Abn logo
Sep 25 2021 @ 12:25PM

పంజాబ్ క్యాబినెట్: ఏడుగురు కొత్త ముఖాలు, ఐదుగురు ఎమ్మెల్యేలకు ఉద్వాసన

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మంత్రివర్గ సభ్యుల జాబితా దాదాపు ఖరారైంది. శుక్రవారం రాత్రి నుంచి తుది జాబితా ఖరారు కోసం ఏఐసీసీ నేత రాహుల్‌తో పార్టీ నేతలు సంప్రదింపులు సాగిస్తున్నారు. కొత్త క్యాబినెట్‌ కూర్పులో ఏడుగురు కొత్త ముఖాలకు చోటు కల్పించనున్నారని, మాజీ సీఎం అమరీందర్ సింగ్ క్యాబినెట్‌లోని ఐదుగురికి ఉద్వాసన పలుకనున్నారని, దీనిపై ఏకాభిప్రాయం కుదరడానికి కసరత్తు జరుగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. లాంఛనంగా ఈ జాబితా ప్రకటించడానికి ముందు ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంటుందని చెబుతున్నారు.

కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, హరీష్ రావత్, హరీష్ చౌదరి, అజయ్ మాకెన్‌లు సైతం క్యాబినెట్ కూర్పు సమావేశంలో తలమునకలవుతున్నారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సిద్ధు, రెవెన్యూ మంత్రి గుర్‌ప్రీత్ సింగ్ కాంగర్, పరిశ్రమల మంత్రి సుందెర్ శ్యామ్ అరోరా, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి సాధు సింగ్, క్రీడల మంత్రి రాణా గుర్మిత్ సింగ్ సోధిలను మంత్రివర్గం నుంచి తప్పించడంపై ఏకాభిప్రాయం కుదిరినట్టు చెబుతున్నారు. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి రాణా గుర్జిత్ సింగ్‌ను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అమరీందర్ క్యాబినెట్‌లో గతంలో మంత్రిగా ఉన్న గుర్జిత్ సింగ్ ఇసుక గనులను తన మాజీ ఉద్యోగులకు కేటాయించారనే ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. శుక్రవారం రాత్రి ఖరారైన జాబితాలో పీపీసీసీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి పర్గత్ సింగ్, పీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్జిత్ నగ్రా, గిద్దెర్‌బాహ ఎమ్మెల్యే అమరీందర్ సింగ్ రాజా ఉన్నారని సమాచారం. వీరి పేర్లను నవజ్యోత్ సింగ్ సిఫారసు చేశారు. పర్గత్, నగ్రాలకు చోటు కల్పించడానికి చన్నీ వ్యతిరేకించారని, పార్టీ పదవుల్లో ఉన్నందున వారికి మరిన్ని కీలక పదవులు ఇస్తే సరిగా బాధ్యత నిర్వహించలేరనే అభిప్రాయం వ్యక్తం చేఖారని తెలుస్తోంది. సిద్ధూ ప్రతిపాదనను మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ సైతం వ్యతిరేకించారని, సిద్ధూ మాత్రం పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. కాగా, ఏకాభిప్రాయం కుదిరిన కొత్త ముఖాల్లో డాక్టర్ రాజ్ కుమార్ వెర్కా, పీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగత్ సింగ్ గిల్జియాన్, గుర్‌కీరత్ కోట్లి ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రివర్గంలో కొనసాగించాలని నిర్ణయించినట్టు చెబుతున్న వారిలో బ్రహ్మ్ మహీంద్ర, మన్‌ప్రీత్ బాదల్, సుఖ్బీందర్ సర్కారియా, త్రిపత్ రాజీందర్ సింగ్ బజ్వా, విజయ్ ఇందర్ సింగ్లా, అరుణ చౌదరి, రజియా సుల్తానా, భరత్ భూషణ్ అషు ఉన్నారు. వీరి శాఖలలో మార్పు లేకపోవచ్చు. కాగా, సోనియాగాంధీ నుంచి జాబితా క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నామని, అప్పటి వరకూ తాము అధికారికంగా ఏమీ చెప్పలేమని పార్టీ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. కాంగ్రెస్‌లో మార్పులనేవి చివరి నిమిషంలో కూడా జరగవచ్చని, అది ఎవరికీ తెలియదని కూడా ఆయన పేర్కొన్నారు.

జాతీయంమరిన్ని...