Abn logo
Sep 18 2021 @ 01:12AM

ఆలయాల చుట్టూ అలుముకుంటున్న వివాదాలు

కథనం - తిరుపతి, ఆంధ్రజ్యోతి

పవిత్రమైన హిందూ దేవాలయ ప్రాంగణాలు జిల్లాలో వివాద కేంద్రాలుగా మారుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఆలయాల్లో జరిగిన పరిణామాలు భక్తులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. పాలకమండళ్ల నియామకం పేరుతో రాజకీయాలు చేయడం తగదని పలువురు విమర్శిస్తున్నారు. మునుపటి సంప్రదాయాలను,పద్ధతులను పట్టించుకోకుండా పాలకమండలి చైర్మన్లను ప్రకటించి స్థానికుల ఆగ్రహానికి కారణమయ్యారు. శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు చైర్మన్ల నియామకంలో స్థానిక ఎమ్మెల్యేలను కూడా సంప్రదించకపోవడంతో ప్రమాణస్వీకారం చేసే వీలు కూడా  లేకపోయింది. చివరికి టీటీడీ బోర్డులో చోటిచ్చి సర్దడానికి ప్రభుత్వ పెద్దలు పూనుకున్నారు. సురుటుపల్లెలో చైర్మన్‌ ఎవరో ఇప్పటికీ తేలలేదు. బోయకొండ ఆలయ అభివృద్ధికి కారణం అయిన మాజీ చైర్మన్‌ను అవమానించి, వేధిస్తున్న తీరు అందరినీ విస్తుపరుస్తోంది. ఇటువంటి పరిణామాల వల్ల ఆలయాల ప్రతిష్ట మంటగలుస్తోంది. 

శ్రీకాళహస్తిలో బీరేంద్రకు చుక్కెదురు


శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలి చైర్మన్‌గా  జూలై 17న సత్యవేడు మాజీ జడ్పీటీసీ సభ్యుడు బీరేంద్ర వర్మను ఛైర్మన్‌గా నియమించారు. రెండు నెలలైనా ఆయన బాధ్యతలు స్వీకరించే వీలు లేకపోయింది. స్థానికేతరులకు గతంలో ఎన్నడూ చైర్మన్‌ పదవి కేటాయించలేదు. తనను సంప్రదించకుండా బయటివారిని ఎలా నియమిస్తారంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి అభ్యంతరపెట్టడంతో ప్రమాణస్వీకారం చేయడానికి సౌమ్యుడిగా పేరున్న బీరేంద్రవర్మ సాహసించలేదని ప్రచారం జరిగింది. దీంతో బోర్డు సభ్యులను కూడా ప్రకటించలేదు. సీఎం దృష్టికి వెళ్లడంతో చివరికి బీరేంద్రవర్మకు టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం ఇచ్చి సంతృప్తిపరిచారని అంటున్నారు. బియ్యపు మధుసూదనరెడ్డి   అనుచరుడైన అంజూరు శ్రీనివాసులుకు ఇక్కడ అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. 


కాణిపాకంలోనూ స్థానికేతర గొడవ


కాణిపాకం కథ కూడా దాదాపు ఇటువంటిదే. ఎన్నడూ లేనిది ఇక్కడా స్థానికేతరులకు అవకాశం ఇవ్వడంతో వివాదం రేగింది.జీడీనెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలానికి చెందిన వైసీపీ నేత మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి తల్లి ప్రమీలమ్మను ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వం నియమించింది. వయోభారంతో వున్న తన తల్లి ఈ పదవిని నిర్వహించడం కష్టమని దయాసాగర్‌రెడ్డి అధిష్ఠానానికి తెలియజేయడంతో ఆయన భార్య లతను ఛైర్‌పర్సన్‌గా నియమించారు.  అయితే స్థానికేతరులకు చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వడం పట్ల పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు సహా ఆలయ ఉభయదారులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. బయటివారిని చైర్మన్‌గా ఒప్పుకోమంటూ ప్రకటించారు. రెండు నెలలైనా తెగలేదు. బాధ్యతలు స్వీకరించే అవకాశం దొరకలేదు.దీంతో దయాసాగర్‌రెడ్డికి టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం ఇచ్చి సర్దే ప్రయత్నం చేశారు.  కాగా ఉభయదారుల్లో ఒకరైన అగరంపల్లి మోహన్‌రెడ్డిని కాణిపాకం బోర్డు ఛైర్మన్‌గా నియమించాలని ఎమ్మెల్యే కోరుతున్నట్టు తెలుస్తోంది. 

