertisement
Advertisement
Advertisement