Advertisement
Advertisement
Abn logo
Advertisement

కీచక Constable.. ఒకరికి తెలియకుండా మరొకరితో పెళ్లి.. యువతితో ప్రేమ.. చివరికి ఘోరం..!

  • ఉసురు తీసిన ‘వంచన’.. 
  • ప్రేమ పేరుతో కానిస్టేబుల్‌ మోసం
  • తట్టుకోలేక వలంటీరు బలవన్మరణం


శ్రీకాళహస్తి, డిసెంబరు2 : బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ కానిస్టేబుల్‌ కీచక పర్వానికి తెరలేపాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని రెండు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా వలంటీరుగా పని చేస్తున్న మరో యువతిని ప్రేమపేరుతో వంచించాడు. ఇరు కుటుంబాల మధ్య ఇది తీవ్ర వివాదం కావడంతో మనస్తాపం చెందిన వలంటీరు ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాళహస్తి రెండవ పట్టణ సీఐ భాస్కర్‌నాయక్‌ కథనం మేరకు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కార్పెంటర్‌ కె.సాంబశివరావు 20ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం శ్రీకాళహస్తి చేరుకున్నాడు.  ఈయనకు భార్య నాగిని,ఇద్దరు కుమార్తెలు వున్నారు.


తొట్టంబేడు మండలం చేమూరుకు చెందిన చింతపూడి ప్రసాద్‌ 2011లో పీసీ నెంబరు 1684తో శ్రీకాళహస్తిలో విధుల్లో చేరాడు. 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రోటోకాల్‌ పనులను చూస్తున్నాడు. సాంబశివరావు రెండవ కుమార్తె అయిన ఉమామహేశ్వరి డిగ్రీ చదువుతుండగా ఐదేళ్ల క్రితం కానిస్టేబుల్‌ ప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారింది.2019లో డిగ్రీ అనంతరం ఉమామహేశ్వరి వలంటీరుగా చేరింది. కొద్దిరోజులకు కానిస్టేబుల్‌ ప్రసాద్‌ బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఉమామహేశ్వరి దూరం పెట్టింది.

కానిస్టేబుల్‌ ప్రసాద్‌

దీంతో ఆమె ఇంటి పక్కనే  ప్రసాద్‌ కాపురం పెట్టాడు. ఈ క్రమంలో మళ్లీ ఇద్దరి మధ్య పరిచయం కొనసాగింది. నాలుగు నెలల క్రితం ఓ మహిళ కానిస్టేబుల్‌ ప్రసాద్‌కు తాను రెండవ భార్యనంటూ ఉమామహేశ్వరికి ఫోన్‌ చేసి చెప్పడంతో ఎందుకు మోసం చేశావంటూ ప్రసాద్‌ను నిలదీసింది. తన వద్ద తీసుకున్న నగలు, నగదు తిరిగి ఇచ్చేయాలని పట్టుబట్టింది. దీంతో బుధవారం పట్టణంలోని టూరిస్టు బస్టాండు వద్ద పంచాయితీకి రావాలని ప్రసాద్‌ ఆమెను పిలిచాడు. తండ్రి  సాంబశివరావుతో ఆమె అక్కడికి చేరుకుంది. అక్కడ వారిపై కానిస్టేబుల్‌ ప్రసాద్‌తో పాటు అతని అన్న, వదిన, అమ్మకలిసి దౌర్జన్యానికి దిగారు. అంతే కాకుండా ఉమామహేశ్వరి సెల్‌ఫోన్‌లో సమాచారాన్ని తొలగించడమే కాకుండా తెల్లకాగితాలపై ఆమె నుంచి బలవంతంగా సంతకాలు సేకరించారు. వారిని ఎదిరించలేక తండ్రీకూతుళ్లు ఇంటికి వెళ్లిపోయారు.

మార్చురీ వద్ద విలపిస్తున్న ఉమామహేశ్వరి కుటుంబసభ్యులు

రాత్రి భోజనానంతరం గదిలో ఉన్న ఉమామహేశ్వరి అక్కకు ఫోన్‌ చేసి నాన్నను బాగా చూసుకోవాలంటే దిగులుగా మాట్లాడింది. దీంతో అనుమానం వచ్చిన ఆమె తండ్రికి ఫోన్‌ చేసింది. గదిలో నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఉరి వేసుకుని మృతి చెందిన ఉమామహేశ్వరిని చూసి తల్లడిల్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలనానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ వంచనతో మనస్తాపానికి గురైన తన కుమార్తె బలవన్మరణానికి పాల్పడినట్లు సాంబశివరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ప్రసాద్‌తో పాటు అతడి అన్న, వదిన, అమ్మపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఉమామహేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు తెనాలికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు.

Advertisement
Advertisement