Abn logo
May 7 2020 @ 00:40AM

విపత్తు వేళ రాజ్యాంగ సంఘర్షణ

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రంతో సమసార్వభౌమ అధికారాలున్నాయని రాజ్యాంగం స్పష్టం చేసింది. కరోనా వంటి విపత్తు సమయంలో స్థానిక, రాష్ట్ర పాలనా వ్యవస్థలకు చాలా పరిమితులు ఉంటాయి కనుక కేంద్రం నాయకత్వ బాధ్యత తీసుకోవలసిందే.. విపత్తు నివారణలో రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించేందుకు మాత్రమే ఆ అధికారాలు పరిమితమని గుర్తించాలి.. విపత్తు విజృంభించకుండా నివారించడం, ఆర్థిక సంక్షోభ దశలో రాష్ట్రాలను ఆదుకునే ఆలోచన చేయడమే కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ విహిత ధర్మం. 


కొవిడ్- 19 మానవ జీవనానికి మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య ఫెడరల్ విధానాలకు కూడా సమస్యలు తెచ్చిబెడుతున్నది. ఈ భయానక అంటురోగం రాజ్యాంగపరమైన అత్యయిక పరిస్థితికి దారి తీస్తుందా? యాచిస్తే తప్ప ఇల్లుగడవని సంసారాలుగా రాజ్యపాలన సాగుతుందా? మన ఫెడరల్ రాజ్యాంగం కేంద్రంలో అధికార కేంద్రీకరణను ప్రోత్సహించలేదు. శత్రువులదాడి, అంతర్యుద్ధాల్లో ఎమర్జన్సీ విధిస్తే తప్ప రాష్ట్రాలను అణిచే అధికారాలు కేంద్రానికి లేవు. ఏ రాష్ట్రంలోనైనా ప్రజా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైతే పాలన కేంద్రం చేతిలోకి వెళ్తుందే కాని మిగతా సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం (గుమాస్తాను ఐఎఎస్ అధికారి చూసినట్టు) చిన్నచూపు చూడడానికి వీల్లేదు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రంతో సమసార్వభౌమ అధికారాలున్నాయని రాజ్యాంగం అనేక నియమాలలో స్పష్టం చేస్తూనే ఉంది. 


రాజ్యాంగంలోని రాష్ట్రాల జాబితాలో మొదటి అంశంగా శాంతిభద్రతలు, ఆరో అంశంగా ప్రజారోగ్యం వున్నాయి. కేవలం రాష్ట్రప్రభుత్వాలకు మాత్రమే ఈ అంశాలలో పూర్తి అధికారాలు ఉంటాయి. ప్రజారోగ్యం బాధ్యతలను స్థానిక సంస్థలు మునిసిపాలిటీలకు దఖలు పరచాలని అధికరణ 243 డబ్ల్యు (మునిసిపాలిటీల అధికారాలు, బాధ్యతలు) శాసిస్తున్నది. ఉమ్మడి జాబితాలోని 29వ అంశం ప్రకారం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి అంటువ్యాధులు వ్యాపించకుండా నిరోధించేందుకు కావలసిన అధికారాలు కేంద్రానికి ఉన్నాయి. రాజ్యాంగపరంగా బాధ్యతలను ఇంతకన్న ఖచ్చితంగా పంచడం సాధ్యం కాదు. అయితే కొవిడ్ వంటి ఉత్పాతాన్ని ఎవరూ ఊహించలేదు. స్వాతంత్ర్యానికి పూర్వం 1897 నాటి బ్రిటిషు చట్టం ఎపిడెమిక్ డిసీజెస్ ఆక్ట్ ప్రకారం ప్రాథమిక బాధ్యతలు రాష్ట్రాలకే ఉంటాయి. కేంద్రానికి అనుబంధమైన కొన్ని బాధ్యతలూ ఉన్నాయి.