 వివాదాల బోయకొండ


పుంగనూరు నియోజకవర్గంలో ఎస్‌కే రమణారెడ్డి పేరు వినని వారుండరు. కోట్ల రూపాయల సొంత నిధులు వెచ్చించి నియోజకవర్గంలో వందకు పైగా ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసిన దాతగా ఆయనకు పేరుంది. ఆయన, ఆయన భార్య రతీదేవి బోయకొండ ఆలయ ట్రస్టుబోర్డుకు  గతంలో అధ్యక్షులుగా పనిచేశారు. గతంలో కాంగ్రెస్‌ నేతగా, పెద్దిరెడ్డికి అనుచరుడిగా వుండిన రమణారెడ్డి ఇపుడు టీడీపీలో కొనసాగుతున్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనపై వేధింపులు మొదలయ్యాయి. దీంతో నియోజకవర్గంలో ఆయన కదలికలను పరిమితం చేసుకున్నారు.తన కుమారుడి పెళ్ళికి పుంగనూరు పట్టణంలో శుభలేఖలు పంచుకోలేని పరిస్థితి సృష్టించారని చెబుతున్నారు. ఇటీవలే పెళ్లయిన కొడుకును, కోడలిని తీసుకుని రమణారెడ్డి దంపతులు బోయకొండ ఆలయానికి వెళ్ళారు. మాజీ చైర్‌పర్సన్లుగా ఇవ్వాల్సిన మర్యాదలు కూడా ఇవ్వకపోగా ప్రత్యేక క్యూలైన్‌లో ఉండగానే ఆ లైన్‌కు తాళాలు వేసేశారు. ఈ సంగతి మీడియాలో రావడంతో ఆయనపై వేధింపులు మరింత తీవ్రమయ్యాయి.ఆలయ సిబ్బందిని దూషించారంటూ ఆయనపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. బోయకొండ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసిన చైర్మన్‌గా పేరున్న ఆయన పట్ల ఇలా ప్రవర్తించడంతో స్థానికులు విస్తుపోతున్నారు. 

 సురుటుపల్లెలో ఛైర్మన్‌ కుస్తీ?


సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలోని సురుటుపల్లె పల్లికొండేశ్వరాలయం సుదీర్ఘకాలంగా వివాదాల్లోనే మునిగి తేలుతోంది. గతేడాది డిసెంబరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు ఏవీఎం మునిశేఖర్‌రెడ్డి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అయితే మొత్తం ఏడుగురు పాలకమండలి సభ్యుల్లో ఆరుగురు ఈయనను వ్యతిరేకించారు.ఆలయ నిర్వహణలో తమకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, సమాచారం కూడా ఇవ్వడం లేదని, అనుమతి లేకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. దీనిపై జూలై 20న దేవదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపారు.అదే రోజు సాయంత్రం ట్రస్టు బోర్డు సభ్యులు అత్యవసరంగా సమావేశమై చైర్మన్‌ ఏవీఎం మునిశేఖర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఛైర్మన్‌ను తొలగిస్తూ, అతడి స్థానంలో పార్ధసారధి అలియాస్‌ మహేష్‌ అనే సభ్యుడిని కొత్త ఛైర్మన్‌గా ఎన్నుకుంటున్నట్టు తీర్మానం ఆమోదించి దేవదాయ శాఖకు పంపించారు. ఏడుగురిలో ఆరుగురు సంతకాలు చేశారు. ఇక అప్పటి నుంచీ మునిశేఖర్‌రెడ్డి, పార్థసారధి ఇద్దరూ ఛైర్మన్‌ తానంటే తానని పోటాపోటీగా ఆలయంలో పర్యవేక్షణ సాగించారు.ఈ నేపథ్యంలో చైర్మన్‌గా మునిశేఖర్‌రెడ్డి కొనసాగనున్నట్లు ఆలయ ఈవో రామచంద్రారెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మునిశేఖర్‌రెడ్డినే చైర్మన్‌ కొనసాగించాలని దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.