Abn logo
Jul 11 2020 @ 05:08AM

వణికిస్తున్న కరోనా

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో 23 కేసులు

బాధితుల్లో ముగ్గురు వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు

ఒక పీజీ వైద్య విద్యార్థికీ వైరస్‌ నిర్ధారణ


(నాగర్‌కర్నూల్‌-ఆంధ్రజ్యోతి)/మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)/భూత్పూర్‌/జడ్చర్ల/నారాయణపేట క్రైం/గద్వాల క్రైం/రాజోలి/కొల్లాపూర్‌/జూలైౖ 10 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. శుక్రవారం మరో 23 మందికి వైరస్‌ సోకింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో తొమ్మిది, నారాయణపేట జిల్లాలో తొమ్మిది, నాగర్‌కర్నూల్‌లో మూడు, గద్వాలలో రెండు కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని ఎనుగొండ సంతోష్‌నగర్‌ కాలనీ, టీచర్స్‌ కాలనీ, మర్లు ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వారిలో ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు కాగా, మరొకరు సీసీగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. వారితో పాటు ఎస్వీఎస్‌ ఆసుపత్రిలోని ఓ వైద్య విద్యార్థికి వైరస్‌ సోకింది.


పట్టణంలోని రవీంద్రనగర్‌కు చెందిన ఓ వ్యక్తి, ఫైర్‌ స్టేషన్‌ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దేవరకద్ర మండలంలోని లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన 33 ఏళ్ల యువకుడికి వైరస్‌ సోకింది. ఆయన జిల్లాకేంద్రంలోని నలంద ఆటోస్టాండు ప్రాంతంలో నివసిస్తున్నాడు. జడ్చర్ల ఇందిరానగర్‌కాలనీలో చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ అని నిర్ధారించారు. భూత్పూర్‌ ఎస్‌బీఐలో పని చేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో శుక్రవారం బ్యాంకును మూసివేశారు. 


నారాయణపేట జిల్లా కేంద్రంలోని గణేష్‌ మందిర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా ఇటీవల కరోనా సోకింది. ఆయనతో సన్నిహితంగా ఉన్న 34 మందికి పరీక్షలు చేయగా, తొమ్మిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ జయచంద్రమోహన్‌ తెలిపారు. 


గద్వాల పట్టణానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ భీంనాయక్‌ తెలిపారు. రాజోలికి చెందిన చేనేత కార్మికురాలికి కరోనా సోకింది. 


నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందాడు. అంతకుముందే అతడి శాంపిల్స్‌ సేకరించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడి అంత్యక్రియలకు హాజరైన వారిని గుర్తించడంపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. కొల్లాపూర్‌ పాత బస్టాండ్‌ ఏరియాలో ఉండే దంపతులకు కరోనా సోకింది. వారు ఈ నెల ఏడున చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Advertisement
Advertisement