Abn logo
Sep 26 2020 @ 04:40AM

నత్తనడక..ముందుకు సాగని రైతువేదిక భవనాల నిర్మాణ పనులు

Kaakateeya

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, వర్షాలతో ఆలస్యం

దసరా వరకు  ప్రారంభమయ్యేది ప్రశ్నార్థకమే..?


మేడ్చల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదిక భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దసరా పర్వదినాన నిర్మాణాలు పూర్తిచేసుకొని ప్రారంభించుకోవాలని జిల్లా అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు ఇంకా ఆదిలోనే ఉన్నాయి. జిల్లాలో 9 రైతువేదిక భవనాలు నిర్మిస్తుండగా.. మేడ్చల్‌ మండలంలో రాయిలాపూర్‌, పూడూరు గ్రామాల పరిధిలో రెండు భవనాలను నిర్మిస్తున్నారు. జూలై 13న భవనాల నిర్మాణ పనులను కార్మికశాఖమంత్రి మల్లారెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. రైతులంతా ఒకచోట చేరి వ్యవసాయంపై చర్చించుకునేందుకు, సమావేశాలు జరుపుకునేందుకు 2,046 చదరపు అడుగుల్లో రైతు వేదిక భవనాలను నిర్మిస్తున్నారు.


వీటి నిర్మాణాలు ముందుకు సాగం లేదు. రాయిలాపూర్‌, పూడూరు గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదిక భవనాలు ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. దీనికితోడు వర్షాలు కూడా అడ్డంకిగా మారడంతో పనులు నిలిచిపోయాయి. రైతువేదిక భవన నిర్మాణాలు జరిగే చోట వర్షపు నీరు నిలవడంతో పనులు చేపట్టలేకపోతున్నారు. దీంతో పనులు మరింత ఆలస్యమవుతున్నాయి. ఈ లెక్కన దసరాకల్లా రైతు భవనాలను ప్రారంభించుకోవడం సాధ్యం కాదనే చెప్పవచ్చు. పలుమార్లు జిల్లా కలెక్టర్‌ సైతం ఆకస్మిక తనిఖీలు చేసి పనులను నాణ్యతగా, వేగంగా చేయాలని చెప్పినప్పటికీ ముందుకుసాగడం లేదు.  కాంట్రాక్టర్‌ల నిర్లక్ష్యంతో అధికారుల లక్ష్యం నెరవేరుతుందా..? లేదా..? చూడాలి. 


వర్షాలతోనే ఆలస్యం : పద్మాజగన్‌రెడ్డి, ఎంపీపీ

 మేడ్చల్‌ మండలంలో నిర్మిస్తున్న రైతువేదిక భవనాల నిర్మాణ పనులు వర్షాలతోనే ఆలస్యమవుతున్నాయి. 20రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో పనులు చేపట్టలేకపోతున్నారు. భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌లను ఆదేశించాం. వీలైనంత త్వరగా నిర్మాణాలను పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాం.

Advertisement
Advertisement
Advertisement