Abn logo
May 26 2020 @ 00:29AM

ముంచుకొస్తున్న ముప్పు

గద్వాలలో కరోనా కనుమరుగు

పక్క రాష్ర్టాల్లో వైరస్‌ పరుగులు

ముప్పు వాకిట అయిజ, కేటీదొడ్డి, ధరూర్‌, గట్టు

రాయచూరులో ఒకే రోజు 70 పాజిటివ్‌ కేసులు నమోదు

కర్నూల్‌లో తగ్గుముఖం పట్టిన కేసులు


గద్వాల, మే 25 (ఆంధ్రజ్యోతి) : కరోనా పాజిటివ్‌ కేసులతో రెడ్‌జోన్‌లోకి వెళ్లిన జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇప్పుడిప్పుడే వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టి, గ్రీన్‌జోన్‌లోకి వచ్చింది. లాక్‌డౌన్‌ సడలింపు ఇవ్వడంతో ప్రజానీకం కూడా వారి వారి పనుల్లో నిమగ్నమైంది. ఈ  నేపథ్యంలో పక్క రాష్ర్టాల్లో వైరస్‌ తీవ్రగా పెరుగుతుండటంతో మరోసారి గద్వాలకు కరోనా ముప్పు పొంచి ఉన్నది. జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఏపీలోని కర్నూల్‌, కర్ణాటకలోని రాయచూర్‌ ప్రాంతాల్లో వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉంది. కర్నూల్‌లో వైరస్‌ కొంత తగ్గుముఖం పట్టినా, రాయచూర్‌లో మాత్రం సోమవారం ఒక్క రోజే 70 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో రోజుకు 30 నుంచి 50 మధ్య పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. దీంతో రాయచూర్‌కు సమీపంలో ఉన్న జిల్లాలోని గట్టు, అయిజ, కేటీదొడ్డి, ధరూర్‌ మండలాలపై వైరస్‌ పంజా విసిరే అవకాశం ఉన్నది. ఈ మండలాలకు చెందిన ప్రజలు ఎక్కువగా రాయచూర్‌కు రాకపోకలు సాగిస్తుండటంతో, వారితో మళ్లీ గద్వాలలో కరోనా వైరస్‌ వస్తుందనే భయం వెంటాడుతోంది.


హైదరాబాద్‌లో వసల కూలీలకు కరోనా పరీక్షలు జరుపుతుండడంతో, వారిలో చాలా మందికి పాజిటివ్‌ అని నిర్ధారణ అవుతోంది. కానీ, జిల్లాకు ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల నుంచి 5,186 మంది వసల కూలీలు వచ్చారు. వీరితోపాటు మరో 500 మంది ప్రైమరీ కాంట్రాక్ట్‌ చెందిన వారు ఉన్నారు. వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. అయితే వారిలో ఎవరికైనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలితే పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంపై ఆర్డీవో రాములును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, అనుమానం ఉన్న వారికే కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శశికళను ప్రశ్నించగా క్వారంటైన్‌లో ఉన్న వారందరిని నిత్యం పర్యవేక్షిస్తున్నామని, అనుమానం ఉంటే తప్ప పరీక్షలు చేయొద్దనే నిబంధన ఉందన్నారు.


సరిహద్దు గ్రామాలలో అప్రమత్తత

గట్టు : రాయచూర్‌ పరిసర ప్రాంతాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో తెలంగాణ సరిహద్దు గ్రామాలలో పోలీసులు అప్రమత్తమం అయ్యారు. కర్ణాటక సరిహద్దు గ్రామాలైన గట్టు మండలంలోని మాచర్ల, బోయలగూడెం, ఇందువాసి, చింతలకుంట, బల్గెర చెక్‌పోస్టుల వద్ద గ్రామ వలంటీర్లను ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి వచ్చే వారిపై నిఘా ఉంచారు. కర్ణాటక నుంచి వచ్చిన వారి వివరాలను అందించాలని ఏఎస్‌ఐ మంజునాథరెడ్డి గ్రామ వలంటీర్లకు సూచించారు.

Advertisement
Advertisement