ఇక విపత్తుకాలపు పాలనావ్యవహారం ఎవరి అధికారపరిధిలో ఉందనే ప్రశ్న. రాజ్యాంగం ఏడో షెడ్యూలులో ఎక్కడా ఈ విషయం కనబడదు. ఉమ్మడి జాబితాలో సామాజిక భద్రత, సామాజిక బీమా, ఉద్యోగ, నిరుద్యోగ అంశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉద్యోగ భద్రత గురించి ఈ అంశాన్ని ఉద్దేశించారు. ఉద్యోగాలు కల్పించడం, ఉద్యోగాలు ఉన్నవారిని రక్షించడం ద్వారా వలసకూలీలుగా మారే నిరాశాజనక పరిస్థితులు నివారించడం దీని లక్ష్యం. రాజ్యాంగంలోని ఏ జాబితాలోనూ విపత్తు వ్యవహార నిర్వహణ (మేనేజ్‌మెంట్) గురించి లేకపోయినా ఉమ్మడి జాబితా, రాష్ట్రాల జాబితాలో అనేక అంశాలలో అంతర్లీనంగా దీని ప్రస్తావన ఉంది. అయితే కేంద్రం తన అధికార పరిధులను దాటిందనే ఆరోపణలకు ఆస్కారం ఉందని పరిపాలనా సంస్కరణల కమిషన్ 2006లో గుర్తించింది. కనుక కేంద్రానికి రాష్ట్రాలకు సమానంగా బాధ్యతలు ఇచ్చేందుకు ఉమ్మడి జాబితాలో విపత్తులు, సహజ లేదా మానవకృత అత్యయిక పరిస్థితుల వ్యవహార బాధ్యతలను చేర్చాలని ఆ కమిషన్ సూచించింది. 2002లో జాతీయ రాజ్యాంగ అమలు సమీక్షా కమిషన్ కూడా ఇదే సూచన చేసింది. 2013 నాటి డిజాస్టర్ మేనేజ్ మెంట్ (డిఎమ్) చట్టాన్ని సమీక్షించేందుకు ఒక టాస్క్ ఫోర్స్‌ను హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఆ తరువాత చేసిందేమీ లేదు. 


డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం, విపత్తు సంభవించినప్పుడు తక్షణ చర్యలు తీసుకునే అధికారాన్ని కేంద్రానికి ఇచ్చింది. కానీ, దాని అర్థం ఈ నియమం ద్వారా అన్ని అధికారాలను హస్తగతం చేసుకోవాలని కాదు. నిజానికి రాష్ట్ర, జిల్లా, నగర, గ్రామస్థాయిలో ఒక్కొక్క స్వయం పాలనా వ్యవస్థ ఉండడం విపత్తు ఎదుర్కొనడంలో ఎంతో ఉపయోగపడుతుంది. కేంద్రం ఉత్తమ నాయకత్వ లక్షణాలు చూపితే చాలు. కుటిల రాజనీతి జొప్పించకూడదు. క్షేత్రస్థాయిలో పనులు చేసే యంత్రాగం సమాంతరంగా అంతటా విస్తరించి పనిచేయడానికి ఈ రాజ్యాంగ అధికార వికేంద్రీకరణ నియమాలు ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా కరోనా వంటి జాతీయ అంతర్జాతీయ విపత్తు ఎదురైనప్పుడు స్థానిక, రాష్ట్ర పాలనా వ్యవస్థలకు చాలా పరిమితులు ఉంటాయి. నిధుల కొరత, ప్రాదేశిక పరిధి, పొరుగు రాష్ట్రంపైన ఏ అధికారమూ లేకపోవడం వంటివి. కనుక కేంద్రం నాయకత్వ బాధ్యత తీసుకోవలసిందే. అయితే అది కేవలం విపత్తు నివారణలో రాష్ట్రాలను సమన్వయం చేయడానికి మాత్రమే వినియోగించే పరిమితమైన అధికారం అని గుర్తించాలి. విస్తృతాధికారాలు చేజిక్కించుకుని నియంతగా మారడానికి ఈ చట్టాన్ని వాడుకోవడం అసమంజసం అవుతుంది. రాజ్యాంగ సమ్మతం కూడా కాదు. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ కేవలం సుపరిపాలనా సూత్రమే కాకుండా భారత సంవిధాన మౌలిక స్వరూపం కూడా. అయినా ఒక నగరంలోనో గ్రామంలోనో వైరస్ వ్యాప్తిని నివారించడానికి అక్కడి మునిసిపాలిటీకో లేక రాష్ట్ర ప్రభుత్వానికో ఉన్న వెసులు బాటు ఎక్కడో దూరాన ఉన్న ఢిల్లీ పాలకులకు ఉండదనేది ఇంగిత జ్ఞానం. ఈ మాత్రం అర్థం కావడానికి సంవిధాన రాజకీయ శాస్త్రాలలో ఉద్దండ పాండిత్యం అక్కర్లేదు. కావలసింది- విపత్తు విజృంభించకుండా నివారించడం. ఆర్థికసంక్షోభ దశలో ఆదుకునే ఆలోచన చేయడం.


