Abn logo
Jul 15 2020 @ 09:38AM

వేడుకలే.. వైరస్‌ వేదికలు

జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి పాజిటివ్‌

హాజరైన వారిలో ఆందోళనలు.. పరీక్షల కోసం పరుగులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా కలకలం సృష్టిస్తోంది. జాగ్రత్త అవసరం. భౌతిక దూరం పాటించండి.. అంటూ అధికారులు హెచ్చరిస్తున్నా పలువురు ఆలకించడంలేదు. అదే అధికార పార్టీ వారైతే ఏకంగా పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేసి మరీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించిన కార్యక్రమాలే కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ఇటీవల ఓ నేత జయంతి కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వారితో కలిసి పాల్గొన్న నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.


గుంటూరు నెహ్రూనగర్‌, ప్రత్తిపాడులో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. నెహ్రూనగర్‌ ప్రాంతంలోని ఒక లైనులోని ఆ వేడుకలో పాల్గొన్న 110 మందికి పరీక్షలు చేయించగా 25 మందికి కరోనా వచ్చింది. దీనితో అదే ప్రాంతంలోని మరో మూడులైన్లలో పరీక్షలు చేయించగా అంతకు మించి కేసులు వచ్చాయి. దీంతో ఆ నివేదికలను బయట పెట్టడంలేదని సమాచారం. ఈ సమాచారం తెలిసి ఆ ప్రాంతంలోని మిగిలిన వారు కూడా పరీక్షల కోసం ఆయా కేంద్రాలకు వెళ్లగా అక్కడ రద్దీ చూసి నేతలతో సిఫార్సులు చేయించుకుంటున్నారు.


ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రత్తిపాడులో ఇటీవల నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. పాజిటివ్‌ బాధితుడు తనకు తెలియకుండానే వేడుకల్లో పాల్గొనడం, కేక్‌లు కట్‌ చేసి తినిపించడం వంటివి చేశారు. అతడితో తిరిగిన వారు ఎవరికి వారు స్వచ్ఛందంగా  కరనా టెస్టులకు కోసం క్యూ కడుతున్నారు.  

Advertisement
Advertisement
Advertisement