Abn logo
May 22 2020 @ 00:17AM

ఇరుకిళ్ళు

కాళ్ళు ముడుసుకొని 

ఫోన్ వాడుతూ 

అర చేతిలో ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు

కాస్త కాలు చాస్తే 

ఇంటి గోడలు తగులుతున్నై..

ఇనుప డబ్బా మీద ఉన్న 

కలర్ టీవీ చూస్తున్నప్పుడు

బ్రేక్‌లో పక్కకు చూస్తే 

బైట మోరి కనవడుతున్నది..


అర్ధరాత్రి దాటినా 

కునుకు తీద్దామంటే 

పడుకునే జాగ దేవులాడే 

లోపు కోడి కూసింది..


నిద్రల నుంచి లేచి 

నిలబడి ఒళ్లు 

ఇరుసుదామంటే

రేకులకున్న ఫ్యాను 

మోచేతికి తగలవట్టే..


ఇడిసిన బట్టలు 

మడిసిన దుప్పట్లతో 

కమరా అంతా నిండు 

షాపింగ్ మాల్‌లా ఉన్నది..

పొద్దంతా ఇంట్ల గాలాడక

పొద్దుమూకంగ గట్ల 

మిద్దె మీదికి పోదామంటే 

అవి మెట్లు లేని రేకులాయే..


ఇరుకిళ్ళెందుకో 

ఈ లాక్డౌన్‌ల 

ఇంకింత ఇరుకయ్యింది..


ఇంతకు ముందు 

గాలాడకపోతుండే

గిప్పుడు 

ఊపిరాడుతలేదు..

ఖాజా అఫ్రిదీ