Abn logo
May 27 2020 @ 05:08AM

కోరలు చాస్తోన్న కరోనా

చాప కింద నీరులా విస్తరిస్తున్న వైరస్‌

జక్లేర్‌లో నాలుగు నెలల శిశువుకి పాజిటివ్‌

సరిహద్దులోని కర్ణాటక జిల్లాల్లో పెరుగుతున్న కేసులు

అక్కడి నుంచి యథేచ్ఛగా నారాయపేట, గద్వాలకు రాకపోకలు

ముంబై నుంచి వచ్చిన వలస కూలీల్లోనే ఎక్కువగా బాధితులు

భయాందోళనలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులు


మహబూబ్‌నగర్‌, మే 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కరోనా కేసుల నమోదు ఆగిపోయి అంతా సర్దుకుంటున్న తరుణంలో, మళ్లీ వైరస్‌ పంజా విరిసింది. గ్రీన్‌జోన్‌లో ఉన్న నారాయణపేట జిల్లాలో నాలుగు నెలల శిశువుకు కరోనా సోకింది. ఈ బాబుకు రెండు రోజుల కిందట జలుబు, దగ్గు రావడంతో తొలుత మక్తల్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసి, అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి, హైదరాబాద్‌లోని నిమ్స్‌కు రెఫర్‌ చేశారు. నిమ్స్‌లో పరీక్షల అనంతరం బాబుకు వైరస్‌ పాజిటివ్‌ వచ్చినట్లు మంగళవారం అక్కడి వెల్లడించారు.


దీంతో అప్రమత్తమైన నారాయణపేట జిల్లా వైద్యాధికారులు బాబు స్వగ్రామమైన జక్లేర్‌ గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. బాబుతో పాటు తల్లిదండ్రులు, సోదరి ఇప్పటికే హైదరాబాద్‌లో ఉండటంతో వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. మే 14న బాబుకు బారసాల నిర్వహించారని తెలియడంతో ఆ కార్యక్రమానికి వచ్చిన బంధువులను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు ఐదు గ్రామాలకు చెందిన 15 మందిని గుర్తించారు. గ్రామంలో కాంటాక్ట్స్‌ని కూడా గుర్తిస్తున్నారు. వీరందరినీ హోం క్వారంటైన్‌ చేయాలని నిర్ణయించారు.


నారాయణపేట జిల్లాలో కొద్ది రోజుల కిందట కరోనా పాజిటివ్‌తో నాలుగు నెలల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో శిశువుకు కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు కరోనా వచ్చిన బాబుకు ఎవరి ద్వారా వైరస్‌ సోకిందనే విషయమై అధికారులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. బాబు బంధువుల ద్వారా వచ్చిందా? లేక ఆసుపత్రుల్లో చికిత్సకు వెళ్లినప్పుడు సోకిందా? అని పరిశీలిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లోనూ చారగొండ మండలం రామచంద్రాపురంలో వలస కూలీకి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అతన్ని చికిత్సకు పంపి, గ్రామంలో కంటైన్మంట్‌ విధించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని షాద్‌నగర్‌లోనూ కేసులు నాలుగుకు చేరాయి. దీంతో ఆ పట్టణంలోని నాలుగు కాలనీలను కంటైన్మంట్‌ చేశారు.


ఉమ్మడి జిల్లాలో అంతర్గతంగా కరోనా వ్యాప్తి ఇలా జరుగుతుంటే, సరిహద్దుల్లోని కర్ణాటక జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. రాయచూరు, యాద్గిర్‌ జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉండడం, సరిహద్దు గ్రామాల్లోనూ కేసులు నమోదవుతతుండడం, అక్కడి నుంచి నారాయణపేట, గద్వాల జిల్లాలకు రాకపోకలను నియంత్రించడంలో తాత్సారం కూడా కేసుల నమోదుకు ఆస్కారం కలుగుతోంది. ముంబై నుంచి తిరిగొచ్చిన వలస కూలీలకే రాయచూర్‌, యాద్గిర్‌ జిల్లాల్లో కేసులు వస్తుండడంతో పాలమూరులోనూ ముంబై వలసకూలీలపై ప్రత్యేక పరిశీలన ఉంచాలని, పరీక్షలు జరపాలనే అభిప్రాయం వెల్లడవుతోంది.

Advertisement
Advertisement