Abn logo
Oct 23 2020 @ 04:43AM

నత్తలు నవ్వేలా..!

Kaakateeya

మందకొడిగా కొత్త కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) :  జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఏడాదిలో పూర్తి కావాల్సిన నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధుల పట్టింపులేని తనంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి.. అక్కడే అన్న చందంగా మారాయి. కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి పునాది రాయి వేసి మూడేళ్లు దాటింది. కనీసం ఈ ఏడాది కూడా భవన నిర్మాణ పనులు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పత్తాలేకుండా పోయారు. కాంట్రాక్టర్‌ను అడిగే వారు లేక పనులు మందకొడిగా సాగుతున్నాయి.


సకాలంలో అందని నిధులు 

2017 అక్టోబరు 12వ తేదీన రాష్ట్ర ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌శాఖ మంత్రి పద్మారావు కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు ప్రారంభిం చారు. 40ఎకరాల స్థలాన్ని కేటాయించగా.. రెండెకరాల సువిశాల విస్తీర్ణంలో జీ+2 అంతస్థుల్లో రూ.33కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అగ్రిమెంట్‌ చేసుకున్న తేది నుంచి 11 నెలల్లో నిర్మాణ కాంట్రాక్ట్‌ సంస్థ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయక పోవడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఇప్పటికే గడువును మూడు సార్లు పొడిగించారు.


దసరా, దీపావళికీ డౌటే..

దసరా, దీపావళి నాటికి కొత్త కలెక్టరేట్‌ పూర్తి కావొచ్చని అను కున్నారు.. కానీ.. అధికారుల నిర్లక్ష్యం... కాంట్రాక్టర్‌ అలసత్వం వెరసి దీపావళికి కూడా పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేవు. కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ వహించి పనుల పురోగతిపై చర్యలు తీసుకోకుంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు కూడా కలెక్టరేట్‌ భవనం పూర్తయ్యేలా కనిపించడం లేదు.


ప్రారంభ దశలో అంతరాయం..

అందరికీ అందుబాటులో ఉండేలా కలెక్టరేట్‌ నిర్మించాలని చేవెళ్ల, షాద్‌నగర్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ప్రజలు ఆందోళన చేపట్టడంతో ప్రారంభదశలో అంతరాయం ఏర్పడింది. తర్వాత వేగంపుంజుకున్నప్పటికీ ప్రస్తుతం మందగించింది. 


అత్యాధునిక హంగులతో..

అన్నిశాఖలు ఒకేచోట ఉండేలా కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మిస్తు న్నారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించనున్నారు. పచ్చదనం కోసం మొక్కలు నాటేం దుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. కొంగరకలాన్‌లో నిర్మిస్తున్న కలెక్టరేట్‌లో అన్ని వసతులు కల్పిస్తున్నారు. అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఈ భవనంలోకి 36 శాఖల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం లక్ష చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. ఆయా శాఖలు, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. 500మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారు. పోస్టాఫీసు, బ్యాంకు, డిస్పెన్సరీ, ఫైర్‌ సర్వీసెస్‌, క్యాంటీన్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు.


ఫర్నిచర్‌ టెండర్‌ ఎప్పుడో?

ఇంకా ఫర్నిచర్‌ టెండర్‌ ప్రక్రియ మొదలు కాలేదు. ఎప్పుడు వేస్తారనే విషయం అధికారులకే తెలియడం లేదు. ఇంకా చాలా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వైరింగ్‌, ఫైనల్‌ పెయింటింగ్‌ తదితర పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. 

Advertisement
Advertisement