Abn logo
Jun 1 2020 @ 21:45PM

ఢిల్లీ సరిహద్దులను మూసేయడంపై కాంగ్రెస్ ఫైర్

న్యూఢిల్లీ: వారం రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులను మూసేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో వైద్య సేవలు సన్నగిల్లడానికి బయటి వ్యక్తులకు సంబంధం ఏమిటని ప్రశ్నించింది. ‘‘ఇదంతా కరోనా పేరుతో చేస్తున్న నాటకం’’ అంటూ దుయ్యబట్టింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు మూసేస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించడంపై మాజీ కేంద్రమంత్రి అజయ్ మాకెన్ స్పందిస్తూ.. ‘‘ఢిల్లీలో ఆరోగ్య సేవలు తగ్గడానికి బయటి నుంచి వస్తున్న వారే కారణమంటూ సరిహద్దులు మూసేస్తున్నారు. ఢిల్లీలో కరోనా బారిన పడిన మొత్తం 2,395 మందిలో 630 మంది జజ్జార్ ఎయిమ్స్ (హర్యానా)లో చేరారు. సరిహద్దులు మూసేస్తే వాళ్లెప్పుడు తిరిగొస్తారు?’’ అని ప్రశ్నించారు. ఆరోగ్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైన విషయాన్ని కప్పిపుచ్చి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే సరిహద్దు వ్యవహారం తెరమీదికి తెచ్చారని మాకెన్ ఆరోపించారు. కాగా ఢిల్లీ ఆస్పత్రులు ఢిల్లీ ప్రజలకే కేటాయించాలా వద్దా అన్న దానిపై ప్రజల నుంచి కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు వాట్సాప్, ఈ మెయిల్స్ ద్వారా అభిప్రాయాలను సేకరించారు.  

Advertisement
Advertisement
Advertisement