Abn logo
May 15 2020 @ 00:40AM

కలుషిత కాల సత్యాలు

ఒక వైరస్, ఒక వాయువు, ఒక యుద్ధం 

పేరు ఏదైతేనేం 

భూమ్మీద జీవానికి శత్రువే


కాలం కలుషితమైంది 

ఇప్పుడు వీస్తున్న గాలి 

ట్రోపోస్ఫియర్ మొత్తం 

కమ్ముకున్న ఈ కమురు వాసనలో 

వైరస్ వుహాన్ నుండి

విమానంలో ఎగిరి భూమిని చుట్టేయొచ్చు

అమెరికన్ యూనియన్ కార్బైడ్ 

భోపాల్‌లో విషం చిమ్మొచ్చు 

విశాఖలో కొరియన్ కంపెనీ

గాల్లో మృత్యువును మోసుకు రావొచ్చు

ట్రంప్‌ను, వాడి తాబేదార్లని 

మనం ప్రజాస్వామ్య పండుగ పేరిట 

నెత్తిన ఎక్కించుకొని ఊరేగించొచ్చు

కమ్యూనిజం కాలం చెల్లిన సిద్ధాంతమని

మనని మనం సామ్రాజ్యవాద దేవతకు 

బలి ఇచ్చుకొని స్వేచ్ఛాగానం ఆలపించవచ్చు


కాలం కర్కశమైంది 

మనల్ని డీహ్యుమనైజ్ చేసి 

భూమ్మీద సమస్త జీవాన్ని 

నిర్జీవం చేస్తున్నది 


బుద్ధ పూర్ణిమ ఉదయాన్నే 

విశాఖలో విష వాయువు, 

సబ్బం దుఃఖం అనే ఆర్య సత్యాన్ని 

సమాజమే బోధి వృక్షమై 

జ్ఞాన బోధ చేస్తున్నది 


పెట్టుబడి భూమిని 

అమానవీయం చేస్తుందన్న 

మార్క్స్ ప్రతిపాదన 

మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తున్నది

పెట్టుబడి ల్యాబ్‌లో 

మనిషిని మ్యుటేట్ చేసి 

భూమ్మీదికి వదులుతున్నది 


సమస్త జీవం 

మరణంలో జీవాన్ని వెతుకుతున్న వేళ 

దుఃఖం తెరలు తెరలుగా పొర్లుకొస్తున్న వేళ 

జీవన సత్యాన్ని మరొక్కసారి శోధిద్దాం  

ఏక కణం నుండి మనిషి వరకు 

సింబయాటిక్‌గా బతకడం నేర్చుకుందాం

మన మెదళ్లను శాసిస్తున్న 

మట్టి కాళ్ళ మహా రాక్షసి ఊడలు నరికేద్దాం

శత్రువు చేస్తున్న డాలర్ల వేటలో   

ఎరలుగా మారడం మాని 

వెంటిలేటర్ మీద ఉన్న

పెట్టుబడిని మట్టుబెడదాం 


ఈ భూమికి 

అదే ధ్వంస రచన, అదే విప్లవం 

అదే నిర్వాణం, అదే పునరారంభం 

ఎం. ఏ. వాసు

Advertisement
Advertisement
Advertisement