విపత్తు నివారణకు, తగ్గింపునకు, ఎదుర్కొనే సంసిద్ధతకు, సామర్థ్య నిర్మాణానికి అవసరం అనుకున్న చర్యలన్నీ తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని డిఎం చట్టం నిర్దేశిస్తున్నది. ఎపిడమిక్ డిసీజ్ (ఇడి) చట్టం రాష్ట్రాలకు అవసరమైన చర్యలు తీసుకునే అధికారాలు ఇస్తున్నది. డిఎమ్ చట్టం కేంద్రానికి ఇచ్చిన అధికారాలను ఇడి చట్టం రాష్ట్రాలకు ఇచ్చింది. మునిసిపాలిటీలకు స్థానిక సంస్థలకు కూడా ఇవే అధికారాలు ఇచ్చింది. రేవుల్లో ఓడలను తనిఖీ చేయడం వంటి పర్యవేక్షణాధికారాలకు కేంద్రాన్ని మాత్రమే పరిమితం చేసింది.


డిఎమ్ చట్టం కిందనే దేశవ్యాప్తంగా కొన్ని వారాల పాటు లాక్‌డౌన్ విధించే అధికారాలను కేంద్రం వినియోగించుకున్నది. గత్యంతరం లేనపుడు లాక్‌డౌన్ తప్పదు కనుక దీన్ని అసమంజసం అనలేము. స్థానిక అవసరాలను బట్టి లాక్‌డౌన్ నియమాలను సడలించి,సవరించి, కుదించి, విస్తరించే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఆ అధికారం కొన్ని రాష్ట్రాలు వాడుకుంటున్నాయి కూడా. పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ హెల్త్ పైన రాష్ట్రాలకే అధికారాలు ఉన్నాయి. కరోనా వైరస్ లేకపోతే రాష్ట్రాలను కాదని దేశవ్యాప్తంగా ఒక్క రోజైనా అన్నీ బంద్ చేసే అధికారం కేంద్రానికి ఉంటుందా? 


కరోనా విజృంభించడానికి కేంద్ర- రాష్ట్ర వైరి సంబంధాల వైరస్ దోహదం చేస్తోందని చెప్పక తప్పదు. వస్తుసేవల పన్ను, ఎక్సైజ్ పన్నును కేంద్రం వసూలు చేస్తుంది. ఈ పన్నుల రాబడిలో రాష్ట్రాలకు ఇవ్వవలసిన వాటా ఇంకా బదిలీ చేయలేదు. మేము మా సిబ్బందికి కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే మాకు రావలసిన రూ.6200 కోట్లు అర్జంట్‌గా చెల్లించాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అంటున్నారు. ఇది కేవలం పంజాబ్ సమస్య కాదు. అన్ని రాష్ట్రాల పరిస్థితీ ఇదే. ముందు మా నిధుల బకాయి తీర్చండి, రాష్ట్రవిపత్తు నివారణ సహాయనిధిలో మావాటా ఇవ్వండి అని పదే పదే రాష్ట్రాలు అడిగిన తరువాత ఏప్రిల్ 3న రూ. 17,287 కోట్లను కేంద్రం ఇచ్చింది. రాష్ట్ర విపత్తు సహాయ నిధిలో మొదటి వాయిదా కింద ఇచ్చిన రూ.11,092 కోట్లు ఇందులో భాగమే. 2020–-21లో స్టేట్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్ మెంట్ ఫండ్‌లో రాష్ట్రాలకు రూ. 28,983 కోట్లు కేటాయించాలని, అందులో కేంద్ర వాటా రూ.22,184 కోట్లు ఉండాలని పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.


