Abn logo
Jul 11 2020 @ 11:34AM

కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే 355 కేసులు

మేడ్చల్‌ జిల్లాలో 182 కేసులు, ఇద్దరు మృతి

రంగారెడ్డిలో 169, వికారాబాద్‌లో ఒకరు 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 355 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 182 కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 169 నమోదు కాగా, వికారాబాద్‌లో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,455కి చేరింది.


ఆకుతోటపల్లిలో ఒకరికి కరోనా 

ఆమనగల్లు మండల పరిధిలోని ఆకుతోటపల్లిలో తొలి కరోనా కేసు నమోదైంది. గ్రామానికి చెందిన యువకుడు(32) మాడ్గుల మండలం ఇర్విన్‌ ఆసుపత్రిలో విధులు నిర్వహించేవాడు. ఇతను కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. బాధితుడి కుటుంబాన్ని హోంక్వారంటైన్‌లో ఉంచారు.


షాద్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో..

షాద్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో శుక్రవారం 17మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. మొత్తం 175మందికి యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా 17మందికి పాజిటివ్‌, 158మందికి నెగెటివ్‌ వచ్చినట్లు వివరించారు.


మంచాల మండలంలో ఇద్దరికి..

మంచాల మండలంలో మరో ఇద్దరు కరోనా బారినపడ్డారు. చీదేడ్‌ గ్రామానికి చెందిన తండ్రికొడుకులు ఇద్దరికీ శుక్రవారం నిర్వహించిన కొవిడ్‌-19 పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలింది. వీరిరువురూ ఇటీవల మంచాలలోని బంధువుల ఇంటిలో జరిగిన దశదినకర్మలో పాల్గొన్నట్లుగా తెలిసింది.


యాచారంలో నలుగురికి..

యాచారం మండల పరిధిలో యాచారం, గున్‌గల్‌ గ్రామాలకు చెందిన నలుగురు శుక్రవారం కరోనా బారిన పడినట్లు వైద్యులు చెప్పారు. యాచారం మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో జరిపిన కొవిడ్‌ పరీక్షల్లో వీరికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది.


కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో..

కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం కరోనా కలకలం రేగింది. కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతోపాటు తహసీల్దార్‌ కార్యాలయంలో ఒకరికి కరోనా సోకింది. శనివారం కార్యాలయ సిబ్బందికి కరోనా టెస్టులు చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.  


పరిగిలో మరొకరికి..

పరిగిలో మరొకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. పరిగి మండలం సయ్యద్‌మల్కాపూర్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడు పరిగిలోని ఓ మద్యం షాపులో పని చేస్తుంటాడు. పరిగిలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో సెకండరీ కాంటాక్టు కింద ఇటీవల రక్తనమూనా సేకరించి ల్యాబ్‌కు పంపించగా, శుక్రవారం యువకుడికి పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని డాక్డర్‌ తెలిపారు. 


పెద్దేముల్‌ మండలంలో..

పెద్దేముల్‌ మండలం మారెపల్లి గ్రామానికి చెందిన ఒక రాజకీయ నాయకుడికి రెండు రోజుల క్రితం కరోనా సోకగా.. శుక్రవారం పెద్దేముల్‌ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. ఇతను వికారాబాద్‌ ఎస్పీ కార్యాలయంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇతను అనారోగ్యం కారణంగా నాలుగురోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఆయనకు పాజిటివ్‌గా తేలడంతో హైదరాబాద్‌లోని ఆయుర్వేద ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. బాధితుడి ఇంట్లో ప్రైమరీ కాంటాక్ట్‌ కింద మొత్తం 26 మందిని గుర్తించారు. వీరందరినీ హోంక్వారంటైన్‌ ఉంచారు. వారిలో నలుగురు 5సంవత్సరాల లోపు పిల్లలు ఉండడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని అధికారులు తెలిపారు. 


వికారాబాద్‌ జిల్లాలో మరో కరోనా మరణం

వికారాబాద్‌ జిల్లాలో మరో కరోనా మరణం చోటు చేసుకుంది. వికారాబాద్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి (50) కరోనాతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కరోనా లక్షణాలతో ఈనెల 2వ తేదీన ఆసుపత్రిలో చేరగా, ఆరోగ్యం విషమించి మృతి చెందారు. 


ఘట్‌కేసర్‌లో నలుగురికి..

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నలుగురికి కరోనా సోకింది. స్థానిక మేధా కాలనీలో నివాసం ఉండే 40, 35 సంవత్సరాల భార్యాభర్తలకు పాజిటివ్‌ వచ్చింది. నగరంలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తూ స్థానిక పరమేశ్వరినగర్‌లో నివాసం ఉండే వ్యక్తికి (37) కరోనా సోకింది. ఘట్‌కేసర్‌ ప్రభుత్వాసుపత్రి సమీపంలో నివాసముండే యువకునికి (25) కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అదికారులు వారిని హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. 

Advertisement
Advertisement