కరోనా విపత్తు కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ అనివార్యమయింది. అయితే రాష్ట్రాలు పాటించి తీరవలసిన ఆదేశాలు జారీ చేసే అధికారం కేంద్రానికి లేదు. అత్యవసర పరిస్థితిలో మినహా రాజ్యాంగం ప్రకారం పాలనా యంత్రాంగ వైఫల్య కారణంగా రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్ర స్థాయి ఎమర్జన్సీ (అధికరణ 356), అంతర్గత కల్లోలం, యుద్ధం వంటి సమయాల్లో జాతీయ ఎమర్జన్సీ (అధికరణ 352), ఆర్థిక సంక్షోభం తట్టుకోవడానికి ఆర్థిక ఎమర్జన్సీని ప్రకటించే అవకాశాన్ని (అధికరణ 360) రాజ్యాంగం నిర్దేశించింది. అప్పుడు కేంద్రం అధికారాలు పెరుగుతాయి. మన దేశం మామూలు సమయాల్లో సమాఖ్య అనీ ఎమర్జన్సీలో కేంద్రానికి అధికారాలు పెరిగి యూనిటరీ (కేంద్రీకృత) ప్రభుత్వం అవుతుందని రాజ్యాంగ నిర్మాతలు వివరించారు. అయితే కేంద్రంలో పూర్తిమెజారిటీ ఉండి, అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ పాలనలో మనకు ఫెడరల్ లక్షణాలు కనబడవు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొన్ని విమర్శలు, డిమాండ్లు తప్ప కేంద్రాన్ని నిలదీసి, రాష్ట్ర సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. ఇంత అధికారం చేతిలో ఉన్నా ఎమర్జన్సీ విధించకుండానే విపరీత అధికారాలను లాక్కునే కేంద్ర పాలకులను మనం చూస్తూనే ఉన్నాం. 


కరోనా కట్టడి విషయంలో కేంద్రం ఇచ్చేవి సూచనలు, సిఫార్సులే అయినా అవి ఆదేశాలతో సమానం. వాటిని పాటించబోమని రాష్ట్రాలు అనకూడదని కేంద్రం వాదిస్తున్నది. నిజమే. ఆ పరిస్థితి రాకుండా కేంద్రం కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం సాధించడం అవసరం. మొదట్లో ఏకంగా లాక్‌డౌన్ ముందు ఎవరినీ సంప్రదించకపోయినా ప్రధాన మంత్రి ఆ తరువాత సంప్రదిస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన పరిణామం. రాష్ట్రాలు కూడా కేంద్రంతో పూర్తిగా సహకరిస్తున్నాయి. కేంద్రం ఇచ్చిన సూచనలను, ఆదేశాలను తిరస్కరిస్తే రాజ్యాంగపాలన యంత్రాంగం విఫలమైనట్టుగా భావించి రాష్ట్రపతి పాలన విధించే అధికారం కూడా కేంద్రానికి ఉంది. కాని కరోనా నేపథ్యంలో అంతటి విపరీత చర్య సమంజసం కాబోదు. నిత్యావసర వస్తువులు, ఆహారం సరఫరా వంటి సహాయకార్యక్రమాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేయవచ్చు. రుణాల వసూలులో రాయితీలు, మినహాయింపులు, వాయిదాల వంటి ఆర్థిక వెసులుబాట్లు కల్పించవచ్చు. వ్యాపారాలు, పరిశ్రమలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్వల్పకాలిక రుణాల అంశాలలో నిర్ణయాధికారం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి ఉంటుంది. రాష్ట్రాలు ఈ అథారిటీకి పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది. కొవిడ్ వంటి సంక్షోభాన్ని ముగించడం రాజ్యాంగ అధికారాల నిర్వహణ మాత్రమే కాదు, రాజకీయ బాధ్యత కూడా. అయితే అత్యవసర అధికారాలను అడ్డుబెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ బాధ్యతలను పరిహసించడానికి వీల్లేదు. రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని, ప్రజల హక్కులను హరించడానికి వీల్లేదు.

మాడభూషి శ్రీధర్

Advertisement
Advertisement
Advertisement